శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 12:21:50

వీణావాణి కూడా మాస్కులు ధరించి పరీక్షకు హాజరు

వీణావాణి కూడా మాస్కులు ధరించి  పరీక్షకు హాజరు

హైదరాబాద్‌: ఆ బంధం ప‌ట్టువీడ‌నిది. కానీ వారి ప‌ట్టుద‌ల అంత‌కుమించిన‌ది. అవిభ‌క్త క‌వ‌ల‌లే అయినా.. వారి ఆత్మ‌స్థైయిర్యం అనిర్వ‌చ‌నీయ‌మైంది. ఒక‌వైపు మ‌హ‌మ్మారి క‌రోనా కోర‌లు చాస్తున్నా.. వీణావాణీలు చెక్కుచెద‌ర‌ని ఆత్మ‌విశ్వాసంతో టెన్త్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు.  అవిభక్త కవలలు వీణావాణి పుట్టి పదిహేను సంవత్సరాలు అవుతోంది. వీరిని వేరు చేసేందుకు వైద్యులు ఎన్నో సార్లు ప్రయత్నించారు.. కానీ సాధ్యం కాలేదు. ఇన్నాళ్లు వారు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇప్పుడు ఆ అవిభక్త కవలలు.. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో.. వీణావాణి ఇద్దరూ మాస్కులు ధరించి ఎగ్జామ్‌ సెంటర్‌లోకి వెళ్లారు.

ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. అమీర్‌పేటలోని స్టేట్‌ హోంలో ఉంటున్న వీణావాణి టెన్త్‌ పరీక్షలకు హాజరయ్యారు. మధురానగర్‌లోని ప్రతిభ హైస్కూల్‌లో వీరు పరీక్షలు రాసేందుకు అధికారులు అనుమతిచ్చారు. ఎగ్జామ్‌ సెంటర్‌లో ఈ అవిభక్త కవలల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్టేట్‌ హోం నుంచి వీరిద్దరిని ప్రత్యేక వాహనంలో పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చారు. అవిభక్త కవలల కోసం చేసిన ఏర్పాట్లను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ పరిశీలించారు.


logo