గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 00:50:16

మాదిగలపై మనువాదుల దాడి

మాదిగలపై మనువాదుల దాడి

కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి దేశంలో మనువాదుల ముసుగులో దళితులపై దాడులు పెరుగుతున్నాయని టీఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ ఆరోపించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజిపేట మాదిగకాలనీకి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వంగపల్లి మాట్లాడుతూ.. రామోజిపేటలో దళితులపై జరిగిన దాడితో రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడిందన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మనువాదులు కక్షపూరితంగా ఇండ్లపైకి వచ్చి దాడి చేశారని మండిపడ్డారు. ఈ ఘటనలో 8 మందికి పైగా గాయాలపాలయ్యారని.. ఇండ్లు, బైక్‌లను ధ్వంసం చేశారని తెలిపారు. గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని పెట్టాలని తీర్మానించడాన్ని జీర్ణించుకోలేక గొడవచేసి అదేప్రాంతంలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటుచేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ దాడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, బీజేపీ మండలాధ్యక్షుడు తిరుపతిరెడ్డిని బాధ్యులను చేస్తూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. టీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యచరణ ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొండ శంకర్‌, నాంపల్లి బాబురావు, శ్రీనివాస్‌, సంపత్‌, ప్రభు, తదితరులున్నారు.