e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home Top Slides మన సాగు పండుగ

మన సాగు పండుగ

మన సాగు పండుగ
  • రైతుల్లో ధైర్యం, ఆత్మ విశ్వాసం నింపినం
  • నాడు 20 లక్షల ఎకరాలు పండితే గొప్ప
  • ఈ యాసంగిలో 62 లక్షల ఎకరాలపైనే
  • ఇది కాదా అభివృద్ధి? ఇది కాదా సక్సెస్‌?
  • అతిత్వరలో పెన్షన్‌ అర్హత వయస్సు తగ్గింపు
  • తాగునీటి సమస్యకు భరతవాక్యం పలికాం
  • రాష్ట్రంలో బిందెల ప్రదర్శన బందైంది
  • అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్‌, మార్చి 26 (నమస్తే తెలంగాణ): చెప్పినట్టుగా రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేసి చూపామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. దీనిద్వారా రైతుల్లో భరోసా, ఆత్మ విశ్వాసం నింపామని చెప్పారు. ఒకప్పుడు యాసంగిలో 20 లక్షల ఎకరాలు పండితే గొప్ప అనుకున్న రోజులుంటే.. నేడు 62 లక్షల ఎకరాల్లో సాగైందన్న సీఎం.. అభివృద్ధి అంటే ఇది కాదా? అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

పెన్షన్‌ వయస్సు తగ్గిస్తం
వృద్ధాప్య పెన్షన్ల వయస్సు 57 ఏండ్లకు తగ్గిస్తమని చెప్పినం.. అతి త్వరలోనే 100 శాతం దీన్ని అమలుచేస్తం. పేదలకు ఇచ్చిన మాటను నెరవేర్చుతం. ఇక పాతబస్తీకి మెట్రో రావాల్సిందే. మేము మాట ఇచ్చినం.. తప్పకుండా నెరవేర్చే ప్రయత్నం చేస్తం. నోటరీ డాక్యుమెంట్ల సమస్యను కూడా పరిష్కరిస్తం. మక్కా మసీదులోని ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తాం.

తాగునీటి గోస తీరింది
తెలంగాణలో ఒకప్పుడు తాగునీటి గోస అంతాఇంతా కాదు. ఎండాకాలంలో ఎలక్షన్‌కు పోవాలన్నా భయం ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో బిందెల ప్రదర్శన బందైపోయింది. చిన్నచిన్న సమస్యలుంటే ఉండొచ్చు కానీ.. భారీగా ఖర్చు పెట్టి.. పట్టుబట్టి.. నిర్ణీత కాల వ్యవధి పెట్టుకొని మిషన్‌ భగీరథ పథకం ద్వారా మంచినీటి సమస్యకు అంతం పలికినం. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌ ఇచ్చి 100% తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సాక్షాత్తూ కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పార్లమెంటులోనే చెప్పారు. ఇది అచీవ్‌మెంట్‌ కాదా? మంచినీళ్ల కోసం ఆరు దశాబ్దాలు ఎన్ని గోసలు పడ్డాం! 1985లో నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే నా బతుకు యుద్ధమే. అప్పుడు సిద్దిపేటలో 28 వార్డులు ఉండేవి. వార్డుకో ట్రాక్టర్‌ పెట్టి నీళ్లు సరఫరా చేసినం. పొద్దునలేచి బస్తీబస్తీ తిరిగేవాడిని. ఎన్ని గోసలు పడ్డామో ఆ భగవంతునికే తెలుసు. ఈ రోజు ఒక్క సిద్దిపేటలోనే కాదు.. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతమైనా.. గోండుగూడెం, ఆదివాసీగూడెం, లాంబాడీ తండాలో కూడా నీటి సమస్యకు భరతవాక్యం పలికినం. ప్రతిపక్షాలు దీన్ని మాత్రం అభినందించడం లేదు. నాడు బిల్లులు కట్టలేక సర్పంచులు సచ్చిపోయేటోళ్లు. నేను ఇదే సభలో చెప్పిన.. నెక్ట్స్‌ టర్మ్‌ లోపల చేయకపోతే ఓట్లు అడుగము అని చెప్పి దాన్ని పూర్తి చేసినం.

రాష్ర్టాల హక్కులు హరిస్తున్న కేంద్రం
తలసరి ఆదాయాల తారతమ్యాలపై భట్టి విక్రమార్క మాట్లాడిన తీరు ఆయన ఆర్థిక పరిజ్ఞానానికి పరాకాష్ఠ. తలసరి ఆదాయాలు, దేశ, రాష్ర్టాల స్థూల ఉత్పత్తి, వాటి పంపకాలు మన పరిధిలో ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆర్థికపరమైన అంశాలు పూర్తిగా కేంద్రం చేతిలోనే ఉంటాయి. మన పరిధిలో ఉండేది చాలా తక్కువ. ఉమ్మడి జాబితాలో రాష్ర్టాలకు ఉండే హక్కులను కేంద్ర ప్రభుత్వాలు క్రమంగా హరించి వేస్తున్నాయి. దీన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభిస్తే ఇప్పటి ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ప్రజాస్వామ్యం ఎట్లా పెరుగుతూ వస్తున్నదో అట్లా రాష్ర్టాల హక్కులను పెంచాల్సింది పోయి.. తీసుకుంటున్నారు. అందులో ఇద్దరూ పోటీపడి మరీ సమాన పాత్ర పోషించారు. రాష్ర్టాలు మొత్తుకుంటున్నా ఫలితం మాత్రం రావడంలేదు. ప్రధానమంత్రికి ఈ విషయం చాలాసార్లు చెప్పిన. లేఖలు కూడా రాసిన. తలసరి ఆదాయాలు మారాలంటే జాతీయ స్థాయిలోనే జరగాలి. మన పొరుగున ఉన్న చైనా మన కన్నా అతి తక్కువ జీడీపీతో, అతి తక్కువ వ్యవసాయ భూమితో చాలా పేదరికంలో ఉండె. కానీ డెంగ్‌ జియావోపింగ్‌ వచ్చిన తర్వాత వారి ఆలోచన మార్చుకొని ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లి ఈ రోజు ప్రపంచ రెండో ధనిక దేశంగా రూపాంతరం చెందింది. ఆ పరిస్థితులు మన దేశంలోనూ రావాలని అనేక వేదికల్లో చెప్పినం.. చెప్తూనే ఉన్నం. దీనిపై గుణాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించే వారిలో నేనూ ఒకడిని.

వ్యవసాయాన్ని పండుగ చేసినం
కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ఆర్థిక క్రమశిక్షణతో రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్తున్నం. తెలంగాణలో యాసంగి సీజన్‌లో ఎన్నడూ 15-20 లక్షల ఎకరాల సాగు దాటలేదు. ఆ 20 లక్షలు కూడా చాలా గగనం. ఈ రోజు తెలంగాణలో యాసంగిలో 65లక్షల ఎకరాలకు పైగా సాగైంది. ఇందులో వరి పంటనే 52 లక్షల ఎకరాల వరకు ఉన్నది. ఇది అభివృద్ధి కాదా? సక్సెస్‌ కాదా? ఆరేండ్లలో ఇంత పెద్ద మార్పు వచ్చింది. ఎక్కడో తప్ప రాష్ట్రమంతటా చెరువులన్నీ నిండుకుండల్లా ఉన్నయి. రైతులను ఆదుకొనేందుకు చెరువులను నింపడమే కాదు.. వాగుల్లోనూ గోదావరి జలాలను వదిలిపెడుతున్నం. కనీవినీ ఎరుగని పరిస్థితి ఇది. రైతులంతా సంతోషంగా ఉన్నరు. ఇప్పటినుంచి వచ్చే మూడేండ్లపాటు ప్రతి ఏటా 16-17 లక్షల ఎకరాలు పెరుగుతూ పోతయని అధికారులు చెప్తున్నరు. నేను ఒక్కటే మనవి చేస్తున్న. తెలంగాణలో కచ్చితంగా వ్యవసాయాన్ని పండుగ చేసినం. రైతుల్లో ధీమా వచ్చింది. ఆత్మవిశ్వాసం పెరిగింది. రైతుబంధు, రైతుబీమా వంటివి దేశంలో మరెక్కడైనా ఉన్నయా? గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా ఠంచనుగా రూ.5 లక్షలు వారి కుటుంబసభ్యులకు అందుతున్నయి. కాంగ్రెస్‌ పార్టీ కలైనా కన్నదా? వారి తలకాయలో ఈ ఆలోచన తట్టిందా? ఆనాడు తెలంగాణలో కరువులు, కాటకాలు, వలసలతో దుఃఖపూరితమైన వాతావరణం ఉండేది. గడ్డిలేక పశువులు కూడా చనిపోయిన గడ్డు పరిస్థితులుండేవి. చనిపోయిన పశువుల కళేబరాలపై రాబందులు వాలేవి. వారి కాలంలో రాబందులు తిరిగితే.. మేం రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నం.

రిజర్వేషన్ల అంశం రాష్ర్టాలకే ఇయ్యాలే
రిజర్వేషన్ల అంశం మన చేతుల్లో లేకుండా పోయింది. మన పక్కనే ఉన్న తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతున్నయి. ఒక పక్క సుప్రీంకోర్టేమో 50% మించొద్దని చెప్తున్నది. ఒక్కో రాష్ర్టానికి తారతమ్యాలు ఉంటాయని చెప్పినం. ఒక రాష్ట్రంలో గిరిజన జనాభా ఎక్కువుంటే మరో రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువ ఉంటదని చెప్పినం. మొత్తానికి 50% పెడితే సరికాదు.. దీన్ని రాష్ర్టాలకు వదిలేయాలని చెప్పినం. ఈ అంశం ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నది. మా నిర్ణయాన్ని అడిగితే రిజర్వేషన్ల అంశాన్ని రాష్ర్టాలకే వదిలేయాలని చెప్పినం.. మళ్లీ అడిగినా అదే చెప్తం. ఎవరికైతే హక్కు ఉంటుందో వారికి రిజర్వేషన్లు దక్కేలా చేస్తం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మన సాగు పండుగ

ట్రెండింగ్‌

Advertisement