గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 02:06:04

రెవెన్యూ డివిజన్‌గా వేములవాడ

రెవెన్యూ డివిజన్‌గా వేములవాడ

  • ఆరు మండలాలతో ఏర్పాటు
  • తుది గెజిట్‌ జారీచేసిన సీఎస్‌
  • 74కు చేరిన రెవెన్యూ డివిజన్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/వేములవాడ: దక్షిణకాశీగా భాసిల్లుతున్న వేములవాడ కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. దీని పరిధిలోకి రుద్రంగి, కోనరావుపేట, బోయినపల్లి, వేములవాడ, వేములవాడ రూరల్‌, చందుర్తి మండలాలను తీసుకొచ్చింది. వేములవాడ డివిజన్‌ ఏర్పాటుపై ఈ ఏడాది ఫిబ్రవరి1న ప్రాథమికంగా అభ్యంతరాలు కోరుతూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ముగియడంతో డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ.. గురువారం ఫైనల్‌ గెజిట్‌ విడుదల చేశారు. నూతన రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాన్ని స్థానిక మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలోనే ఏర్పాటుచేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వేములవాడను రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని 2018 డిసెంబర్‌లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు సీఎం కేసీఆర్‌ను కోరారు. ఇందుకోసం చొరవచూపిన సీఎంకు రమేశ్‌బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో 74కు చేరిన రెవెన్యూ డివిజన్లు

పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్‌లో దసరా రోజున 21 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అలాగే 21 రెవెన్యూ డివిజన్లు, 119 మండలాలను నూతనంగా ఏర్పాటుచేసింది. దీంతో 31 కొత్త జిల్లాలు, 65 రెవెన్యూ డివిజన్లు, 578 మండలాలు ఏర్పాటయ్యాయి. తర్వాతికాలంలో ప్రజల విజ్ఞప్తుల మేరకు ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేసింది. దానితో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కు పెరిగింది. ప్రజల నుంచి వివిధ సందర్భాల్లో వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం 9 కొత్త డివిజన్లను ఏర్పాటు చేసింది. తాజాగా వేములవాడను కలుపుకొంటే రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్ల సంఖ్య 74కు చేరింది.

వేములవాడ ప్రజలు సీఎంకు రుణపడి ఉంటారు

వేములవాడ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుచేసిన సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌.. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారని, మిడ్‌మానేరు నుంచి తాగునీరు అందిస్తున్నారని ఆయన గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు వేములవాడ ప్రాంత ప్రజలు ఎంతో రుణపడి ఉంటారని చెప్పారు.


logo