శనివారం 30 మే 2020
Telangana - May 05, 2020 , 12:59:13

కరీంనగర్‌ వాసుల చిరకాల వాంఛ నెరవేరింది

కరీంనగర్‌ వాసుల చిరకాల వాంఛ నెరవేరింది

  • అర్బన్‌ మిషన్‌ భగీరథ ట్రయల్‌ రన్‌ ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్‌
  • కరీంనగర్‌: పట్టణ ప్రాంతాల్లో నిత్యం తాగు నీటి అవసరాలను తీర్చే ఉద్దేశంతో అర్బన్‌ మిషన్‌ భగీరథ పథకం అమలవుతుంది. ఈ పథకంలో భాగంగా కరీంనగర్‌ వాసుల తాగు నీటి అవసరాలు తీర్చేందుకు ఈ రోజు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్‌ వాసుల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. కరీంనగర్‌ తలాపునే మానేరు ఉన్నా తాగు నీటి కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేదన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు నీటికోసం ఎదురు చూసే పరిస్థితి ఉండొద్దనే అలోచనతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు గంగుల కమలాకర్‌. నేటి నుంచి ప్రతిరోజు నీటిని అందించనున్నట్లు తెలిపారు.

    శాతవాహన యూనివర్సిటీలో 30 లక్షల లీటర్ల కెపాసిటీ గల ట్యాంక్‌ నిర్మించినట్లు పేర్కొన్నారు. దీని నుండి 15 ట్యాంక్‌లకు నీరు వెళ్తుంది. వారం రోజుల ట్రయల్‌ రన్‌లో ఇబ్బందులను పరిష్కరించుకుని ముందుకు వెళతామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిత్యం తాగు నీరు అందించే తొలి కార్పోరేషన్‌గా కరీంనగర్‌ నిలుస్తుందన్నారు. అందుకు నిత్యం 50 ఎంఎల్‌డీ(మెగా లీటర్స్‌ పర్‌ డే) నీరు అవసరముంటుందన్నారు. 24 గంటలు తాగు నీరు అందించే ప్రక్రియను త్వరలో మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు గంగుల కమలాకర్‌. ఈ సందర్భంగా మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులు, ఇంజనీర్లు, అధికారులకు మంత్రి కృతఙ్ఞతలు తెలిపారు. 


    logo