శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 02:59:26

రైతుకు శాపం కేంద్ర చట్టం

రైతుకు శాపం కేంద్ర చట్టం

  • తక్కువ ధరకే ఇతర రాష్ర్టాల నుంచి వడ్లు, మక్కలు
  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి చట్టంపై అవగాహన లేదు 
  • మంత్రి హరీశ్‌రావు మండిపాటు
  • కేంద్ర ఎమ్మెస్పీ లేఖ విడుదల

గజ్వేల్‌: కేంద్ర నూతన వ్యవసాయ చట్టం తెలంగాణ రైతులకు శాపంగా మారిందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుకు కొర్రీలు పెడుతూ ఎమ్మెస్పీ సర్క్యూలర్‌ విడుదల చేసిన కేంద్రం, రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్నదని మండిపడ్డారు. స్వేచ్ఛా మార్కెట్‌ విధానంతో రైతు మద్దతు ధర పొందే అవకాశం లేదన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో శుక్రవారం సీసీఐ ఆధ్వర్యంలో పత్తి, మార్క్‌ఫెడ్‌ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రం పంపిన ఎమ్మెస్పీ సర్క్యూలర్‌ను మంత్రి హరీశ్‌రావు మీడియాకు విడుదల చేశారు. వర్గల్‌లో ధరణి ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. స్వేచ్ఛా మార్కెటింగ్‌ విధానంతో వ్యవసాయ ఉత్పత్తులు ఇతర దేశాలు, రాష్ర్టాల నుంచి తక్కువ ధరకే దిగుమతి కావడంతో స్థానిక రైతులకు గిట్టుబాటు లభించకుండా పోతుందన్నారు. దిగుమతి సుంకా న్ని 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించడంతో ఇతర దేశాల నుంచి తక్కువ ధరకు ధాన్యం దిగుమతి అవుతుందని, ఫలితంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మద్దతు ధర అందించకుండా సంకెళ్లు వేసిందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌ నుంచి రూ.1,100కే క్వింటాల్‌ మక్కలు రాష్ట్ర మార్కెట్‌లో లభించడంతో స్థానికంగా మక్కల ధర పడిపోయిందన్నారు. గత యాసంగిలో కొనుగోలు చేసిన మక్కలు రాష్ట్ర గిడ్డంగుల్లో పేరుకుపోయాయని, వీటితో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. వెయ్యి కోట్ల నష్టం వచ్చిందన్నారు. ప్రస్తుతం రైతులకు మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించడంతో వానకాలం మక్కలను క్విం టాల్‌కు రూ.1,825 చొప్పున కొనుగోలు చేశారన్నారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీరు సరిగ్గా లేదు..

సన్న రకం వడ్లకు మద్దతు ధర అందించడంలో కేంద్ర నిబంధనలతో రైతులు నష్టానికి గురయ్యే అవకాశం ఉన్నదని మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. సన్న రకాలకు ఎక్కువ ధర ఇవ్వకుండా మద్దతు ధర నిర్ణయించిన కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలకు కొనుగోలు చేస్తే స్వీకరించబోమని హెచ్చరిస్తున్నదన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాత్రం సన్న రకాలకు ఎక్కువ ధర చెల్లించాలనడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. నూతన వ్యవసాయ చట్టంపై ఏ మాత్రమైనా అవగాహన ఉన్నదా అని నిలదీశారు. రాష్ట్రంలో ఈ వానకాలంలో 87,84,000 టన్నుల ధాన్యం దిగుమతి అవుతుందని, రాష్ట్ర అవసరాలు 26 లక్షల టన్నులు పోనూ మిగతా 60 లక్షల టన్నులకుపైగా ధాన్యం మిగులుతుందన్నారు. 

రైతుల కోసం నష్టాలను భరిస్తాం..

కేంద్రం విధానాలతో రాష్ర్ట ప్రభుత్వానికి నష్టాలు పెరిగినా రైతు సంక్షేమం కోసం భరించడానికి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మక్కలు, ధాన్యం, పత్తి రైతుల వద్ద ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను పూర్తిగా కొనుగోలు చేస్తామన్నారు. సన్న రకాలను కూడా క్వింటాల్‌కు రూ.1,888కు, మక్కలు రూ.1,825కు, పత్తి బీబీ స్పెషల్‌ గ్రేడ్‌ ప్రకారం రూ.5,775 కొనుగోలు చేస్తామన్నారు. గజ్వేల్‌ అత్యాధునిక భూసార పరీక్షా కేంద్రాన్ని వచ్చే వానకాలం నాటికి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ పద్మారావు, గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి పాల్గొన్నారు.