బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 19, 2020 , 16:57:26

జిల్లాల్లో కోవిడ్‌ నిర్వహణపై ప్రత్యేక దృష్టి : సోమేశ్ కుమార్

జిల్లాల్లో కోవిడ్‌ నిర్వహణపై ప్రత్యేక దృష్టి : సోమేశ్ కుమార్

హైద‌రాబాద్ : క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి నివార‌ణ‌లో అదేవిధంగా జాతీయ స‌గ‌టుతో పోల్చితే త‌క్కువ మ‌ర‌ణాల శాతం న‌మోదు కావ‌డంప‌ట్ల కేంద్ర కేబినెట్ కార్య‌ద‌ర్శి రాజీవ్ గౌబా తెలంగాణ ప్ర‌భుత్వానికి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. పన్నెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర వాణిజ్యశాఖ‌ మంత్రి పియూష్ గోయల్, క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా శ‌నివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వైరస్ వ్యాప్తి నివార‌ణ‌లో వివిధ రాష్ట్రాలు తీసుకున్న చర్యల గురించి కేంద్ర మంత్రి, క్యాబినెట్ కార్యదర్శి ఆరా తీశారు. రాష్ట్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో పెద్ద ఎత్తున కోవిడ్ పరీక్షలను నిర్వ‌హించ‌డంప‌ట్ల క్యాబినెట్ కార్యదర్శి ప్రశంసించారు.

ఈ సందర్భంగా రాష్ర్ట ప్ర‌భుత్వ ప్ర‌ధాన‌ కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ.. క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కొవ‌టానికి రాష్ర్ట ప్ర‌భుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను ప్ర‌భుత్వం నిశితంగా ప‌రిశీలిస్తోంద‌న్నారు. టెస్టుల సంఖ్య‌ను గ‌ణ‌నీయంగా పెంచిన‌ట్లు తెలిపారు. ల‌క్ష‌ణాలు ఉండి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లో నెగెటివ్ వ‌చ్చిన వారికి ఆర్‌టీపీసీఆర్ ప‌రీక్ష‌లు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. అన్ని ప‌డ‌క‌ల‌ను ఆక్సిజన్ సదుపాయాలతో సిద్ధం చేసేందుకు ప్రభుత్వం వ్యూహాన్ని రూపొందించిందన్నారు. జిల్లాల్లో కోవిడ్‌ పరిస్థితుల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించిన‌ట్లు తెలిపారు. ఈ స‌మావేశంలో ఆరోగ్య కార్యదర్శి రిజ్వి, డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ డాక్టర్ ప్రీతి మీనా, ఇతర ఆరోగ్య అధికారులు పాల్గొన్నారు.


logo