సోమవారం 25 జనవరి 2021
Telangana - Jan 09, 2021 , 01:00:22

వ్యాక్సిన్‌ డ్రైరన్‌ సక్సెస్‌

వ్యాక్సిన్‌ డ్రైరన్‌ సక్సెస్‌

  • రాష్ట్రవ్యాప్తంగా 917 సెంటర్లలో మాక్‌ డ్రిల్‌
  • రిజిస్ట్రేషన్‌, వ్యాక్సినేషన్‌ అంశాలపై దృష్టి
  • కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యల గుర్తింపు

హైదరాబాద్‌, జనవరి 8(నమస్తే తెలంగాణ): కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముందస్తు ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వ్యాక్సిన్‌ డ్రైరన్‌ విజయవంతమైంది. అతి త్వరలో వ్యాక్సిన్‌  అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో వివిధ దశల్లో ఎదురయ్యే సవాళ్లను గుర్తించి, పరిష్కరించుకునేందుకు వీలుగా ఈ మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించారు. ఇటీవలే హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని ఏడు కేంద్రాల్లో మాక్‌ డ్రిల్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 2,304 మందికి, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 94 దవాఖానల్లో 2,358 మందికి, ఖమ్మం జిల్లాలోని 32 కేంద్రాల్లో 679 మందికి, భద్రాద్రి జిల్లాలో 23 కేంద్రాల పరిధిలో 575 మందికి, కామారెడ్డి జిల్లాలో 30, నిజామాబాద్‌ జిల్లాలో 16 సెంటర్లలో 25 మందికి చొప్పున డమ్మీ టీకా వేశా రు. ఇతర జిల్లాల్లోనూ కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21,777 మందికి డమ్మీ వ్యాక్సిన్‌ వేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మొత్తం 917 కేంద్రాల్లో నిర్వహించిన ఈ డ్రిల్‌లో వైద్యారోగ్యశాఖ, పంచాయితీరాజ్‌, మున్సిపల్‌ అధికారులతోపాటు వివిధ శాఖలు భాగస్వామ్యమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు, వైద్యాధికారులు పర్యవేక్షించారు. ప్రక్రియ నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి ఉన్నతాధికారులు, వైద్యారోగ్యశాఖ మంత్రికి ఇప్పటికే నివేదిక రూపంలో అందించారు. ఈ సమస్యలను కేంద్రానికి తెలియజేయడంతోపాటు చిన్నచిన్న సమస్యలకు ఇప్పటికే పరిష్కారం చూపారు. లబ్ధిదారుల వివరాలు కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయడం, వారికి సందేశాలు వచ్చేలా నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయడం, వ్యాక్సిన్‌ తరలింపు, భద్రత వంటి అంశాలపై నిర్వాహకులకు స్పష్టత వచ్చింది. ఇప్పటికే వ్యాక్సిన్‌ నిల్వ, సరఫరా, వ్యాక్సినేషన్‌ ప్రక్రియల విషయంలో సన్నద్ధంగా ఉన్న రాష్ట్ర వైద్యారోగ్యశాఖ.. డ్రైరన్‌లో గుర్తించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని యోచిస్తున్నది. మాక్‌ డ్రిల్‌ను పరిశీలించేందుకు హైదరాబాద్‌ నుంచి వెళ్లిన సూపర్‌వైజర్లు ప్రక్రియ నిర్వహణపై నివేదిక అందజేస్తారు. 

27 వేల మంది మున్సిపల్‌ సిబ్బందికి అర్హత

కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడానికి రాష్ట్రంలో అర్హులైన 27 వేల మంది మున్సిపల్‌ సిబ్బంది పేర్లను కొవిన్‌లో నమోదుచేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహా మిగిలిన 140 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని సిబ్బంది వివరాలను రికార్డుచేశారు. వీరిని అర్హులుగా తేల్చిన మున్సిపల్‌ వ్యవహారాలు, పట్టణాభివృద్ధిశాఖ ఆన్‌లైన్‌లో నమోదుచేసింది.

సాఫ్ట్‌వేర్‌ సమస్యలే ఎక్కువ..

కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా మాత్రమే వ్యాక్సి న్‌ పొందటం సాధ్యమవుతున్న నేపథ్యంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఉండకూడదని కేంద్రం సూచిస్తున్నది. సాఫ్ట్‌వేర్‌ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిసారించిన అధికారులు డ్రైరన్‌ నిర్వహణలో సమస్యలను గుర్తించారు. పిన్‌కోడ్‌ సమస్యలు ఉండటం వల్ల లబ్ధిదారుల వివరాలు తప్పుగా నమోదవుతున్నట్టు తెలిసింది. కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌ వేగంగా అప్‌డేట్‌ కాకపోవటంతో కాలయాపన జరుగుతున్నట్టు పలు ప్రాంతాల్లో అధికారులు గుర్తించారు. దీంతోపాటు నిర్దిష్ట సంఖ్య గల లబ్ధిదారుల వివరాలను కోవిన్‌లో పొందుపరిచినప్పటికీ, వారందరి వివరాలు నమోదు కాకపోవటం వల్ల అందరికి డమ్మీ వ్యాక్సిన్‌ వేయడం సాధ్యపడలేదు. ఈ వివరాలతో కూడిన రిపోర్టును అధికారులు ప్రభుత్వానికి అందజేయనున్నారు. 


logo