మంగళవారం 26 జనవరి 2021
Telangana - Dec 25, 2020 , 17:46:11

కాంగ్రెస్ అగ్ర‌కులాల పార్టీ అయిపోయింది : వీహెచ్

కాంగ్రెస్ అగ్ర‌కులాల పార్టీ అయిపోయింది : వీహెచ్

హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు ఆ పార్టీ నేత‌ల‌పై నిప్పులు చెరిగారు. పీసీసీ చీఫ్ ప‌ద‌వి విష‌యంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ అగ్ర‌కులాల పార్టీ అయిపోయింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. బల‌హీన వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అవ‌త‌ల కేసీఆర్ బీసీ, ఎస్సీ కులాల‌కు చెందిన వారికి అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చి ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెడుతున్నార‌ని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీలో బీసీ వ‌ర్గాల‌కు చెందిన సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టి రెడ్డి సామాజిక వ‌ర్గానికి అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వ‌డం దారుణ‌మ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ర్ట వ్య‌వ‌హారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ ప్యాకేజ్‌కు అమ్ముడు పోయాడ‌ని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ వ్య‌క్తి రేవంత్‌కు పీసీసీ చీఫ్ ఇస్తే తాను పార్టీలో కొన‌సాగ‌న‌ని స్ప‌ష్టం చేశారు. 

ఏ అర్హ‌త ఉంద‌ని రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి క‌ట్ట‌బెడుతార‌ని ప్ర‌శ్నించారు. త‌న‌తో పాటు భ‌ట్టి విక్ర‌మార్క‌, జ‌గ్గారెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి లాంటి నాయ‌కుల‌ను ప‌క్క‌న పెట్ట‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. ఆర్ఎస్ఎస్ భావ‌జాలం ఉన్న రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ ప‌ద‌వి ఇవ్వ‌డం స‌రైన నిర్ణ‌యం కాదు. ఆయ‌న ఏం చేశాడో అంద‌రికి తెలుస‌న్నారు. రేవంత్‌ను ఉద్దేశించి.. సోనియాకు స‌మాధి క‌డుతా అన్నందుకు పీసీసీ చీఫ్ ఇస్తున్నారా? ఓటుకు నోటు కేసులో దొరికిపోయినందుకా? కాంగ్రెస్‌ను ఖ‌తం చేస్తాన‌ని గ‌తంలో మాట్లాడినందుకా? అని ప్ర‌శ్నించారు. 

నేను రౌడీనా? ‌దొంగ‌నా?

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ర్ట వ్య‌వ‌హారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ గ‌త మూడు రోజుల నుంచి త‌న ఫోన్ లిఫ్ట్ చేయ‌డం లేద‌ని హ‌నుమంత‌రావు పేర్కొన్నారు. తానేమైనా రౌడీనా? దొంగ‌నా? అని ప్ర‌శ్నించారు. త‌న మాట‌ను ఎవ‌రూ విన‌డం లేద‌న్నారు. కొంత‌మంది ప‌నిక‌ట్టుకుని 2018 నుంచి సోనియాతో త‌న భేటీకి అడ్డుప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అలాంటి వ్య‌క్తులేవ‌రో త‌న‌కు తెలుస‌న్నారు. నిజం చెప్తాడ‌నే భ‌యంతోనే అపాయింట్‌మెంట్‌కు అడ్డుప‌డుతున్నారు.. ఒక వేళ సోనియాను క‌లిస్తే నిజాలు బ‌య‌ట‌పెట్టి త‌మ అక్ర‌మాల‌కు అడ్డుప‌డుతాన‌నే అవ‌కాశంతో కుటిల ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని వీహెచ్ మండిప‌డ్డారు. 

నా బ్ల‌డ్ ఏమైత‌ది? 

రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డం అంటే త‌న మ‌న‌సు ఒప్పుత‌లేదు. త‌న బ్ల‌డ్ ఏమైత‌ది? అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కాలం నుంచి ప‌ని చేస్తున్న సీనియ‌ర్ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. రేవంత్‌తో పాటు కొంద‌రిని అస‌లు వ‌ద‌ల‌ను.. వీరి అక్ర‌మాల‌పై సీబీఐకి లేఖ రాస్తాను అని వీహెచ్ తెలిపారు. తాను ఎలాంటి అవినీతికి పాల్ప‌డ‌లేదు.. అక్ర‌మంగా సంపాదించ‌లేదు అని హ‌నుమంత‌రావు భావోద్వేగానికి లోన‌య్యారు. 


logo