బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 10, 2020 , 04:54:48

పలు జిల్లాల్లో అకాల వర్షం

పలు జిల్లాల్లో అకాల వర్షం
  • పంటలకు నష్టం
  • వచ్చే రెండ్రోజులు వానలు

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ/నెట్‌వర్క్‌: ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు ఈదురు గాలులు తోడుకావడంతో చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్‌-టి, వాంకిడి, కౌటాల, చింతలమానేపెల్లి, బెజ్జూర్‌ తదితర ప్రాంతాల్లో సోమవారం తేలికపాటి వర్షం పడింది. ఈదురుగాలలతో కూడిన వర్షానికి శనగపంటకు కొద్దిపాటి నష్టం వాటిల్లింది. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల, మయూరి పార్క్‌, భూత్పూర్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ముసురు కురిసింది. నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద, నారాయణపేట, మద్దూర్‌, కోస్గి మండలాల్లో ఓ మోస్తరు వాన పడింది. కామారెడ్డి జిల్లా లింగంపేట్‌, గాంధారి, బీర్కూర్‌, నాగిరెడ్డిపేట్‌ మండలాల్లో ఆదివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షానికి మక్కజొన్న నేలవాలింది. 

కరీంనగర్‌ జిల్లాలో...

కరీంనగర్‌ జిల్లాలో ఆదివారం కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో వరద నీరు చేరడంతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సోమవారం సాయం త్రం పరిశీలించారు. అకాల వర్షానికి పలు మండలాల్లో 885 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, మానకొండూర్‌లోని పలు చోట్ల దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో..

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని శివరాంపల్లి, రాజేంద్రనగర్‌, మెహిదీపట్నం, నాంపల్లి, అబిడ్స్‌, బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, బేగంపేట తదితర ప్రాంతాల్లో సోమవారం తేలికపాటి వర్షం కురిసింది. గ్రేటర్‌వ్యాప్తంగా 1.0 సెం.మీ. వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. 

ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా..

సోమవారం మేడ్చల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, పెద్దపల్లి, మంచిర్యాల, నిజామాబాద్‌, కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిశాయి. ఆదిలాబాద్‌ తలమడుగులో అత్యధికంగా 29.3 మి.మీ. వర్షం కురిసినట్టు టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది.

మరో రెండ్రోజులు వానలు

మరాఠ్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో మంగళ, బుధవారాల్లోనూ ఆకాశం మేఘావృతమై, పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. కాగా వచ్చే మూడు రోజులపాటు గ్రేటర్‌ హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షా లు కురిసే అవకాశమున్నట్టు పేర్కొన్నారు.


logo