శనివారం 04 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 01:28:13

చికున్‌గున్యాకు త్వరలో వ్యాక్సిన్‌!

చికున్‌గున్యాకు త్వరలో వ్యాక్సిన్‌!

  • భారత్‌ బయోటెక్‌కు టీకా తయారీ అవకాశం 
  • ఐవీఐ భాగస్వామ్యంతో రూపకల్పన
  • 106 కోట్ల గ్రాంట్‌ ఇచ్చిన సీఈపీఐ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: చికున్‌గున్యా నియంత్రణకు మరో కీలక అడుగుపడింది. ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ కనుగొనడంలో భాగంగా కీలక ఒప్పందం కుదిరింది. ప్రపంచంలోని 43 దేశాల్లో లక్షల మంది ప్రజలను వెంటాడుతున్న చికున్‌గున్యాకు వ్యాక్సిన్‌ తయారుచేసే అవకాశం తెలంగాణకు చెందిన భారత్‌ బయోటెక్‌కు దక్కింది. చికున్‌గున్యా వ్యాక్సిన్‌ను అభివృద్ధిచేయడానికి భారత్‌ బయోటెక్‌ ఇండియా లిమిటెడ్‌ (బీబీఐఎల్‌), ఇంటర్నేషనల్‌ వ్యాక్సిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐవీఐ) సంయుక్తంగా ప్రయోగాలు చేపట్టనున్నాయి. దీనిపై బుధవారం భారత్‌ బయోటెక్‌ ఒక ప్రకటన విడుదలచేసింది.

 ప్రయోగానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించడానికి కొయిలేషన్‌ ఆఫ్‌ ఎపిడమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌ (సీఈపీఐ) ముందుకు వచ్చింది. ఈ మేరకు 14.1 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.106కోట్లు) గ్రాంట్‌ను విడుదలచేసింది. దీంతోపాటు భారత ప్రభుత్వం కూడా రెండు మిలియన్‌ డాలర్లను (రూ.15 కోట్లు) గ్రాంట్‌గా ఇవ్వనున్నది. ఇందులో భాగంగా బీబీఐఎల్‌, ఐవీఐతో సీఈపీఐ పరస్పర ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ గ్రాంట్‌కు యూరోపియన్‌ యూనియన్‌ మద్దతు ఇస్తున్నది. ఈస్ట్‌ సెంట్రల్‌, దక్షిణాఫ్రికాల నుంచి ఇన్‌యాక్టివ్‌ జన్యువుల నుంచి సేకరించిన కణాల ద్వారా వ్యాక్సిన్‌ను తయారీచేస్తారు. చికున్‌గున్యాకు ‘బీబీవీ 87’ పేరుతో వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్నారు. భారత్‌లో వ్యాక్సిన్‌ తయారీకి గుడ్‌ మ్యానుఫాక్చరింగ్‌ ప్రాక్టిస్‌ (జీఎంపీ) తయారీకి, క్లినికల్‌ ట్రయల్స్‌ను ఇండియాలోనూ చేయనున్నారు. ఐవీఐ సంస్థ కొలంబియా, పనామా, థాయిలాండ్‌లలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నది. క్లినికల్‌ ట్రయల్స్‌ తర్వాత భారత్‌ బయోటెక్‌ సంస్థ అవసరమైన వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనున్నది. చికున్‌గున్యా బారిన పడిన దేశాలకు మొదట ఈ వ్యాక్సిన్‌ను అందించనున్నారు.

ప్రపంచ ప్రజల సమస్య: సీఈపీఐ సీఈవో

చికున్‌గున్యా వ్యాధి ప్రపంచంలోని అనేక దేశాల ప్రజల ఆరోగ్యానికి సమస్యగా మారిందని సీఈపీఐ సీఈవో డాక్టర్‌ రిచెర్డ్‌ హట్చ్‌హీట్‌ పేర్కొన్నారు. తమ సంస్థ ఆర్థిక సహకారంతో భారత్‌ బయోటెక్‌, ఐవీఐ సంయుక్త భాగస్వామ్యంతో వ్యాక్సిన్‌ కనుగోనడానికి ఒప్పందం కుదిరిందని చెప్పారు. చికున్‌గున్యా ప్రధానమైన ఆరోగ్య సమస్యగా మారిందని కేంద్ర బయోటెక్నాలజీశాఖ కార్యదర్శి డాక్టర్‌ రేణుస్వరూప్‌ అన్నారు. ప్రజలను పట్టి పీడిస్తున్న వ్యాధులకు వ్యాక్సిన్‌ కనిపెట్టడంలో తమ సంస్థ ముందుంటుందని భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణా ఎల్లా పేర్కొన్నారు. ఇప్పటికే జికా, హెచ్‌1ఎన్‌1 సహా అనేక వైరస్‌లకు వ్యాక్సిన్లు కనిపెట్టామన్నారు. ఈ ప్రయోగంలోనూ విజయవంతమవుతామని ధీమా వ్యక్తంచేశారు. చికున్‌గున్యాకు వ్యాక్సిన్‌ సరైన పరిష్కారం చూపుతుందని ఐవీఐ డీజీ డాక్టర్‌ జీరోమీ కిమ్‌ చెప్పారు.

ఏమిటీ చికున్‌గున్యా?

చికున్‌గున్యాను మొదటిసారిగా 1952లో టాంజానియాలో, ఆ తర్వాత ఆఫ్రికా, ఆసియా దేశాల్లో గుర్తించారు. 2004 నుంచి ఈ వ్యాధి త్వరగా వ్యాపిస్తుండగా, 43 దేశాల్లో 34 లక్షల మంది దీని బారిన పడ్డారు. ఏడిస్‌ అనే ఆడ దోమ కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుంది. జ్వరం, తీవ్రమైన కీళ్ల, కండరాల నొప్పులు, తలనొప్పి తదితర లక్షణాలు ఉంటాయి. కీళ్ల నొప్పులు కొనేండ్లపాటు ఉంటాయి.


logo