బుధవారం 03 జూన్ 2020
Telangana - May 17, 2020 , 02:01:42

ఏపీ కొత్త ప్రాజెక్టును ఆపేయండి!

ఏపీ కొత్త ప్రాజెక్టును ఆపేయండి!

  • చట్ట ప్రకారం చర్యలున్నాయో లేదో పరిశీలించండి
  • కృష్ణా బోర్డుకు కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆదేశం
  • ఇరురాష్ర్టాల సీఎంలతో ఢిల్లీస్థాయిలో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ
  • నిర్ణయించిన కేంద్ర జలవనరులశాఖ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలపెట్టిన ఎత్తిపోతల పథకాన్ని ఆపేయాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ కృష్ణా నది యాజమాన్య బోర్డుకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా మూడు టీఎంసీలు, పోతిరెడ్డిపాడు విస్తరణతో కలిపి రోజుకు పది టీఎంసీల కృష్ణా జలాలను పెన్నా బేసిన్‌కు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కొత్త ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం రెండుసార్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

ముఖ్యంగా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014ను ఉల్లంఘిస్తూ ఏపీ సర్కారు కొత్త ప్రాజెక్టుకు పాలనా ఆమోదం ఇచ్చిన జీవో ఆధారంగా తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ ఈ నెల 13న కృష్ణా బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ను కలిసి ఫిర్యాదుచేశారు. దీంతో బోర్డు కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించాలని ఏపీ జలవనరులశాఖను ఆదేశించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. ‘ఏపీ కొత్త ప్రాజెక్టు ఫిర్యాదును పరిశీలించిన మీదట వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేయడంతోపాటు ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను తెప్పించుకొని సాంకేతిక పరిశీలన చేయండి’ అని కేంద్ర మంత్రి కృష్ణా బోర్డును ఆదేశించారు. 

పునర్వ్యవస్థీకరణ చట్టానికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందా? లేదా? అని తేల్చాలని సూచించారు. అప్పటివరకు కొత్త ప్రాజెక్టుపై ఏపీ ముందడుగు వేయకుండా సూచించాలని కూడా స్పష్టంచేశారు. దీంతోపాటు ఇరురాష్ర్టాల ముఖ్యమంత్రులతో ఢిల్లీస్థాయిలో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి కూడా కేంద్ర జలవనరులశాఖ నిర్ణయించింది. ఈ విషయంపై కేంద్ర మంత్రి షెకావత్‌ సంబంధిత ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు. రెండు రాష్ర్టాలు కృష్ణాజలాలను వాడుకొనే విషయంతోపాటు ప్రధానంగా ఏపీ కొత్త ప్రాజెక్టుపై చర్చించేందుకు వెంటనే అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి ఏర్పాట్లు చేయాలని సూచించారు.

రేపు కృష్ణా బోర్డు భేటీ

ఆంధ్రప్రదేశ్‌ కొత్త ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం, కేంద్ర మంత్రి ఆదేశాలు జారీచేయడంతో కృష్ణా నది యాజమాన్య బోర్డు సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఏపీ జలవనరులశాఖకు రెండుసార్లు లేఖ రాసినా స్పందించకపోవడంతో తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై అధికారులు దృష్టిసారించే అవకాశాలున్నాయి. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కొత్త ప్రాజెక్టు డీపీఆర్‌ను సమర్పించాల్సిందిగా ఏపీ జలవనరులశాఖకు మరోసారి లేఖ రాసే అవకాశాలున్నట్టు తెలిసింది. ఢిల్లీస్థాయిలో రెండు రాష్ర్టాల సీఎంలతో జరుగాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీపై బోర్డు అధికారులు చర్చించనున్నారు. దీనిపై రెండు రాష్ర్టాల నుంచి సమాచారాన్ని తీసుకొని ఎప్పుడు నిర్వహించాలనే దానిపై అభిప్రాయాలు, తేదీని సూచించాలని కోరే అవకాశమున్నది. తద్వారా అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి తేదీలను సూచిస్తూ కేంద్ర జలవనరులశాఖకు సమాచారం ఇవ్వనున్నారు.


logo