సోమవారం 01 జూన్ 2020
Telangana - May 03, 2020 , 20:53:36

ఎక్సైజ్‌ అధికారులపై దాడులను సహించం

ఎక్సైజ్‌ అధికారులపై దాడులను సహించం

జడ్చర్ల రూరల్‌ : నాటుసారా తయారీకి అడ్డుకట్ట వేస్తున్న ఎక్సైజ్‌ అధికారులపై ఎవరైనా దాడులకు పాల్పడితే సహించేదిలేదని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. జడ్చర్ల మండలంలో శనివారం రాత్రి సారా తయారీ స్థావరాలపై దాడి చేసేందుకు వెళ్లిన జడ్చర్ల ఎక్సైజ్‌ సీఐ బాలోజీ, ఎస్సై ఉమామహేశ్వర్‌, కానిస్టేబుళ్లు సిద్దూ, వెంకటేశ్వర్లు, హెడ్‌కానిస్టేబుల్‌ రమేశ్‌లపై కొందరు కర్రలతో దాడి చేసి గాయపర్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదివారం జడ్చర్ల ఎక్సైజ్‌ కార్యాలయాన్ని సందర్శించి గాయపడిన అధికారులు, సిబ్బందిని పరామర్శించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. 

రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం ముఖ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారా తయారీపై ఉక్కుపాదం మోపారని తెలిపారు. ఇటీవల లాక్‌డౌన్‌తో ఇతర రాష్ర్టాల నుంచి సొంత ఊర్లకు వచ్చిన కొందరు మళ్లీ సారా తయారు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. సారా తయారీ, విక్రయాలను తాము సహించబోమన్నారు. సారా తయారీని ఉక్కుపాదంతో తొక్కేస్తామన్నారు. ఎక్సైజ్‌ అధికారులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పనిచేసే అధికారులకు తమ ప్రభుత్వం అండగా ఉంటూ అన్ని సౌకర్యాలను సమకూరుస్తుందన్నారు. సారా బట్టీలను ధ్వంసం చేసేందుకు వెళ్లే సమయంలో అధికారుల వద్ద ఆయుధాలు లేకపోవడంతో దాడులు జరుగుతున్నాయని, వారికి త్వరలోనే ఆయుధాలు ఇచ్చేవిధంగా ముఖ్యమంత్రితో మాట్లాడుతానని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. అధికారులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, సారా తయారీకి అడ్డుకట్ట వేసేందుకు మరింత కృషి చేయాలని ఆయన కోరారు. 


logo