గురువారం 25 ఫిబ్రవరి 2021
Telangana - Jan 22, 2021 , 01:43:39

హైదరాబాద్‌లో టీకా పరీక్షా కేంద్రం!

హైదరాబాద్‌లో టీకా పరీక్షా కేంద్రం!

  • ప్రాధాన్య అంశంగా పరిశీలిస్తామన్న కేంద్రం
  • మంత్రి కేటీఆర్‌ లేఖపై ఉపరాష్ట్రపతి వెంకయ్య ఫోన్‌
  • సానుకూలంగా స్పందించిన మంత్రి హర్షవర్ధన్‌

హైదరాబాద్‌, జనవరి 21 (నమస్తే తెలంగాణ): వ్యాక్సిన్‌ హబ్‌గా వెలుగొందుతున్న హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో టీకా పరీక్ష, ధ్రువీకరణ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ప్రాధాన్య అంశంగా పరిశీలిస్తామని కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో టీకా పరీక్ష, ధ్రువీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ మంత్రి కే తారకరామారావు బుధవారం కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పత్రికల్లో చదివిన ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గురువారం కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. కరోనా మహమ్మారి కట్టడికి హైదరాబాద్‌ కేంద్రంగా టీకాను అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. దీంతోపాటు తెలంగాణ నుంచి 600 కోట్ల టీకాలు ఉత్పత్తి అయిన విషయాన్ని ప్రస్తావించారు.

ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ చేసిన విజ్ఞప్తిని పరిశీలించాలని కేంద్రమంత్రికి ఉపరాష్ట్రపతి సూచించారు. దీనిపై మంత్రి హర్షవర్ధన్‌ స్పందిస్తూ.. ‘మీ సూచనను ఉన్నతస్థాయిలో, ప్రాధాన్య అంశంగా  పరిశీలిస్తాం’ అని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతులు సంపాదించాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటివరకు ప్రపంచంలో ఇలాంటి కేంద్రాలు ఏడు మాత్రమే ఉన్నాయని తెలిపారు. కాబట్టి అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

VIDEOS

logo