బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 01, 2020 , 17:59:38

పట్టణాల రూపురేఖలు మార్చేందుకే ‘పట్టణప్రగతి’: మంత్రి కేటీఆర్‌

పట్టణాల రూపురేఖలు మార్చేందుకే ‘పట్టణప్రగతి’: మంత్రి కేటీఆర్‌

భద్రాద్రి కొత్తగూడెం: పట్టణాల రూపురేఖలు మార్చేందుకే ప్రభుత్వం.. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇవాళ మంత్రి.. ఇల్లెందు మున్సిపాలిటీలో పర్యటించి, అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ‘పల్లెప్రగతి’ కార్యాక్రమం విజయవంతమవడంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ‘పట్టణప్రగతి’ కార్యక్రమాన్ని చేపట్టారనీ, తద్వారా పట్టణాలను అభివృద్ధి చేసుకునేందుకు వీలుంటుందని మంత్రి తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో ఎలాంటి ఎన్నికలు లేవు. ప్రచార ఆర్భాటాలు, ఓటర్లను ఆకట్టుకోవడానికి జిమ్మిక్కులు చేయాల్సిన అవసరం లేదనీ.. రాష్ట్ర అభివృద్ధి పైనే ప్రభుత్వం దృష్టి సారించిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి వార్డులో విరివిగా మొక్కలు నాటి, సంరక్షించాన్నారు. డ్రైనేజీ వ్యవస్థ, మురికి కాల్వలు శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి ప్రజలకు సూచించారు. ఇంట్లోని చెత్తను రోడ్లపై వేయకుండా.. మున్సిపల్‌ సిబ్బందికి అందజేయాలని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న చెత్తబుట్టలను వాడుకోవాలన్నారు. తడి, పొడి చెత్తలను వేరు చేసి.. శానిటేషన్‌ సిబ్బందికి అందించాలని మంత్రి వెల్లడించారు. 

ప్రభుత్వం.. నిత్యం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపైనే దృష్టి సారిస్తున్నదని మంత్రి తెలిపారు. ప్రజా ప్రతినిధులంతా ప్రతి పల్లె, పట్టణాల్లో తిరుగుతూ.. పనులను పర్యవేక్షిస్తున్నారని మంత్రి తెలియజేశారు. పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పేరిట రూ. లక్షా 116లు అందజేస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. ప్రతి విద్యార్థి చదువుకు ఏడాదికి లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులకు సకాలంలో బోధనా రుసుము చెల్లిస్తున్నామన్నారు. పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు సాయం చేస్తున్నామని మంత్రి తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరుతున్నాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ కోతలు ఉండేవనీ.. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని మంత్రి గుర్తు చేశారు. ఇళ్లతో పాటు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సాగు నీరు, తాగునీరు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్‌ అన్ని నియోజకవర్గాలను సమదృష్టితో అభివృద్ధి చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎక్సైజ్‌ మినిస్టర్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్‌, వనమా వెంకటేశ్వర్‌ రావు, రెడ్యానాయక్‌, జెడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్‌ ఎం.వి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo