మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 28, 2020 , 12:44:39

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై వాహ‌నాల‌కు అనుమ‌తి

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై వాహ‌నాల‌కు అనుమ‌తి

హైద‌రాబాద్‌: న‌గ‌రంలో మ‌రో వంతెన వాహ‌న‌దారుల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. దుర్గం చెరువుపై అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో నిర్మంచిన తీగ‌ల వంతెనపై వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అధికారులు అనుమ‌తించారు. అయితే బ్రిడ్జిపై 40 కి.మీ. కంటే వేగంగా వాహ‌నాలు న‌డ‌ప‌కూడ‌ద‌ని ట్రాఫిక్ పోలీసులు సూచిక‌లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాహనాల  రాక‌పోక‌లను ప‌రిశీలిస్తున్నారు. వంతెన‌పై ప‌రిమితికి మించి వేగంగా వెళ్లే వాహానాల‌కు చ‌లానా విధిస్తున్నారు. పెద్ద గూడ్స్ వాహ‌నాల‌ను వంతెన‌పైకి అనుమ‌తించ‌డం లేదు. కాగా, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రావ‌డంతో సంతోషిస్తున్న న‌గ‌ర‌వాసులు వంతెన‌పై వాహ‌నాలు ఆపి ఫొటోలు దిగుతున్నారు. 

చారిత్ర‌క హైదరాబాద్ న‌గ‌రానికి మరింత అందం చేకూర్చేలా దుర్గం చెరువుపై అత్యాధునిక ప‌రిజ్ఞానంతో కేబుల్ బ్రిడ్జిని రాష్ట్ర‌ప్ర‌భుత్వం నిర్మించింది. రూ.184 కోట్ల వ్య‌యంతో నిర్మించిన ఈ తీగ‌ల వంతెన‌ను మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ సెప్టెంబ‌ర్ 25న ప్రారంభించారు. 735.639 మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్లతో నిర్మించిన ఈ వంతెనతో జూబ్లీహిల్స్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ మధ్య దూరంతోపాటు, ట్రాఫిక్ ర‌ద్దీ తగ్గనుంది. దీంతోపాటు దుర్గం చెరువులో బోటింగ్‌ను, కేబుల్ బ్రిడ్జికి అనుసంధానంగా జూబ్లీహిల్స్ రోడ్ నం. 45 నుంచి నిర్మించిన ఎలివేటెడ్ కారిడార్‌ను ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. దీనికి పెద్ద‌మ్మ‌త‌ల్లి ఎక్స్‌ప్రెస్ వే అని పేరుపెట్టారు.


logo