సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 01:57:50

కూరకు చాలని సాగు

కూరకు చాలని సాగు

  • వినియోగం కంటే తక్కువగా పండుతున్న కూరగాయలు 16రకాలు
  • తినాల్సింది 46 లక్షలు.. తింటున్నది 36 లక్షల టన్నులు 
  • ఐసీఎంఆర్‌ సూచనలు.. ప్రజల అలవాట్లకు మధ్య భారీతేడా
  • మరో 2.67 లక్షల ఎకరాల్లో సాగు చేస్తేనే సమృద్ధి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ప్రజల వినియోగానికి అవసరమైన కూరగాయలకు.. వాటి ఉత్పత్తికి భారీ వ్యత్యాసం ఉంటున్నది. మొత్తం 20 రకాల కూరగాయల్లో 16 రకాలు అవసరం కంటే తక్కువగా పండుతున్నాయి. దీంతో ప్రజలు సాధారణంగా వినియోగించాల్సిన స్థాయిలో వాడటం లేదని తెలుస్తున్నది. ఐసీఎంఆర్‌ సూచనల ప్రకారం రాష్ట్రంలో ఏటా 46.80 లక్షల టన్నుల కూరగాయలు వాడాల్సి ఉండగా 36 లక్షల టన్నులు మాత్రమే వినియోగిస్తున్నారు. ఇందులో రాష్ట్రం లో ఉత్పత్తవుతున్నవి 30.71 లక్షల టన్నులు మాత్రమేనని వ్యవసాయవర్సిటీ నివేదిక రూపొందించింది. పండ్లు, మసాలా దినుసుల ఉత్పత్తిలో ఇబ్బంది లేకున్నా.. కూరగాయల దిగుబడి అంతగా లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నదని తెలిపింది. ఇటీవల ఉద్యానపంటల సాగుపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వాటి సాగును పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే ఉద్యానశాఖ అధికారులు.. వ్యవసాయ వర్సిటీతో కలిసి కూరగాయల సాగు, వినియోగంపై నివేదికను రూపొందించారు. రాష్ట్రంలో కూరగాయల వినియోగం ఎంత? ఎంత విస్తీర్ణంలో పండుతున్నాయి? తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదికను తయారుచేశారు.

నాలుగు రకాలు మాత్రమే సరిపోయేంత..

రాష్ట్రంలో అవసరమైన కూరగాయల్లో 16 రకాలు తక్కువగా పండుతుండగా.. నాలుగు రకాలు మాత్రమే సరిపోయేంత ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. తక్కువగా పండేవాటిలో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, బీర, కాకర, దొండ, సొర, మునగ, దోసకాయలు, బీన్స్‌, క్యాబేజీ, క్యాలిఫ్లవర్‌, క్యాప్సికం, ఆలుగడ్డ, క్యారెట్‌, చామగడ్డ తదితర కూరగాయలు ఉన్నాయి. టమాట, బెండకాయ, వంకాయతోపాటు కొన్ని దుంపలు మాత్రమే వినియోగానికి మించి పండుతున్నట్టు తెలిపారు. ఈ నాలుగు రకాలు కలిపి 7.72 లక్షల టన్నులు అధికంగా పండుతుంటే.. ఇతర రకాలు 13 లక్షల టన్నులు తక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్రంలో టమాట అవసరాలు పోను 5.57 లక్షల టన్నులు ఎక్కువగా ఉత్పత్తి అవుతుండగా.. ఉల్లిగడ్డ 1.68 లక్షల టన్నులు తక్కువగా పండుతున్నది. రాష్ట్రంలో పండ్లు, మసాలాల (స్పైసెస్‌) ఉత్పత్తి మాత్రం సరిపోను ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారు. ఇందులో ఐదురకాల పండ్లు అవసరానికి మించి ఉత్పత్తవుతుంటే.. 9 రకాల పండ్లు తక్కువగా ఉన్నాయి. రెండు రకాల మసాలాలు ఎక్కువగా.. 6 రకాల మసాలాలను తక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్ర అవసరాలకు కూరగాయలు, పండ్లు, మసాలా దినుసులను ఉత్పత్తి చేసేందుకు సాగువిస్తీర్ణాన్ని మరో 3.99 లక్షల ఎకరాలు పెంచాలని నివేదికలో సూచించారు. ప్రస్తుతం 11.71 లక్షల ఎకరాల్లో ఉద్యానపంటలు సాగవుతున్నాయి. ఈ విస్తీర్ణాన్ని 15.7 లక్షల ఎకరాలకు పెంచాలని పేర్కొన్నది. కూరగాయలను 3.51 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా.. అదనంగా 2.37 లక్షల ఎకరాలకు పెంచాలని సూచించింది. 

అవసరమైనంత తింటలేరు

రాష్ట్ర ప్రజలు శరీరానికి అవసరమైనస్థాయిలో కూరగాయలు, పండ్లు తీసుకోవడం లేదని నివేదికలో స్పష్టంచేశారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ప్రకారం ప్రతివ్యక్తి ఏడాదికి 117 కిలోల కూరలు తినాలి.. కానీ, 90 కిలోలు మాత్రమే తింటున్నారు. 36 కిలోల పండ్లకు 31.10, 9 కిలోల మసాలా దినుసులకు 7.72 కిలోలు వినియోగిస్తున్నారు. వీటన్నింటికోసం ప్రజలు ఏడాదికి సగటున రూ. 6,089 ఖర్చు చేస్తున్నారు.