బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 04, 2020 , 02:36:14

కరోనాపై సాంకేతిక సమరం

కరోనాపై సాంకేతిక సమరం

-వైరస్‌ నియంత్రణకు డ్రోన్ల వినియోగం

-కరీంనగర్‌లో విజయవంతం 

-పైలట్‌గా వరంగల్‌, కామారెడ్డిలో.. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ నివారణకు తెలంగాణలోనూ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. మారుట్‌ డ్రోన్‌టెక్‌ సంస్థతో కలిసి అధికారులు పనిచేస్తున్నారు. వీటిద్వారా క్రిమిసంహారక మందులను స్ప్రే చేయడం, ప్రజలు గుమికూడటాన్ని పర్యవేక్షించడం, మందులు సరఫరా వంటివి చేపడుతున్నారు. వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో.. సంప్రదాయ పద్ధతుల కంటే డ్రోన్ల ద్వారా 50 రెట్లు అధిక విస్తీర్ణంలో క్రిమిసంహారక మందులు చల్లేందుకు వీలుంటుంది. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇటీవల వీటి సహాయంతో క్రిమిసంహారక మందులను స్ప్రే చేశారు.  మారుట్‌ డ్రోన్స్‌ ఇప్పటికే జీహెచ్‌ఎంసీతో కలిసి దోమల లార్వాలను నిర్మూలించేందుకు నగరంలోని చెరువులు, సరస్సుల్లో క్రిమిసంహారక మందులు చల్లే కార్యక్రమాన్ని చేపట్టింది. 

రద్దీపై పర్యవేక్షణ.. ప్రజారోగ్యంపై హెచ్చరికలు

లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తుండటంతో మారుట్‌ సంస్థ అభివృద్ధి చేసిన కెమెరా, స్పీకర్లు అమర్చిన డ్రోన్ల సాయంతో అలాంటి రద్దీని పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హెచ్చరికలు చేసేందుకు వీలుకలుగుతుంది. పెట్రోలింగ్‌ కంటే ఎంతో వేగంగా, సమర్థవంతంగా సమాచారాన్ని వ్యాప్తిచేయవచ్చు. స్పెయిన్‌, ఫ్రాన్స్‌వంటి దేశాల్లో ఈ విధమైన డ్రోన్లను వినియోగిస్తున్నారు.

ఉష్ణోగ్రత పరీక్ష.. థర్మల్‌ ఇమేజింగ్‌

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అతిథులు, సందర్శకులు ఎవరైనా అపార్ట్‌మెంట్లోకి వచ్చేముందు శరీర ఉష్ణోగ్రత పరీక్ష చేస్తున్నారు. డ్రోన్లలో అమర్చిన ఇన్‌ఫ్రారెడ్‌ థర్మోమీటర్‌ ద్వారా  కచ్చితమైన పరీక్షలు చేయవచ్చు. వైరస్‌ సోకిన వ్యక్తులను ప్రారంభ దశలోనే కనుగొనవచ్చు. 

డ్రోన్‌తో మందుల సరఫరా..

అవసరమైనవారికి సమయానికి రక్తం, మందులను చేరవేయడం దేశంలో సవాల్‌గా మారింది. కరోనా నేపథ్యంలో ఈ పరిస్థితి తీవ్రంగా మారింది. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు రవాణా, డెలివరీ సిస్టమ్‌ ఆవిష్కరించాల్సిన అవసరం ఉన్నది. దీనిని అధిగమించేందుకు డ్రోన్లు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. డ్రోన్ల ద్వారా ఎనిమిది నిమిషాల్లో 12 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవచ్చు. వైరస్‌ వ్యాప్తినీ అరికట్టవచ్చు. 68 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉన్నది. కానీ బ్లడ్‌ బ్యాంకులు, పరీక్ష సదుపాయాలన్నీ పట్టణాల్లోనే ఉన్నాయి. గ్రామాల నుంచి సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా రక్తం 10 నుంచి 11 శాతం వ్యర్థమవుతుంది. కరోనా వ్యాప్తి పరిస్థితుల్లో కూడా దానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ఇవి ఎంతో కీలకమవుతాయి. 

శుద్ధిచేసే చాంబర్‌రూపొందించిన ఓ మెకానిక్‌

కరోనా వైరస్‌ నివార ణకు ఓ మెకానిక్‌ శానిటైజర్‌ చాంబర్‌కు రూపకల్పన చేశా డు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణానికి చెందిన అల్లాడి ప్రభాకర్‌ కరోనా ప్రివెన్షన్‌ చాంబర్‌ తయారుచేశారు. 8 ఫీట్ల పొడవుండే ఈ క్యాబిన్‌లోకి మనిషి వెళ్లగానే స్కానర్లు పనిచేయడం మొదలుపెట్టి పైనుంచి కిందివరకు శుద్ధి చేస్తాయి. చాంబర్‌లోని రెండోభాగంలోని హీటర్లు డ్రై చేస్తాయి. దీంతో ఈ యంత్రంలోకి వెళ్లిన వారు పూర్తిగా శానిటైజ్‌ అయి బయటకు రావచ్చు. రూ.25 వేలతో ఈ చాంబర్‌ను సిద్ధం చేసినట్టు ప్రభాకర్‌ చెప్పారు. శుక్రవారం మంత్రి గంగుల కమలాకర్‌ ఈ చాంబర్‌ను పరిశీలించి ప్రభాకర్‌ను అభినందించారు.

డ్రోన్‌ ప్రత్యేకతలు..

  • ఒక డ్రోన్‌ 25 కిలోల బరువు ఉంటుంది. రసాయనాలు స్ప్రే చేసే డ్రోన్‌లో 10 కిలోల ట్యాంక్‌ ఉంటుంది. దీన్ని నియంత్రించటానికి పైలట్‌, కోపైలట్‌ ఉంటారు.
  • 10 కిలోల బరువున్న మందులు, ఇతర అత్యవసర సామగ్రిని చేరవేయగలుగుతాయి.
  • శరీర ఉష్ణోగ్రతలను కనిపెట్టే డ్రోన్‌లో థర్మల్‌ స్కానర్లు ఉంటాయి. ఇవి కి.మీ. దూరంలో ఉన్న సమూహాల్లోని ప్రజల శరీర ఉష్ణోగ్రతలను చెప్తాయి.

అన్ని జిల్లాల నుంచి విజ్ఞప్తులు

కరీంనగర్‌లో ఈ డ్రోన్లను ఇప్పటికే విజయవంతంగా ఉపయోగిం చాం. వరంగల్‌, కామారెడ్డి జిల్లాల్లోనూ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించాం. తమ జిల్లాల్లోనూ చేపట్టాలని పలువురు కలెక్టర్లు కోరుతున్నారు. సంగారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో కూడా చేయనున్నాం. కార్పొరేట్‌ సంస్థల నుంచి సహకారం లభిస్తే ఇంకా డ్రోన్ల సంఖ్య, మ్యాన్‌ పవర్‌ పెంచేందుకు వీలుంటుంది. త్వరలోనే అన్ని జిల్లాల్లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం.

- ప్రేమ్‌కుమార్‌, మారుట్‌ డ్రోన్‌టెక్‌ వ్యవస్థాపకుడు


logo