మంగళవారం 02 జూన్ 2020
Telangana - Apr 11, 2020 , 01:29:39

ఆన్‌లైన్‌లో కూరగాయలు

ఆన్‌లైన్‌లో కూరగాయలు

  • మన్నూర్‌ రైతుల వినూత్న విధానం 
  • వాట్సాప్‌ లొకేషన్‌తో ఇంటికే సరఫరా
  • లాక్‌డౌన్‌తో నష్టపోకుండా ఆలోచన
  • పే-యాప్‌లతో నగదు చెల్లింపులకు అవకాశం

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి: లాక్‌డౌన్‌ కారణంగా తాము పండించిన కూరగాయల విక్రయాలు నిలిచిపోకుండా ఆదిలాబాద్‌ జిల్లా రైతులు వినూత్న ఆలోచనచేశారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇండ్లకే నేరుగా తాజా కూరగాయలు అందజేయాలని నిర్ణయించుకున్నారు.  మొన్నటివరకు దళారులకు తక్కువ ధరకు తమ పంటలను అమ్మిన రైతులు.. సరికొత్త విధానం ద్వారా గిట్టుబాటు ధర లభించడంతోపాటు వినియోగదారులకూ తాజా కూరగాయలను అందిస్తున్నారు. ఫలితంగా ప్రజలకు లాక్‌డౌన్‌ సమయంలో బయటకు వెళ్లే అవసరమూ లేకుండాపోయింది. ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం మన్నూర్‌ గ్రామానికి చెందిన దాదాపు 300మంది రైతులు ఏండ్లుగా వివిధ రకాల కూరగాయలు సాగుచేస్తున్నారు. 22 రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలతో ఉపాధి పొందుతున్నారు. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌తోపాటు మహారాష్ట్రలోని నాగాపూర్‌, హింగన్‌నాట్‌, చంద్రాపూర్‌ తదితర ప్రాంతాలకు చెందినవారు మన్నూర్‌కే వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్లేవారు. లాక్‌డౌన్‌తో గత 20 రోజులుగా కూరగాయల అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకుందామంటే రవాణాసౌకర్యం లేక చాలామంది పంటను కోయకుండానే వదిలేశారు. పరిస్థితి ఇలానే ఉంటే రూ.లక్షల్లో నష్టపోయే ప్రమాదం ఉన్నదని గుర్తించిన కొందరు చదువుకున్నవారు సరికొత్త ఆలోచన చేశారు. తోటి రైతులతో చర్చించి రోజూ ఎంతమేర దిగుబడి వస్తుందనేది అంచనావేసి పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అమ్మాలని నిర్ణయించారు. 

ఆన్‌లైన్‌ విక్రయం.. వాట్సాప్‌ షేరింగ్‌ 

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే ఇంటికే తాజా కూరగాయలను పంపిస్తామంటూ గ్రామస్థులు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంచేశారు. కూరగాయలు కావాల్సిన వారు చిరునామాను వాట్సాప్‌లో షేర్‌చేస్తే వారి ఇంటికే పంపిణీ చేస్తున్నారు. కూరగాయల కిట్‌తోపాటు, ధరను కూడా ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. ఒకరోజు ముందు ఆర్డర్‌ తీసుకొంటారు. మర్నాడు ఉదయం 9నుంచి 11.30 సమయంలో పంపిణీ చేస్తున్నారు. ప్రజల వద్ద నగదు కొరత ఉంటే గూగుల్‌పే, పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించే అవకాశాన్ని కూడా కల్పించారు. నాలుగు రోజుల నుంచి తాజా కూరగాయలు సరఫరా చేస్తున్నామని, గురువారం 350 మందికి పంపిణీ చేసినట్టు రైతు కే సురేశ్‌ తెలిపారు. శుక్రవారం వరకు 1000 ఆర్డర్లు వచ్చాయని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తాజా కూరగాయలు లభిస్తుండటంతో ప్రజలు కూడా హర్షం వ్యక్తంచేస్తున్నారు.


logo