బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 24, 2020 , 01:19:38

దుష్టశక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

దుష్టశక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
  • దేశసమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొట్టాలి
  • ఆలిండియా పోలీసు బ్యాండ్‌ పోటీల ముగింపు ఉత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఈ సమయంలో బలగాలు, సమాజం అప్రమత్తంగా ఉండాలని, దుష్టశక్తులను సమిష్టిగా అడ్డుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఆదివారం నిర్వహించిన 20వ ఆలిండియా పోలీసు బ్యాండ్‌ పోటీల ముగింపు ఉత్సవంలో ఆయన ప్రసంగించారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని రగిలించడంలో పోలీసు బ్యాండ్‌ పాత్ర కీలకమన్నారు. దేశ పోలీసువ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉన్నదని, ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీసుల వద్దకే ముందు వెళ్తారని, వచ్చినవారికి భరోసా ఇచ్చేలా పోలీసులు వ్యవహరించాలని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలుచేయాలని, ఇదే సమయంలో పోలీసులు శారీరకంగా, మానసికంగా ధ్రుడంగా ఉండేందుకు నాణ్యమైన జీవితం, విధి నిర్వహణలో అప్రమత్తతకు తప్పకుండా యోగా చేయాలని సూచించారు. భారతీయులంతా ఒక్కటే అనే జాతీయ భావాన్ని ప్రతిఒక్కరు మదిలో నింపుకొని ముందుకు వెళ్లాలన్నారు. బ్యాండ్‌లో పాల్గొన్న వివిధ రాష్ట్రాలు, పోలీసు బలగాల బ్యాండ్‌ను వీక్షించిన ఉపరాష్ట్రపతి దేశభక్తి, జాతీయవాదాన్ని పెంపొందించేలా ప్రదర్శనలున్నాయని అభినందించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఉపరాష్ట్రపతి  బహుమతులు ప్రదానం చేశారు. సర్వోత్తమ ట్రోఫీని సీఆర్పీఎఫ్‌కు అందజేశారు. బ్రాస్‌ బ్యాండ్‌, పైప్‌ బ్యాండ్‌, బుగ్‌లర్స్‌ విభాగంలో విజేతలకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆర్పీఎస్‌ డీజీ అరుణ్‌కుమార్‌, దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా, కార్యక్రమ నిర్వాహకుడు జీఎం ఈశ్వర్‌రావు, ఆర్పీఎఫ్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు. logo