సోమవారం 01 జూన్ 2020
Telangana - May 24, 2020 , 00:58:14

కొత్త రకం తోట.. కోటి రొక్కం పంట

కొత్త రకం తోట.. కోటి రొక్కం పంట

  • డ్రాగన్‌ ఫ్రూట్‌, బ్రెజిల్‌ మోసంబి, బర్షి కర్జ్జూర, థాయ్‌సెవన్‌ జామ 
  • 30 ఎకరాల్లో రకరకాల పంటలు..  ఏడాదికి కోటి రూపాయల రాబడి

పంటలు పండుతున్నాయి కానీ గిట్టుబాటు కావడం లేదు.. డిమాండ్‌ ఉన్నది కానీ పంటలు లేవు.. ఈ విషయం ఓ యువరైతు ఆలోచనను పూర్తిగా మార్చేసింది. 

సంప్రదాయసాగుకు స్వస్తిచెప్పి.. కొత్తరకం పంటల వైపు మళ్లించింది. నిర్మల్‌ జిల్లా బాసరకు చెందిన యువరైతు సందీప్‌ తనకున్న 30 ఎకరాల్లో డ్రాగన్‌ఫ్రూట్‌, బ్రెజిల్‌ మోసంబి, బర్షి కర్జూర, థాయ్‌సెవన్‌ జామ తోటలను సాగుచేస్తూ ఏడాదికి కోటికిపైగా  ఆదాయం సంపాదిస్తున్నారు. 

బాసర: వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్‌, మినుము, పెసర, పసుపు తదితర పంటల పేర్లు తరుచూ వింటున్నాం. తెలంగాణ నేలల్లో వాటినే సాగుచేస్తున్నాం. నిర్మల్‌ జిల్లాలో ఓ యువరైతు మాత్రం డ్రాగన్‌ఫ్రూట్‌, బ్రెజిల్‌ మోసంబి, థాయ్‌సెవన్‌ జామ వంటి కొత్తకొత్త రకాలను సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. బాసరకు చెందిన సందీప్‌ అనే రైతు 30 ఎకరాల్లో వీటిద్వారా ఏడాదికి కోటి రూపాయలకు పైగా ఆదాయం పొందుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల రైతులు సందీప్‌ వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించి.. వాటి సాగు వివరాలను తెలుసుకుంటున్నారు. కాప్టాస్‌ కుటుంబానికి చెందిన డ్రాగన్‌ మొక్కపేరు పిథాయా. దీని శాస్త్రీయనామం ఐలోసరస్‌ అండడాస్‌. మెక్సికో, మధ్య, దక్షిణ అమెరికాలో ఎక్కువగా పండుతుంది. ఇటీవలకాలంలో చైనాతోపాటు పలు ఆసియాదేశాల్లోనూ సాగు చేస్తున్నారు. 

రాళ్లు రప్పలతోకూడి, తడి త్వరగా ఆరిపోయే నేలలు, 20 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండే నేలలు ఈ పంటకు అనుకూలం. అనేక రకాల పోషక విలువలు ఉండే డ్రాగన్‌ ఫ్రూట్‌కు వాణిజ్యపరంగా మంచి డిమాండ్‌ ఉన్నది. ప్రతి ఐదుఅడుగులకు ఒక స్తంభాన్ని ఏర్పాటుచేసి, దాని మొదట్లో మొక్కలను నాటుతారు. రెండేండ్లకు మొక్క పుష్పిస్తుంది. పువ్వు రాలిన నెలకు కాయ పక్వానికి వస్తుంది. పండు లోపల తెల్లగా ఉండి గుజ్జు, ముదురు గులాబీ రంగులో రెండురకాల ఫలాలు ఉంటాయి. ముదురు గులాబీ రంగు పండు నాణ్యమైనది. సాగులో చీడపీడల బాధ పెద్దగా ఉండదు. బిందుసేద్యం ద్వారా సాగు చేయవచ్చు. మొదటిసారిపంట రెండేండ్లలో కోతకు వస్తుంది. తర్వాతి ఏడాది నుంచి నాలుగు నెలలపాటు పూలు, కాయ వస్తుంది. మార్కెట్లో కిలో ధర రూ.350కు పైగా పలుకుతుంది. దీనిని మొదటిసారి సాగుచేయడానికి ఎకరానికి రూ.5లక్షల పెట్టుబడి అవసరం. ఎకరానికి సుమారు 6 టన్నుల దిగుబడి వస్తుంది. డ్రాగన్‌ ఫ్రూట్‌ను ఐదెకరాల్లో సాగుచేసి ఎకరానికి 12 లక్షలకుపైగా ఆదాయం పొందుతున్నట్టు యువరైతు సందీప్‌ చెప్తున్నారు.


నల్లరేగడి నేలల్లో కర్జ్జూర సాగు

బ్రిటన్‌లోని సోమర్‌సెట్‌కు చెందిన డేట్‌ఫామ్స్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ సృష్టించిన రకం బర్షి కర్జ్జూర. ఒక్కో కర్జూర మొక్కకు రూ.6వేలు అవుతుంది. ఎకరంలో వీటిని 60 వరకు నాటవచ్చు. ఒక్కోచెట్టు దాదాపు 70 కిలోల దిగుబడి ఇస్తుంది. మార్కెట్‌లో కిలో రూ. 150 పలుకుతుంది. నాణ్యమైన కర్జూరకు ఇంకా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఎడారి నేలల్లో పెరిగే కర్జ్జూర మొక్కలు బాసరలోని నల్లరేగడి నేలలోనూ పెరుగుతున్నాయి. మొక్కలు నాటిన మూడేండ్లలో గెల వేయడం మొదలవుతుంది. వీటిసాగుకు నీటి అవసరం తక్కువ. ఒక్క పెండపురుగు ఆశించడంతప్ప ఇతర చీడ, పీడల బాధ ఉండదు. మగ, ఆడ చెట్లు రెండురకాల నాటితేనే కాత వస్తుంది. సందీప్‌ నాలుగు ఎకరాల్లో దీనిని సాగుచేయగా.. చెట్లు గెలలు వేస్తున్నాయి. 

థాయ్‌సెవన్‌ జామ


పంట వేసిన ఎనిమిది నెలల్లోనే థాయ్‌సెవన్‌ జామ దిగుబడి మొదలవుతుంది. మొక్కలు వేయడానికి ఎకరానికి దాదాపు రూ.30 వేలు ఖర్చవుతుంది. నాలుగు టన్నులకు పైగా దిగుబడి వస్తుండటంతో కిలో రూ.80 పలికినా రూ.3లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. యువరైతు సందీప్‌ ఈ పంటను ఎనిమిది ఎకరాల్లో సాగుచేస్తున్నారు.

తియ్యని పంట బ్రెజిల్‌ మోసంబి

మహారాష్ట్రలో సాగవుతున్న బ్రెజిల్‌ మోసంబిని పరిశీలించిన సందీప్‌ 11 ఎకరాల్లో దీనిని సాగుచేస్తున్నారు. దీనిసాగుకు ఎకరాకు రూ. 70 వేల ఖర్చవగా.. 6 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ మోసంబి మార్కెట్‌లో కిలో రూ.100కు పైగా ధర పలుకుతుంది. వీటి అమ్మకానికి యువరైతు మహారాష్ట్రలోని జైన్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మోసంబిని జైన్‌ కంపెనీవారు పల్పీఆరెంజ్‌ జ్యూస్‌ను తయారుచేయడానికి వినియోగిస్తారు. తీయదనం ఎక్కువగా ఉంటుండంతో చక్కెరను కలుపకపోయినా చాలా రుచిగా ఉంటుంది.

విభిన్న పంటలే మేలు

సాధారణ పంటలు వాణిజ్యపరంగా అంతగా లాభాలు తీసుకురావడం లేదు. మద్దతు ధర తక్కువగా ఉండటంతో తక్కువ ఆదాయం వస్తున్నది. దీంతో డిమాండ్‌ అధికంగా ఉన్న పంటలను ఆలోచించి సాగు చేస్తున్నాను. సాగుచేయడానికి అనుకూలంగా భూమి ఉండటం, మార్కెట్‌లో అధిక ధర పలుకుతుండటంతో వీటిసాగుపై దృష్టి సారించా. ముందుగా కోల్‌కతా, గుజరాత్‌, మహారాష్ట్ర, కాకినాడ తదితర ప్రాంతాలకు వెళ్లి అక్కడి తోటలను పరిశీలించాను. ఏడాదికి దాదాపు రూ. కోటికిపైనే సంపాదిస్తున్నాను. ప్రభుత్వం డ్రిప్‌ ఇరిగేషన్‌కు సబ్సిడీ ఇచ్చింది. వ్యవసాయాధికారులు పంటల సాగును పరిశీలించి మార్కెటింగ్‌, ఇతర సౌకర్యాలు అందించేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. రైతులు పెద్దఎత్తున మా వ్యవసాయక్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. 

-సందీప్‌, యువ రైతు, బాసర


logo