సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 02:27:38

అతడు నేరస్థుడు!

అతడు నేరస్థుడు!

 • మానసిక హింసతో మగాడి తప్పటడుగు 
 • కుటుంబ పోషణ, ఒత్తిళ్లతో ఉక్కిరిబిక్కిరి
 • చట్టాల్లో పక్షపాతంతో మరిన్ని చిక్కులు
 • తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశాలు

ఇది పురుషాధిక్య సమాజం. అందుకే దేనికైనా బాధ్యుడు మగాడే. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా ప్రతిదానితో పోరాటం. కుటుంబాన్ని పోషించాలి. తల్లిదండ్రుల అవసరాలు తీర్చాలి. భార్యకు అడిగినవి కొనివ్వాలి. పిల్లలు కోరింది తెచ్చివ్వాలి. అందరికీ నేనున్నానంటూ అండగా నిలవాలి. ఈ క్రమంలో ఎన్ని ఒత్తిళ్లున్నా, ఎన్ని సమస్యలున్నా భరించాలి. శారీరకంగా, మానసికంగా హింసకు గురైనా బయటికి చెప్పుకోలేని పరిస్థితి. ఈ క్రమంలో తప్పటడుగులు వేస్తూ సమాజం ముందు దోషిగా, నేరస్థుడిగా మిగిలిపోతున్నాడు!

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : మగాడు నేరస్థుడవుతున్నాడు. హత్యలు, లైంగిక దాడులు, కిడ్నాప్‌లు.. వరకట్న వేధింపులు, గృహహింస.. ఆర్థిక, సైబర్‌ దోపిడీలు.. ఇలా ప్రతి దాంట్లో మగాడి పాత్రే పెద్దది. నేరం ఏదైతేనేం చేసినందుకు ఫలితం అనుభవిస్తున్నాడు. ఇలా దేశంలో నమోదవుతున్న నేరాల్లో ఎక్కువ సంఖ్యలో మగాళ్లే ఉంటున్నారు. అసలు.. మగాడు ఎందుకు నేరస్థుడిగా మారుతున్నాడు? దారితీసే పరిస్థితులేంటి? సమాజం నుంచి ఎదుర్కొంటున్న సవాళ్లేంటి? తదితర అంశాలపై దేశంలోనే తొలిసారి మై నేషన్‌ హోప్‌ ఫౌండేషన్‌ ఇండియా సంస్థ ‘ఏ స్టడీ ఆన్‌ మెంటల్‌ హెల్త్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెన్‌' పేరుతో అధ్యయనం చేసింది. అందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2018 జనవరి నుంచి 2020 మార్చి వరకు నిర్వహించిన ఈ అధ్యయనంలో దేశవ్యాప్తంగా సోషల్‌ వర్కర్లు, పరిశోధకులు, డాక్టర్లు, ఐటీ ఇంజినీర్లు, బ్యాంకు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ నివేదికను సంస్థ ఈ నెల 6న విడుదల చేసింది. ‘పురుషులపై జరిగే హింసకు సమాజం, కుటుంబం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదు. హింస పెరిగేకొద్దీ అతడిలో కఠినత్వం పెరుగుతూ పోతున్నది. శారీరక, మానసిక ఒత్తిళ్లు వాళ్లను నేరస్థులుగా మార్చుతున్నాయి’ అని నివేదిక పేర్కొన్నది. ఈ నివేదిక ప్రకారం.. చాలా వరకు గృహ హింస ఘటనల్లో భార్యల నుంచి మానసిక వేధింపులు, కొన్నిసార్లు శారీరక హింస ఎదురవుతున్నా పురుషులు చెప్పుకోవటం లేదు. బయట చెప్తే పరువు పోతుందని, ఇంట్లోవాళ్లకు చెప్తే చులకన అవుతామన్న భావన వాళ్లను తమలో తామే కుమిలిపోయేలా చేస్తున్నాయి. ఆ ఒత్తిడితో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుండగా, మరికొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నేరస్థులుగా మిగిలిపోతున్నారు.

సమస్యల నుంచి ఎలా బయటపడాలి?

 • సమస్యలు ఉన్నపుడు ‘నేను వీటి నుంచి ఎలా బయటపడాలి?’అని మగాడు ప్రశ్నిస్తే సమాధానం ఇచ్చేవారే కనిపించడం లేదు.
 • అంతేకాదు.. కొన్ని చట్టాలు పూర్తిగా మహిళలకే అనుకూలంగా ఉండటం కూడా వారిపై నేరముద్ర పడేలా చేస్తున్నది.
 • భార్యాభర్తలకు మధ్య గొడవలు వచ్చినపుడు, హింసకు గురైనా విడాకులు తీసుకోవాల్సి వస్తే పిల్లల కోసం భర్తలు వెనక్కి తగ్గుతున్నారు. అయితే, ఈ క్రమంలో చుట్టూ ఉన్న పరిస్థితులు, కుటుంబ సభ్యులు, ప్రధానంగా భార్య వేధింపులు, భార్యాపిల్లల అవసరాలు.. ఇలా అనేక సమస్యలు వారిని నేరస్థులుగా మార్చుతున్నాయి.
 • సరైన సమయంలో వారికి అవసరమైన ఆర్థిక వనరులు ప్రభుత్వం కల్పించినా, అవసరమైన సహాయం అందించినా వాళ్లు నేరం చేయడానికి వెనకడుగు వేసే అవకాశం ఉన్నదని అధ్యయనం అభిప్రాయపడింది.

2018లో నేరాల వివరాలు:

 • నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 2018లో జరిగిన అరెస్టులను పరిశీలిస్తే స్పెషల్‌, లోకల్‌ చట్టాల కింద కేసులో అరెస్టయివారు
 • పురుషులు 20,96,359
 • మహిళలు 96,798
 • ఐపీసీ సెక్షన్ల కింద 31,38,756 మంది పురుషులు, 1,76,288 మంది మహిళలు అరెస్టయ్యారు. 
 • ఇదే ఏడాదిలో తెలంగాణలో స్పెషల్‌, లోకల్‌ చట్టాల కింద 11,534 మంది పురుషులు, 420 మంది మహిళలు అరెస్టయ్యారు. ఐపీసీ సెక్షన్ల కింద 75,404 మంది పురుషులు, 5,583 మంది 
 • మహిళలు అరెస్టయ్యారు.

దేశంలో ప్రధాన నేరాలను వర్గీకరిస్తే..

 • హింసాత్మక నేరాలు 
 • హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాప్‌లు, లైంగిక దాడులు..
 • మోటర్‌, ఎక్సైజ్‌, వాహన చట్టాల కింద వచ్చే నేరాలు.
 • మహిళలపై నేరాలు - గృహ హింస, లైంగిక దాడి, వరకట్న వేధింపులు.
 • వృద్ధులపై నేరాలు, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు
 • బాలలు చేసే నేరాలు
 • ఆర్థిక నేరాలు, లంచాలకు సంబంధించినవి..
 • సైబర్‌ నేరాలు

నేరాలకు ప్రధాన కారణాలివే..

 • నిరుద్యోగం, పేదరికం
 • మద్యం, మత్తుపదార్థాలకు బానిసగా మారటం
 • అత్యవసరాలు తీర్చుకునేందుకు
 • చట్టంపై అవగాహన లేకపోవడం. చట్టం తెలిసినా శిక్ష పడదులే అన్న వైఖరి.
 • కుటుంబం, భార్యలనుంచి వచ్చే డిమాండ్లు.
 • మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం, శాడిజం.
 • శృంగారం, వివాహేతర సంబంధాలు.
 • అసూయ-ఆడవాళ్లు నిందితులుగా ఉండే చాలా నేరాల్లో ప్రధానమైనది.


logo