శుక్రవారం 29 మే 2020
Telangana - May 01, 2020 , 12:01:28

పెండ్లి చేసుకోవడానికి 230 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కాడు...

పెండ్లి చేసుకోవడానికి 230 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కాడు...

ఉత్తరప్రదేశ్‌: రాష్ట్రంలోని హమీర్‌పూర్‌ జిల్లా పౌతియా గ్రామానికి చెందిన కల్కు ప్రజాపతి(23) యువకుడు పెండ్లి చేసుకోవడం కోసం 230 కిలోమీటర్ల సైకిల్‌ తొక్కాడు. కరోనావైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రజాపతి వివాహం ఈ నెల 25వ తేదీన లక్నోకు దక్షిణంగా 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహోబా జిల్లా పునియా గ్రామానికి చెందిన వధువు రింకూతో జరిగింది. అయితే రింకూను పెండ్లి చేసుకోవడానికి తాను పడిన కష్టాలను ప్రజాపతి వివరించారు. నా వివాహం నాలుగు నెలల క్రితం నిర్ణయించారు. వధువు రింకూ కుటుంబం పెండ్లి పత్రికలు ముద్రించి అందరికి పంపిణీ చేశారు. ఇంతలో కరోనా వల్ల లాక్‌డౌన్‌ విధించారు. రైతునైన తాను గత నెలరోజులుగా పొలం పనులు విడిచిపెట్టి అనుమతి కోసం పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిరిగాను. కాని నాకు పోలీసుల నుంచి అనుమతి రాలేదు.

పెండ్లి తేదీ దగ్గరకు వస్తుంది. నాకోసం వధువు కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. నాకు ద్విచక్రవాహనం నడపడం వచ్చు కాని లైసెన్స్‌ లేదు. సైకిల్‌పై వెళితే లైసెన్స్‌ అవసరం లేదని నిర్ణయించుకుని సైకిల్‌పై ప్రయాణం ప్రారంభించాను. కరోనా వైరస్‌ నుంచి రక్షించుకోవడానికి నోటికి దస్తీ అడ్డంగా కట్టుకుని వధువు ఇంటికి చేరుకున్నాను. మేము అందరి పెండ్లీలకు వెళ్లాం. మా వివాహానికి కూడా అందరిని ఆహ్వానించాం. కాని లాక్‌డౌన్‌ కారణంగా బంధువుల ఎవరూ మా పెళ్లికి రాలేకపోయారు. వధువు కుటుంబ సభ్యుల మధ్య గుడిలో వివాహ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. నేను వెళ్లేటప్పుడు ఒంటరి వెళ్లాను. తిరుగు ప్రయాణంలో మాత్రం రింకూ కూడా ఉండటంతో సైకిల్‌ తొక్కడం ఇబ్బందిగా మారింది.

ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాం. ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. కాళ్లు నొప్పులు పుట్టి నిద్రకూడా పట్టలేదు. నొపులు పోవడానికి మందులు వాడాల్సి వచ్చింది. బంధువులు వివాహానికి హాజరుకాలేక పోయినా అందరూ ఫోన్లు చేసి ఆశీర్వదించారు. పెండ్లి వాయిదా వేయాలని చాలా మంది సలహా ఇచ్చారు. కాని తన తల్లి ఆనారోగ్యంతో ఉండటం, ఇంట్లో సమస్యలు, ఇంట్లో వంటచేయడానికి ఎవరూ లేకపోవడం వల్ల తప్పని సరిగా ఇప్పడే వివాహం చేసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. అంతేకాకుండా లాక్‌డౌన్‌ ఎత్తివేయడానికి ఎంతసమయం పడుతుందో తెలియదు కదా అని ప్రజాపతి అన్నారు. 


logo