బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 03:36:09

వ్యవసాయానికి ఏటా రూ.60 వేల కోట్లు

వ్యవసాయానికి ఏటా రూ.60 వేల కోట్లు

  • ఆ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 

కొల్లాపూర్‌: తెలంగాణలో వ్యవసాయరంగానికి ఏటా రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగవట్నంలో 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపనతోపాటు నార్లాపూర్‌లో రూ.2.08 కోట్ల కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు రైతులు పడిన గోసను చూసిన కేసీఆర్‌.. సీఎం అయ్యాక ఉచిత కరెంట్‌ను అందించి విద్యుత్‌ కష్టాలను తీర్చారన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే 11 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రెండేళ్లలో మరో 11 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. 60 లక్షల మందికి సీఎం కేసీఆర్‌ రైతుబంధు పథకం అమలు చేస్తున్నారని చెప్పారు. అనంతరం పెద్దకొత్తపల్లిలో రూర్బన్‌ మిషన్‌ కింద ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌ను మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించి రోడ్డు డివైడర్‌లో మొక్కలు నాటారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని క్యాంప్‌ కార్యాలయంలో 27 మంది బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు.  


logo