బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 09:06:00

న్యూస్‌రీడ‌ర్‌ మృతిపై వెంక‌య్య‌నాయుడు సంతాపం

న్యూస్‌రీడ‌ర్‌ మృతిపై వెంక‌య్య‌నాయుడు సంతాపం

న్యూఢిల్లీ: ఆకాశ‌వాణిలో న్యూస్ రీడ‌ర్‌గా ప‌నిచేసిన ఏడిద గోపాల‌రావు మృతిపై ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు విచారం వ్య‌క్తం చేశారు. గోపాల‌రావు కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. భాష‌పై ప‌ట్టు, చ‌క్క‌ని ఉచ్ఛార‌ణ శైలితో అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నార‌ని ట్వీట్ చేశారు. 'రేడియో ప్రయోక్త శ్రీ ఏడిద గోపాలరావు గారు పరమపదించారని తెలిసి విచారించాను. భాష మీద  పట్టు, చక్కని ఉచ్ఛారణ శైలితో అభిమానులను సంపాదించుకున్న వారు మంచి నటులు కూడా. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను' అని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. 


రంగ‌స్థ‌ల గాంధీ..

ఏడిద గోపాల్‌రావు ఆకాశవాణిలో సుదీర్ఘకాలం న్యూస్‌రీడర్‌గా పనిచేశారు. గ‌త‌కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ‌న నిన్న‌ ఉదయం తుదిశ్వాస విడిచారు. సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. మూడు దశాబ్దాలపాటు ఆలిండియా రేడియోలో పనిచేసిన గోపాల్‌రావు రంగస్థల నటుడిగా కూడా గుర్తింపు పొందారు. ఆకాశవాణి న్యూఢిల్లీ కేంద్రంగా తెలుగు వార్తలు చదువడంతోపాటు న్యూస్‌ సర్వీసెస్‌ డివిజన్‌కు అధిపతిగా పనిచేశారు. నాటకరంగంపై మక్కువ కలిగిన గోపాల్‌రావు 1995లో ఉద్యోగ విరమణ అనంతరం పలు నాటకాల్లో నటించారు. ‘బాపు చెప్పిన మాట’ అనే నాటకంలో  మహాత్మాగాంధీ పాత్ర ద్వారా రంగస్థల గాంధీగా పేరు తెచ్చుకున్నారు. అనేక సాంస్కృతిక సంస్థల ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు. ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వర్‌రావుకు తమ్ముడైన గోపాల్‌రావు ‘సరస నవరస’ అనే సంస్థను స్థాపించి ఢిల్లీ, హైదరాబాద్‌లో జాతీయ నాటకోత్సవాలు నిర్వహించారు.