బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 03:51:00

జైనుల కోట్ల నర్సింహులపల్లె

జైనుల కోట్ల నర్సింహులపల్లె

  • కనుమరుగైన వేల ఏండ్ల చరిత్ర వెలుగులోకి 
  • బయటపడ్డ క్రీ.పూ. పదో శతాబ్దం నాటి విగ్రహాలు
  • కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలంలో జైన తీర్థంకరుడు వృషభనాథుడి ఆనవాళ్లు
  • పూర్తి వివరాలు సేకరించండి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 
చరిత్రను మనం మరిచినా కాలం మరువదు. వందలు, వేల ఏండ్లు గడిచినా నిజం బయటపడక మానదు. మరుగునపడ్డ గొప్పదనం ఏనాటికైనా తెలియకపోదు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే కరీంనగర్‌ జిల్లా కోట్ల నర్సింహులపల్లెలో తాజాగా బయటపడ్డ జైనుల ఆనవాళ్లు. 
జగిత్యాల, నమస్తే తెలంగాణ/గంగాధర: అది కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కోట్ల నర్సింహులపల్లె గ్రామం. చిన్న ఊరే గానీ వేల ఏండ్ల చరిత్ర దాని సొంతం. ఒక్క మాటలో చెప్పాలంటే అది జైనుల కోట. కొన్నేండ్లుగా ఆ ఊరిలో జైన తీర్థంకరుల శి ల్పాలు బయటపడుతూనే ఉన్నాయి. మూడేండ్ల క్రితం పీఠిక, రెండేండ్ల క్రితం 23 వ తీర్థంకరుడు పార్శనాథుడి విగ్రహం బయటపడింది. తాజాగా జైనమత తొలి తీర్థంకరుడు వృషభనాథుడి విగ్రహం బయటపడింది. గ్రామానికి చెందిన ఒగ్గు అంజ య్య తన పొలంలో గురువారం ట్రాక్టర్‌తో దున్నుతుండగా బయటపడిందీ విగ్రహం. పద్మాసనం వేసుకొని, ధ్యానంలో ఆ విగ్ర హం మీటర్‌ ఎత్తు ఉన్నది. గతంలో విగ్రహా లు కూడా అంజయ్య పొలంలోనే బయటపడ్డాయి. దీనిపై పూర్తివివరాలు సేకరించాలని పర్యాటక, పురావస్తుశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శనివారం అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన ఆయ న.. పురావస్తు అధికారుల బృందాన్ని కోట్ల నర్సింహులపల్లెకు పంపాలని చెప్పారు. విగ్రహాలను పరిశీలించి పూర్తి వివరాలతో నివేదికను అందజేయాలని సూచించారు. గంగాధర, రామడుగు, బోయినపల్లి చారిత్రక ప్రా ధాన్యం ఉన్న మండలాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ చెప్పారు. వేములవాడ, కురిక్యాల, గంగాధర, కోట్ల నర్సింహుపల్లె, నందగిరి గ్రామాల్లో అధ్యయనం చేయించి ఈ ప్రాంత గొప్పతనాన్ని ప్రపం చం ముందు ఉంచుతామన్నారు. గ్రామాన్ని సందర్శించిన పురావస్తు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌.. ఆ విగ్రహాలు క్రీస్తుపూ ర్వం పదో శతాబ్దం నాటివని తెలిపారు. 

మరుగునపడ్డ కోట్ల నర్సింహులపల్లె చరిత్ర

కోట్ల నర్సింహులపల్లె చరిత్ర గత పాలకుల నిరాధారణతో మరుగున పడిందని చరిత్రకారులు అంటున్నారు. మౌర్యవంశ చక్రవర్తుల కంటే ముందు మగధ రాజధానిగా పాలించిన నందవంశానికి చెందిన మహాపద్మనందుడు, దక్షిణ భారతంపైకి దండెత్తి పోదన(బోధన్‌) రాజధానిని ఆక్రమించుకున్నట్టు తెలుస్తున్నది. పోదనను రక్షించుకునే క్రమంలో కోట్ల నర్సింహులపల్లె సమీపంలో ఉన్న నందగిరి కొండలపై కోటను నిర్మించినట్టు చరిత్ర చెప్తున్నది. 

జైనమత కేంద్రంగా..

క్రీస్తుశకం 900 నుంచి 1200 సంవత్సరాల మధ్య కోట్లనర్సింహులపల్లె జైనమత కేం ద్రంగా విలసిల్లినట్టు తెలుస్తున్నది. రాష్ట్ర కూటులకు సామంతులుగా ఉత్తర తెలంగాణను పాలించిన వేములవాడ చాళుక్యుల కాలంలో ఈ గ్రామం గొప్పక్షేత్రంగా అభివృద్ధి చెందినట్లు స్థలపురాణం చెప్తున్నది. గంగాధర మండలం కురిక్యాలలోని వృషభాద్రి కేంద్రంగా పంపకవి సోదరుడు జీనవల్లభుడు జైన బసదిని నిర్మించాడు. ఇక్కడే తెలుగుభాషలో తొలి కందపద్యాలు లభ్యమయ్యాయి. దీనికి సమీపంలోనే కోట్ల నర్సింహులపల్లె ఉంది. నర్సింహులపల్లెలో విరివిగా జైనమత విగ్రహాలు లభ్యమవుతున్నందున ఇక్కడ కూడా జైనమత బసది లేదా పాఠశాల ఉండి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


logo