సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 01:29:57

వాసాలమర్రికి వైభోగం

వాసాలమర్రికి వైభోగం

  • గ్రామాన్ని దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
  • రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తానని హామీ
  • రెండున్నర గంటలపాటు సమస్యలపై గ్రామస్థులతో చర్చ

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి మహర్దశ పట్టనున్నది. ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో వాసాలమర్రి గ్రామప్రజలు, ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ రెండున్నర గంటలపాటు చర్చించారు. అక్టోబర్‌ 31న జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించి తిరుగు ప్రయాణంలో వాసాలమర్రి వద్ద ఆగిన సీఎం కేసీఆర్‌.. కొద్దిసేపు స్థానికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యలను సీఎంకు తెలుపగా.. వాటిపై చర్చించేందుకు ఫామ్‌హౌజ్‌కు రావాలని సూచించారు. ఈ క్రమంలో ఆదివారం వాసాలమర్రికి చెందిన ప్రజాప్రతినిధులు, స్థానికులు సుమారు 25 మంది ఫామ్‌హౌజ్‌కు వెళ్లగా సీఎం కేసీఆర్‌ వారితో అన్ని సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని, రూ.100కోట్లతో ఊరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సీఎం మాటిచ్చారు. నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌కు దీటుగా అభివృద్ధి పరుస్తానని, ప్రతి కుటుంబం ప్రభుత్వ లబ్ధిపొందేలా చూస్తానని, ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకు అన్ని కార్యక్రమాలను చేపడుతామని తెలిపారు. గ్రామంలోని మైసోనికుంటను సిద్దిపేట జిల్లాలోని కోమటిచెరువు తరహాలో అందంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అప్పటికప్పుడు వివిధ శాఖలకు చెందిన రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడిన సీఎం.. వాసాలమర్రిలో పర్యటించి అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. పది, పదిహేను రోజుల్లో వాసాలమర్రికి వస్తానని, గ్రామస్తులతో సహపంక్తి భోజనం కూడా చేస్తానని వెల్లడించారు. అంకాపూర్‌ రైతులు అవలంబిస్తున్న వ్యవసాయ పద్ధతులను చూసి రావాలని, 400 మంది రైతులు అక్కడకు వెళ్లేలా మూడ్రోజుల్లో ఏర్పాట్లు చేయిస్తానని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ఆదివారం సాయంత్రం వాసాలమర్రిలో పర్యటించారు. గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై అక్కడి ప్రజాప్రతినిధులు, గ్రామస్థులతో మాట్లాడారు. గ్రామ సమగ్రాభివృద్ధికి త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను తయారుచేయనున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. వాసాలమర్రిని సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించడంతో గ్రామస్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు.