శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 20:59:26

42 ఏళ్ల తర్వాత రాజన్న ఆలయం మూసివేత

42 ఏళ్ల తర్వాత రాజన్న ఆలయం మూసివేత

వేములవాడ: నిత్యం భక్తుల సందర్శనతో కళకళలాడే  వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం  వెలవెలబోతున్నది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావంతో ఆలయాలకు భక్తుల సందర్శనను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయగా, రాజన్న ఆలయంలోనూ అధికారులు అమలు చేశారు. ఇక ఆలయ చరిత్రలోనే వందేళ్ల క్రితం ప్లేగు వ్యాధి ప్రబలడంతో మూడు మాసాలు ఆలయానికి భక్తుల తాకిడిని నిలుపుదల చేయగా, 1978లో వచ్చిన కలరా వ్యాధితో నెల పాటు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలను నిలిపివేశారు. తాజాగా కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా జన సందోహన్ని నియంత్రించేందుకు 42 ఏళ్ల అనంతరం ఆలయాన్ని మూసివేశారు. 

స్వామివారి నిత్యసేవలను యథావిధిగా కొనసాగించినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. స్వామివారి సన్నిధికి రోజూ దాదాపు 5 వేలకు పైగా భక్తుల తాకిడి ఉంటుంది. కరోనా ప్రభావంతో మూసివేయగా ఆలయ పరిసరాలు వెలవెలబోతున్నాయి. రాజన్న ఆలయంలోనికి అనుమతించక పోవడంతో భక్తులు ఆలయ మెట్లపైననే కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుని తిరుగు ప్రయాణమయ్యారు. 

కొనసాగుతున్న చతుష్కాల పూజలు

రాజన్న దర్శనాన్ని మాత్రమే అధికారులు నిలుపుదల చేశారని, స్వామివారికి ప్రతి నిత్యం అందించే చతుష్కాల పూజలను (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి) మాత్రం యథావిధిగా కొనసాగిస్తామని ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమా శంకర్‌ పేర్కొన్నారు. లోక కల్యాణార్థం చేపట్టిన ఈ కార్యక్రమానికి భక్తులు సహకరించాలని ఆయన కోరారు. రాజన్న అనుబంధ దేవాలయాలైన శ్రీ భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ, శ్రీనగరేశ్వరాలయాలు కూడా మూసి ఉండడంతో భక్తులు ముందు నుంచే స్వామి, అమ్మవార్లను దర్శించుకొని వెనుదిరిగారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు  ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలను పాటించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పేర్కొన్నారు. శుక్రవారం రాజన్న ఆలయ పరిసరాలను పరిశీలించి వేములవాడ పట్టణ ప్రధాన రహదారుల్లో మైక్‌ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.logo