సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 12, 2020 , 02:26:12

ధీమా ఇవ్వని ఫసల్‌ బీమా

ధీమా ఇవ్వని ఫసల్‌ బీమా

  • రైతు పొట్టకొట్టి కార్పొరేట్‌కు పట్టం
  • మేలు తక్కువ.. భారం ఎక్కువ
  • వైదొలుగుతున్న రాష్ర్టాలు
  • జాబితాలో ప్రధాని స్వరాష్ట్రం 
  • పథకాన్ని తప్పుపట్టిన కాగ్‌
  • ప్రీమియం నిలిపివేసిన తెలంగాణ

ఆరుగాలం కష్టించి అందరికీ అన్నంపెట్టే రైతన్నకు చేతనైతే సాయంచేయాలి.. కానీ, పొట్ట కొట్టొద్దు. అయితే, కేంద్రం వారివద్ద డబ్బులు గుంజి కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెడుతున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన రైతుల్లో ధీమా నింపకపోగా.. రాష్ర్టాలపై ఆర్థికభారం మోపుతున్నది. దీంతో రాష్ర్టాలు ఒక్కొక్కటిగా ఈ పథకం నుంచి వైదొలుగుతుండగా.. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌ కూడా ఆ జాబితాలో చేరింది. కేంద్రం తెలివిగా ఈ ఏడాది ప్రీమియం చెల్లింపులను తగ్గించుకోగా.. విషయాన్ని ముందే పసిగట్టిన తెలంగాణ ప్రీమియం చెల్లింపులు జరుపలేదు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏండ్లుగా సవ్యంగా సాగుతున్న నేషనల్‌ అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ (ఎన్‌ఏఐఎస్‌)ను పక్కనపెట్టి కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)ను తీసుకొచ్చింది. 2016 వానకాలం సీజన్‌ నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథ కం.. కార్పొరేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు మినహా ఏ ఒక్కరికీ మేలు చేయడంలేదని ఇటు రైతులు, అటు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఈ పథకం ద్వారా రైతులు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూపాయి తీసుకుంటే రైతులకు ఇచ్చేది అందులో 50 నుంచి 60 శాతమే. మిగిలిన 40% ఇన్సూరెన్స్‌ కంపెనీల జేబుల్లోకే వెళుతున్నాయనే విమర్శలున్నాయి. ఈ పథకంపై కంట్రోలర్‌ అండ్‌ అడిటర్‌ జనరల్‌ (కాగ్‌) కూడా అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనిపై రైతులకు అవగాహనలేదని తేల్చింది. ఈ పథకం ద్వారా బీమా కంపెనీలే భారీగా లాభపడుతున్నాయని, వాటిపై తనిఖీ అధికారం కూడా లేదని కాగ్‌ పేర్కొన్నది. 

ప్రయోజనం లేని పథకం నుంచి పక్కకు..

ఫసల్‌ బీమా యోజనతో రైతులకు ఉపయోగంలేదని భావిస్తున్న రాష్ర్టాలు ఒక్కొక్కటిగా పక్క కు తప్పుకొంటున్నాయి. ఇప్పటికే బీహార్‌, పం జాబ్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాలు బయటకు వచ్చేశాయి.  తక్కువ బీమాతో ఎక్కువమంది రైతులకు లబ్ధిచేకూరేలా సొంత బీమా పథకాలకు రూపొందిం చుకొంటున్నాయి. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌ కూడా రెండ్రోజుల క్రితం ఈ పథకం నుంచి తప్పుకోవడం గమనార్హం. ఈ పథకం వల్ల రైతులకు ప్రయోజనం లేకపోగా, రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్నదని వ్యాఖ్యానించిన గుజరాత్‌ సీఎం విజయ్‌రూపానీ తమ రాష్ట్రంలో ‘ముఖ్యమంత్రి కిసాన్‌ సహాయ్‌ యోజన’ పథకాన్ని ప్రా రంభించారు. ఫసల్‌ బీమా యోజన 15 నుంచి 17 లక్షల మంది రైతులకు మాత్రమే లబ్ధి చేకూర్చగా.. తాము ప్రవేశపెట్టిన పథకంతో 56లక్షల మంది రైతులకు మేలు కలుగుతుందని చెప్పారు. 

రాష్ర్టాలపై ఆర్థిక భారం కుంపటి

ఫసల్‌ బీమా యోజనలో తరచూ మార్పులు చేస్తున్న కేంద్రం.. గత ఫిబ్రవరిలో ప్రీమియం చెల్లింపుల్లో తనవాటాను భారీగా తగ్గించుకున్నది. నిబంధనల ప్రకారం మొత్తం బీమాలో వానకాలం పంటకు 2%, యాసంగికి 1.5%, వాణిజ్య పంటలకు 5% రైతులే చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా చెల్లిస్తాయి. కేంద్రం తనవాటాగా చెల్లించాల్సిన 50% ప్రీమియాన్ని గత ఫిబ్రవరిలో తగ్గించింది. నీటి వసతి ఉన్న ప్రాంతానికి 50 నుంచి 25 శాతానికి, నీటి వసతిలేని ఏరియాకు 30 శాతానికి తన వాటాను తగ్గించుకున్నది. మిగిలిన మొత్తాన్ని రాష్ర్టాలే భరించాలని చేతులేత్తేసింది. ఈ పథకంపై ముందే ఊహించిన తెలంగాణ ప్ర భుత్వం ఈ ఏడాది ప్రీమియం చెల్లించలేదు. 

కంపెనీలకు కాసుల వర్షం

వర్షాలు, కరువుతో పంట నష్టపోయే రైతులను ఆదుకొనేందుకు ఉద్దేశించిన పీఎంఎఫ్‌బీవై కార్పొరేట్‌ కంపెనీలకు కాసుల వర్షం కురిపిస్తున్నది. తెలంగాణలో 2016 నుంచి 2019-20 వరకు రూ.2,476.98 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి బీమా కంపెనీలకు ప్రీమియంగా చెల్లించగా.. రైతులకు అందిన పరిహారం రూ.1,783.92 కోట్లు మాత్రమే. కంపెనీలు పొందిన లాభం దాదాపు రూ.700 కోట్లు. 

గుజరాత్‌లో అట్టర్‌ఫ్లాప్‌

పీఎంఎఫ్‌బీవై ప్రధాని సొంతరాష్ట్రం గుజరాత్‌ లో ఘోరంగా విఫలమైంది. ప్రీమియం కట్టించుకున్న కంపెనీలు రైతులకు పరిహారం అందించలేదని తమ సర్వేలో తేలిందని సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ అకౌంటబిలిటీ సంస్థ  పేర్కొన్నది. ఈ పథ కం వల్ల బీమా కంపెనీలే అధిక లాభం పొందాయని తెలిపింది. పథకం అమలుపై ఆ సంస్థ కేస్‌స్టడీ చేసింది. గుజరాత్‌లోని అరవల్లి జిల్లాకు చెం దిన ఓ రైతు 1.35 హెక్టార్లలో వేరుశనగ పంట వేయగా.. వర్షాలతో మొత్తం నష్టపోయాడు. ఈ పథకం కింద ఆయనకు అందిన పరిహారం రూ.100 మాత్రమే. ఇదేమిటని అడిగే పరిస్థితి కూడా అక్కడలేదు. పైగా గుజరాత్‌ ప్రభుత్వం ఆ జిల్లాను 33% వరద ప్రభావితంగా ప్రకటించిం ది. అయినా రైతులకు బీమా కంపెనీల నుంచి పరిహారం అందలేదు. పంటనష్టం జరిగిన 72 గంటల్లోగా కంపెనీలకు సమాచారం ఇవ్వాలనే నిబంధన కూడా వరమైనట్టు తెలుస్తున్నది.



logo