బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 03:15:46

‘షేర్‌' నంబర్‌వన్‌

‘షేర్‌' నంబర్‌వన్‌

  • పులుల సంఖ్యలో భారత్‌ మొదటిస్థానం
  • రాష్ట్రంలోని కవ్వాల్‌, ఆమ్రబాద్‌ రిజర్వ్‌ ఫారెస్టుల్లో 26 పెద్దపులులు
  • సంరక్షణకు తెలంగాణప్రభుత్వం ప్రత్యేక చర్యలు
  • నేడు అంతర్జాతీయ టైగర్‌ డే

దానిమ్మరంగు దేహంపై నల్లటి చారలతో ఆకట్టుకునే రూపం.. తీక్షణమైన చూపు.. నడకలో రాజసం.. భీకరమైన గాండ్రింపు.. చీమచిటుక్కుమన్నా అప్రమత్తమయ్యే వినికిడి జ్ఞానం. గజరాజునైనా మట్టికరిపించగల పంజా.. అలాంటి పెద్దపులి..  అడవుల విధ్వంసం, వేటగాండ్ల వేటుతో ఒకానొకదశలో ఉనికిని కోల్పోయే దశకు చేరింది. దశాబ్దాల కాలంగా తీసుకుంటున్న సంరక్షణ చర్యలతో అడవుల్లో వాటి అలికిడి పెరుగుతున్నది. మళ్లీ గాండ్రింపులు వినిపిస్తున్నాయి. నేడు ఇంటర్నేషనల్‌ టైగర్‌ డేను పురస్కరించుకుని ప్రత్యేక కథనం..

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జంతువుల్లో పెద్దపులిది ప్రత్యేక స్థానం. వైవిధ్యమైన ఆహార్యం, జీవనవిధానంతో జంతువుల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. శౌర్యానికి ప్రతీకగా నిలిచే పెద్దపులి హిందూ పురాణాలు, ఇతిహాసాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిఉన్నది. భారత్‌తోపాటు, సౌత్‌కొరియా, మలేషియా, బంగ్లాదేశ్‌ తదితర దేశాలు పెద్దపులిని జాతీయజంతువుగా ప్రకటించాయి. పలుదేశాలు తమ జాతీయపతాకంపై స్థానం కల్పించాయి. అలాంటి పెద్దపులి అడవుల విధ్వంసంతో ఆవాసం కోల్పోయింది. వేటగాళ్ల వలలో చిక్కుకుని విలవిలలాడింది. 1986 నాటికి ఐయూసీఎస్‌ రెడ్‌ బుక్‌లో అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేరిపోయింది. భారత్‌లోనే 90 శాతం పులులు ఆవాసాన్ని కోల్పోయాయని గణాంకాలు చెప్తున్నాయి. పులుల్లో బాలినీస్‌, జావాస్‌, కాస్పియన్‌ టైగర్‌ జాతులు అంతరించిపోయాయి. మిగిలిన జాతులు కూడా అంతర్థానమయ్యే స్థితికి చేరుకొన్నాయి. దీనిని నివారించాలనే సంకల్పంతో 2010, జూలై 29న రష్యాలో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో 13 దేశాల ప్రతినిధులు సమావేశయ్యారు. పెద్దపులి ప్రాముఖ్యం, సంరక్షణ ఆవశ్యకతపై విస్తృత ప్రచారం చేయాలని తీర్మానించారు. 2022 నాటికి పులుల సంఖ్యను రెట్టింపుచేయాలని నిర్ణయించారు. నాటినుంచి ఏటా జూలై 29న అంతర్జాతీయ టైగర్‌డేను నిర్వహిస్తున్నారు.

సంరక్షణ చర్యల్లో భారత్‌ భేష్‌

పులుల సంఖ్యలో భారత్‌ ప్రథమస్థానంలో ఉన్నది. ప్రపంచవ్యాప్తంగాఉన్న పులుల్లో సుమారు 75శాతం ఇక్కడే ఉన్నాయి. కేంద్రం 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టంచేసి అటవీ జంతువుల వేటను నిషేధించింది. ఈ చర్యలతో 1973లో 1,200 ఉన్న పులులసంఖ్య 1990 నాటికి 3,500కు చేరుకున్నది. అయితే క్రమంగా అడవుల విస్తీర్ణం తగ్గిపోవడంతో 60 శాతానికి పడిపోయింది. 2007 నాటికి 1,411 పులులు మాత్రమే మిగిలాయి. ఈ నేపథ్యంలో 2006లో కేంద్రం నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) ప్రాజెక్టును చేపట్టి ప్రత్యేకసంరక్షణ చర్యలు తీసుకున్నది. అందులోభాగంగా నాలుగేండ్లకోసారి పులుల గణన నిర్వహిస్తున్నారు. దీంతో దేశంలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది. 2006లో 1,411 నుంచి 2010లో 1706కు, 2014లో 2226కు చేరాయి. 2018 నాటికి దేశంలోని యాభై టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లలో వాటిసంఖ్య 2,967కు పెరిగిందిజ కేంద్రప్రభుత్వం పులుల గణన, సంరక్షణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది. 2018లో సుమారు 141 సైట్లలో 26,760 ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటుచేసింది. వాటిద్వారా సుమారు 76,523 ఫొటోలను సేకరించి పులుల సంఖ్యను నిర్ధారించారు. పులి పాదముద్రలు, వెంట్రుకలు, గోళ్లు, మలమూత్రాల ఆధారంగానూ వాటిసంఖ్యను నిర్ధారిస్తున్నారు.

తెలంగాణలో పెరుగుతున్న సంతతి

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేకచర్యలతో రాష్ట్రంలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఆమ్రాబాద్‌, కవ్వాల్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో పులుల పునరుత్పత్తికి అనుకూల వాతావరణం ఏర్పడింది. ఆయా రిజర్వ్‌ ఫారెస్ట్‌ల్లో పులులు సంచరించే ప్రాంతాలను గుర్తించడంతోపాటు, ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటుచేసింది. ఇందుకోసం యానిమల్‌ ట్రాకర్‌, బేస్‌క్యాంపు వాచర్లతో కలిపి నలుగురు సభ్యులతో ప్రత్యేక అధికార బృందాలను నియమించింది. నీటివసతి కోసం సాసర్‌ పిట్లను నిర్మిస్తున్నది. ఆహారం కోసం పులులు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లకుండా కొండగొర్రెలు, దుప్పులు, నీల్గాయ్‌లు తదితర జంతువులను ప్రత్యేకంగా పెంచుతున్నది. ఈ చర్యలతో ఇతర ప్రాంతాల నుంచి కూడా పులులు తరలివస్తున్నాయి. కవ్వాల్‌ రిజర్వ్‌ ఫారెస్టులో ఇప్పటికే 6 పులులు ఉండగా.. ఆవాసాన్ని వెతుక్కుంటూ మహారాష్ట్రలోని తడోబా నుంచి ఇటీవల మగపులి వచ్చినట్టు గుర్తించారు. తిప్పేశ్వర్‌ నుంచి పులులు కవ్వాల్‌కు బాటపడుతున్నాయి.

టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ వివరాలు (విస్తీర్ణం చ.కి.మీ.లలో)


దేశవ్యాప్తంగా
తెలంగాణలో 
మొత్తం కోర్‌ ఏరియా  
40,340.12
3,065.36
మొత్తం బఫర్‌ ఏరియా
30,686.98
1570.87
మొత్తం విస్తీర్ణం
71,027.10
4,630.51
పులుల సంఖ్య
2,967
26
logo