మంగళవారం 26 జనవరి 2021
Telangana - Dec 22, 2020 , 02:38:27

తెలంగాణలో టూరిజం అభివృద్ధి భేష్‌

తెలంగాణలో టూరిజం అభివృద్ధి భేష్‌

  • కేంద్ర పర్యాటకశాఖ డైరెక్టర్‌ జనరల్‌ మీనాక్షీశర్మ ప్రశంసలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పర్యాటకరంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ డైరెక్టర్‌ జనరల్‌ మీనాక్షీశర్మ కితాబిచ్చారు. తెలంగాణలో టూరిజం రంగానికి అద్భుతమైన భవిష్యత్‌ ఉన్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకాభివృద్ధికి చేపట్టిన ప్రాజెక్టులు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ఆమె మూడురోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి స్వదేశీ దర్శన్‌లో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించారు. ఫర్హాబాద్‌, మన్ననూర్‌, ఉమామహేశ్వరం, ఈగలపెంటలో చేపట్టిన ఎకో టూరిజం సర్క్యూట్‌ పనులను సోమవారం పరిశీలించారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో ఉన్న టూరిజం క్రూజ్‌లను, బోట్లను, గద్వాల జిల్లా అలంపూర్‌ ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు.

హైదరాబాద్‌ లోని ప్రసిద్ధ కట్టడాలు, కుతుబ్‌షాహీల టూంబ్స్‌ పరిరక్షణ పనులను తనిఖీ చేశారు. అనంతరం  పర్యాటకభవన్‌లో పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో మీనాక్షిశర్మ సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్‌ టెంపుల్‌ టూరిజానికి కృషిచేస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆమెకు వివరించారు. టూరిజం సర్క్యూట్ల అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేయాలని కోరారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వర ఆలయ అభివృద్ధి కోసం రూ. 50 కోట్లు ఇవ్వాలని మంత్రి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పనులకు వెంటనే నిధులు మంజూరు చేసేలా చూస్తానని మీనాక్షీశర్మ హామీ ఇచ్చారు. సమావేశంలో  టూరిజం ఎండీ మనోహర్‌, ఈడీ శంకర్‌రెడ్డి, టూరిజంశాఖ సెక్రటరీ కేఎస్‌ శ్రీనివాసరాజు, టూరిజంశాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. 


logo