శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 02:15:13

గోదావర్రీకి తెరపడినట్టేనా!

గోదావర్రీకి తెరపడినట్టేనా!

  • నాలుగు దశాబ్దాలకు గోదావరి మథనం
  • ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు  కేంద్రం సిద్ధం
  • రెండు రాష్ర్టాలకు స్పష్టతనిచ్చిన కేంద్ర జల్‌శక్తి శాఖ
  • తెలంగాణకు నికరజలాలతోపాటు మిగులుతో పెరుగనున్న వాటా

నాలుగు దశాబ్దాల తర్వాత గోదావరిజలాల పంపిణీ తెరపైకి వస్తున్నది. గోదావరిపై కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు కేంద్రం సిద్ధమవుతుంది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ర్టాలకు కేంద్ర జల్‌శక్తి అధికారికంగా సమాచారమిచ్చింది. ఇటీవల అపెక్స్‌ భేటీలో ఇద్దరు సీఎంలు అంగీకరించిన దరిమిలా కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని జల్‌శక్తి స్పష్టంచేసింది. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956లోని సెక్షన్‌-3 ప్రకారం రెండు తెలుగు రాష్ర్టాలు కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటును కోరుతూ లేఖ రాయాలని కూడా జల్‌శక్తి రెండు రాష్ర్టాలను కోరింది. దీంతో గోదావరిలో మిగులు జలాల్లో 

తెలంగాణ వాటాపై స్పష్టతరానుంది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  కృష్ణా బేసిన్‌లోని రాష్ర్టాల మధ్య జలాల పంపిణీకి రెండుసార్లు శాస్త్రీయ సర్వే జరిగింది. 75 శాతం డిపెండబులిటీపై 2,130 టీఎంసీల నీటి లభ్యత ఉన్నదని తేల్చిన బచావత్‌ ట్రిబ్యునల్‌.. ఆ మేరకు కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఏపీ మధ్య నీటి పంపిణీని చేపట్టింది. తర్వాత వచ్చిన బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ సమయంలోనూ 65 శాతం డిపెండబులిటీపై 2,578 టీఎంసీల నీటి లభ్యత ఉన్నదని తేల్చి.. ఆ మేరకు బచావత్‌ కేటాయింపుల కంటే ఎక్కువగా ఉన్న నీటిని మూడు రాష్ర్టాల మధ్య పంపిణీ చేశారు. అయితే గోదావరిలో ఇలాంటి శాస్త్రీయ సర్వేగానీ, నీటి పంపకాలుగానీ నేటికీ జరుగలేదు. కేంద్రం ఏర్పాటుచేయనున్న కొత్త ట్రిబ్యునల్‌తో ఈ గందరగోళానికి తెరపడనున్నదని భావిస్తున్నారు. 1969లో కృష్ణా-గోదావరి కమిషన్‌ సమయంలో కృష్ణ, గోదావరి రెండింటికీ వేర్వేరు ట్రిబ్యున్సల్‌ వేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ముందుగా కృష్ణా జలాల పంపకాలపై దృష్టిసారించి.. ఓ కొలిక్కి వచ్చాక పదేండ్లకు అంటే 1979లో గోదావరిపై అవార్డు రూపొందించారు. అయితే, ఈ బేసిన్‌లోని మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఏపీ మధ్య ఎలాంటి విభేదాలు లేకపోవడంతో ఆయా రాష్ర్టాల్లో జరిగిన జలఒప్పందాలను క్రోడీకరించి వాటికే ఆమోద్రముద్ర వేశారు. కానీ, కృష్ణాలో మాదిరిగా శాస్త్రీయంగా గోదావరిజలాల నీటి లభ్యతపై శాస్త్రీయసర్వే జరిపి పంపకాలు జరిపిన దాఖలాల్లేవు. 1969లో ట్రిబ్యునల్‌ వేసినపుడు అన్నిరాష్ర్టాలు ప్రతిపాదనలు ఇవ్వగా.. తర్వాత పదేండ్లలోపే అన్నిరాష్ర్టాల్లోనూ కొత్త ప్రాజెక్టులు రావడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

పెరుగనున్న తెలంగాణ వాటా...

కొన్నిరోజుల క్రితం జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయాలకు సంబంధించి కేంద్ర జల్‌శక్తిశాఖ అధికారికంగా విడుదల చేసిన వివరాల ప్రకారం.. గోదావరిపైనా కొత్త ట్రిబ్యునల్‌ వేసేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణకు గోదావరిలో తనవాటా 956.98 టీఎంసీలను పూర్తిగా వినియోగించుకుంటున్నది. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో రీడిజైనింగ్‌లో భాగంగా చేపట్టిన కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతమ్మబరాజ్‌, సీతారామ తదితర ప్రాజెక్టులతో తెలంగాణ వినియోగం మరింతగా పెరుగనున్నది. దీనిని దృష్టిలో ఉంచుకొని మిగులు జలాల్లోనూ 600 టీఎంసీలకు పైగా వాటా కావాలని ఇప్పటికే తెలంగాణ కేంద్రం ముందు ప్రతిపాదన పెట్టింది. అన్ని సబ్‌బేసిన్లలోని మిగులు జలాలను ఉమ్మడి ఏపీ వాడుకోవచ్చని బచావత్‌ అవార్డులో పొందుపరిచిన వాస్తవాన్ని కూడా కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రికి రాసిన లేఖలో ఉదహరించింది. కేంద్రం కొత్త ట్రిబ్యునల్‌ వేయడం ద్వారా నీటిలభ్యతపై శాస్త్రీయంగా స్పష్టతరావడంతో పాటు ప్రాజెక్టులవారీగా కేటాయింపులు చేయించుకునేందుకు వీలవుతుందని సాగునీటిరంగ నిపుణులు, అధికారులు విశ్లేషిస్తున్నారు.

అంతా అశాస్త్రీయమే..

  • పోలవరం, ఇచ్చంపల్లి వంటి ప్రాజెక్టులపై ఒప్పందం జరిగిన సమయంలో ఎఫ్‌ఆర్‌ఎల్‌ (పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం)ను మాత్రమే పొందుపరిచారు. కానీ, ఎక్కడా టీఎంసీల కేటాయింపు జరుగలేదు. 
  • శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు విషయంలోనూ ఎఫ్‌ఆర్‌ఎల్‌ ప్రాతిపదికనే ఒప్పందం జరుగడంతో.. మహారాష్ట్ర ఈ ప్రాజెక్టు ఎఫ్‌ఆర్‌ఎల్‌ పరిధిలోనే బాబ్లీని నిర్మించేందుకు పూనుకున్నది. 
  • బాబ్లీ కేసు విచారణలో భాగంగా అప్పటి ఉమ్మడి ఏపీ.. 1969లో మహారాష్ట్ర ట్రిబ్యునల్‌కు ఇచ్చిన ప్రతిపాదనల మేరకు ఆ రాష్ట్ర అప్పటి, భవిష్యత్‌ నీటి వినియోగాన్ని లెక్కగట్టి 79 టీఎంసీలుగా సుప్రీంకోర్టుకు ఇచ్చింది. కానీ, మహారాష్ట్ర కోర్టుకు ఇచ్చిన నివేదికలో మాత్రం 102 టీఎంసీల ప్రతిపాదనలను సమర్పించింది. దీంతో ట్రిబ్యునల్‌ ముందు ఉన్న ప్రతిపాదనలకు ఆయా రాష్ర్టాల వాస్తవ ప్రతిపాదనల మధ్య పొంతనలేకుండాపోయింది.
  • కేంద్రం ఆధీనంలోని జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) గోదావరిలో 700 టీఎంసీల మిగులుజలాలు ఉన్నాయని గతంలో నివేదిక ఇచ్చింది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపిన తెలంగాణ మరో అధ్యయనం చేయాలని డిమాండ్‌ చేసింది. దీంతో 270 టీఎంసీల మిగులుజలాలు ఉన్నాయని మరో నివేదిక ఇచ్చింది. దీనిపై కూడా తెలంగాణ అభ్యంతరం తెలిపింది. 
  • సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ప్రథమంగా చేపట్టిన లైడార్‌ సర్వే ద్వారా ఏటా మూడు వేల టీఎంసీలకుపైగా గోదావరిజలాలు సముద్రంలో కలుస్తున్నాయనే విషయం శాస్త్రీయంగా బయటపడింది. దీంతోపాటు ప్రాణహిత, ఇంద్రావతి ఉపనదులే గోదావరికి ప్రాణం పోస్తున్నాయనే కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి.

తాజావార్తలు