e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home Top Slides ఇది మీ బతుకు సమస్య

ఇది మీ బతుకు సమస్య

  • మంచి అవకాశం.. సద్వినియోగం చేసుకోండి
  • తొందర పడకండి.. వివేచనతో ఆలోచించండి
  • కేసీఆర్‌ ఇస్తున్నడని.. ఊరికే ఖర్చు చేయొద్దు
  • భవిష్యత్తులో ఎవరి ముందూ చేయి చాపొద్దు
  • దళితబంధు లబ్ధిదారులతో మేధావుల కమిటీ
  • మల్లేపల్లి లక్ష్మయ్య నేతృత్వంలో ఇంటింటికీ
  • ఇల్లందకుంట మండలంలో పర్యటన
  • శిక్షణ తర్వాత యూనిట్లు ఎంచుకోవాలని సలహా

ఇది మీ బతుకు సమస్య. దళితబంధు మీ బతుకును నిలిపే బంధువు.. జీవితంలో ఆర్థికంగా ఎదగడానికి ఇది చాలా మంచి అవకాశం. సద్వినియోగం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడొద్దు. ఆలోచించండి. కేసీఆర్‌ ఇస్తున్నడని ఊరికే ఖర్చుపెట్టొద్దు. ఈ డబ్బులతో.. మళ్లీ ఎవరి ముందూ చేయి చాచకుండా నిలబడాలి. అందరూ ఒకే తీరు యూనిట్లు తీసుకొంటే దెబ్బతింటరు. ఒక్కొక్కరు ఒక్కో యూనిట్‌ను ఎంచుకోండి. లేకుంటే గ్రూపులుగా ఏర్పడి ఫ్యాక్టరీలు పెట్టుకోండి. దేనికైనా శిక్షణ తీసుకొని ఆ తర్వాతే ఎంచుకోండి. -హుజూరాబాద్‌ దళితబంధు లబ్ధిదారులతో అధ్యయన కమిటీ సభ్యులు

గడ్డివానిపల్లిలో చెట్ల కింద సమావేశమైన సమయంలోనే ఓ ఇంటి ముందు బర్రెలు కట్టేసి ఉన్నాయి. అటుగా వెళ్లిన లక్ష్మయ్య బర్రెల యజమాని పాత నారాయణతో మాట్లాడారు. తన ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు ప్రమాదవశాత్తూ మరణించాడని, ఆరేండ్ల క్రితం తాను బర్రెలను కొన్నానని చెప్పాడు. ప్రస్తుతం ఆరు బర్లు ఉండగా, అందులో ఒకటి ఉదయం 4, సాయంత్రం 4 లీటర్ల పాలు ఇస్తున్నదన్నాడు. మిగతావి సూడి బర్లు అని చెప్పాడు. దళితబంధు లబ్ధిదారులు కూడా నారాయణలాగా క్రమశిక్షణతో పని చేసుకుంటే లాభం చేకూరుతుందని మల్లేపల్లి లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు.

- Advertisement -

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 14 (నమస్తే తెలంగాణ): ‘సీఎం కేసీఆర్‌ డబ్బులు ఇస్తున్నడు కదా అని ఏదిపడితే అది కొని. తర్వాత బాధపడొద్దు. సీఎం తీసుకొన్న నిర్ణయంతో మీ బతుకులు మారాలి. ఇంకొకరికి చేయి చాపకుండా బతికి చూపాలి’ అని దళిత బంధు లబ్ధిదారులకు మేధావుల కమిటీ సూచించింది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు పథకం పైలట్‌ ప్రాజెక్టుగా అమలవుతున్న విషయం తెలిసిందే. అవగాహన లేకుండా లబ్ధిదారులు యూనిట్లు ఎంపిక చేసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ చైర్మన్‌ మల్లేపల్లి లక్ష్మయ్య, సీనియర్‌ జర్నలిస్ట్‌ కే రామచంద్రమూర్తి, బేసిక్స్‌ సంస్థ సీఈవో డీ సత్తయ్య, సభ్యులు బీఎస్‌ గోపాల్‌, బాలాజీ, నవీన్‌, హెన్రీతో కూడిన కమిటీ మంగళవారం హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అధ్యయనానికి వచ్చింది. మొదట జమ్మికుంటలో దళితసంఘాల నాయకులు, విశ్రాంత ఉద్యోగులతో ఈ కమిటీ సమావేశమైంది. అనంతరం ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లి, చిన్నకోమటిపల్లి గ్రామాలకు వెళ్లి నేరుగా లబ్ధిదారులతో మాట్లాడింది. ఎవరు ఎలాంటి యూనిట్లు ఎంపిక చేసుకుంటున్నారో విచారించింది. పలువురు కార్లు, ట్రాక్టర్లు కొంటామని చెప్పడంతో కమిటీ సభ్యులు వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

జమ్మికుంటలో..
మేధావుల కమిటీ సభ్యులు హుజూరాబాద్‌లో నియోజకవర్గంలోని పలు ప్రభుత్వశాఖల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, దళితసంఘాల నేతలతో జమ్మికుంటలో సమావేశమయ్యారు. దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంపై చర్చించారు. నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో దళిత్‌ కమ్యూనిటీ ఎల్డర్స్‌ ఫోరం (డీఏసీఈఎఫ్‌) ఏర్పాటు చేసుకొని లబ్ధిదారులతో మమేకమై వారికోసం పనిచేయాలని మల్లేపల్లి లక్ష్మయ్య సూచించారు. లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని సమావేశంలో పాల్గొన్నవారు కోరారు. దళితబంధు కోసం ప్రత్యేకంగా యాప్‌ను అభివృద్ధిచేస్తున్నామని, త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ఇన్నాళ్లు ప్రభుత్వ సేవలో ఉన్న వారికి సమాజసేవ చేసే అదృష్టం లభించిందని, అంతా దీన్ని వినియోగించుకోవాలని కోరారు. గ్రామాల్లో యూత్‌ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. దీనికి తోడు స్థానికంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాన్ని సలహాల కోసం వినియోగించుకోవాలని చెప్పారు.

చిన్న కోమటిపల్లిలో..
సాయంత్రం 4.30 గంటలకు చిన్న కోమటిపల్లికి చేరుకున్న కమిటీ సభ్యులు.. ఇంటింటికీ తిరిగి దళితుల స్థితిగతులను పరిశీలించారు. ఒక ఇంటి ముందు కూర్చుని లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ గ్రామంలో 52 మంది లబ్ధిదారులున్నారు. వారితో మాట్లాడగా.. చాలామంది ట్రాక్టర్లు కొనుగోలు చేసుకుంటామన్నారు. గ్రామంలో 300 ఎకరాల వ్యవసాయ భూమి మాత్రమే ఉన్నదని, ఇప్పటికే 24 ట్రాక్టర్లు ఉన్నాయని తెలుసుకున్న కమిటీ సభ్యులు.. ఒక్కొక్కరికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అందరు ట్రాక్టర్లు కొంటే నష్టపోతారని చెప్పారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకోవాల్సిన యూనిట్ల గురించి జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ ప్రభాకర్‌, బేసిక్స్‌ సంస్థ సీఈవో సత్తయ్య లబ్ధిదారులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కమిటీ సభ్యుల వెంట టీఆర్‌ఎస్‌ దళితనేత కనుమల్ల గణపతి, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు సంపత్‌రావు ఉన్నారు.

గడ్డివానిపల్లిలో..
మధ్యాహ్నం 3 గంటలకు ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లికి చేరుకొన్న కమిటీ, గ్రామంలోని ఒక చెట్టు నీడలోనే లబ్ధిదారులతో సమావేశమైంది. ఏయే యూనిట్లు ఎంచుకొన్నారు.. ఆ రంగంలో ఉన్న అనుభవంపై ఆరా తీశారు. ఎంచుకున్న యూనిట్‌తో నెలకు ఎంత సంపాదించగలుగుతారని ప్రశ్నించారు. ఒక ఇంట్లో మూడు యూనిట్లు వచ్చాయని, ముగ్గురం కలిసి హార్వెస్టర్‌, ట్రాక్టర్‌ కొంటామన్నారు. మినీ డెయిరీ, మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌ పెట్టుకొంటామని కొందరు లబ్ధిదారులు చెప్పడంతో కమిటీ సభ్యులు సంతృప్తిని వ్యక్తంచేశారు.

అనుభవం.. ఆచరణ జోడించాలి..
అనుభవం, ఆచరణ జోడించి యూనిట్లను ఎంపిక చేసుకోవాలి. గ్రామ గ్రామాన దళిత్‌ కమ్యూనిటీ ఎల్డర్స్‌ ఫోరం ఏర్పాటుచేసుకోవాలి. లబ్ధిదారుల సహాయం కోసం ఒక యాప్‌ను డెవలప్‌ చేస్తున్నాం. రూ.10 లక్షలు ఊరికే వస్తున్నాయనే భావన రావొద్దు. సీఎం కేసీఆర్‌ ఎంతో ఆలోచనాత్మకంగా ఇస్తున్న డబ్బులు వృథా కావొద్దు. కేసీఆర్‌ కృషితో దళితులకు మంచి అవకాశం వచ్చింది. ఇపుడు కాకపోతే మరెప్పుడూ దళితులు బాగుపడరు. ఏ యూనిట్‌ అయినా బతుకుదెరువు చూపేలా ఉండాలి. ఏ ప్రాజెక్టు ఎంచుకున్నా దానిపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. దళితులు ఒకరిపై ఆదారపడకూడదనేదే సీఎం లక్ష్యం. సద్వినియోగం చేసుకొంటే ఏడాదిలో రెట్టింపు సంపాదించుకోగలుగుతారు. ఏ యూనిట్‌ ఎంపిక చేసుకోవాలో నిర్ణయించుకోని పరిస్థితిలో ఉంటే శిక్షణ తీసుకోవాలి. మాతో వచ్చిన సంస్థలు సహకరిస్తాయి.
-మల్లేపల్లి లక్ష్మయ్య, చైర్మన్‌, సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌

శిక్షణ ఇవ్వడానికి సిద్ధం
మా సంస్థ ద్వారా ఏడాదికి లక్ష మందికి శిక్షణ ఇస్తున్నాం. ఇందులో ఏటా 70 వేల మందికి ఉద్యోగ, ఉపాధి లభిస్తున్నది. దళితబంధు లబ్ధిదారులకు కూడా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. గ్రామాల్లో ఎక్కువగా వ్యవసాయ ఆధారిత యూనిట్లను ఎంపిక చేసుకుంటున్నారు. వీటికి అనుబంధంగా కొన్ని ప్రత్యేక యూనిట్లను కూడా ఎంపిక చేసుకోవాలి. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న యూనిట్లు ఎంచుకొంటే మంచిది. వ్యవసాయానికి సంబంధం లేని యూనిట్లను కూడా ఎంపిక చేసుకోవాలి. కనీసం 8 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటేనే ట్రాక్టర్‌ కొనుక్కోవాలి. – సత్తయ్య, బేసిక్స్‌ సీఈవో

విభిన్న రీతుల్లో యూనిట్లు ఎంచుకోవాలి
దళితబంధు లబ్ధిదారులు వ్యవసాయ ఆధారిత యూనిట్లను ఎంచుకున్నా విభిన్న రీతుల్లో ఆలోచన చేయాలి. ఎక్కువ డిమాండ్‌ ఉన్న ఉత్పత్తులను ఎంచుకుంటే మార్కెట్‌లో చిరకాలం నిలవగలుగుతారు. కృషివిజ్ఞాన కేంద్రంలో శిక్షణ ఇవ్వడంతోపాటు ఏ యూనిట్‌ను ఎంచుకోవాలో ప్లాన్‌ కూడా ఇస్తాం. ట్రాక్టర్లు, కార్లు కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు, యూనిట్లు, దానా తయారీ యూనిట్లు, ఆహార పదార్థాల తయారీ యూనిట్లు ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. కొందరు గ్రూపుగా ఏర్పడి జిన్నింగ్‌ మిల్స్‌, మినీ రైస్‌ మిల్లులు, కోళ్లు, పశువుల దానా ఫ్యాక్టరీలు నెలకొల్పుకోవచ్చు. జేఎల్‌సీ గ్రూపులుగా ఏర్పడితే విజ్ఞాన కేంద్రంలో శిక్షణ ఇచ్చేందుకు సిద్ధం. -ప్రభాకర్‌, కేవీకే శాస్త్రవేత్త

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana