గురువారం 04 జూన్ 2020
Telangana - Jan 22, 2020 , 03:37:39

తెలంగాణకు ఎన్నారై పాలసీ!

తెలంగాణకు ఎన్నారై పాలసీ!
  • సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ముమ్మర కసరత్తు
  • అధ్యయనం కోసం కేరళ పర్యటనకు వెళ్లిన సీఎస్‌ బృందం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రప్రభుత్వం తెలంగాణ ప్రవాస భారతీయుల (ఎన్నారై) విధాన రూపకల్పన కసరత్తును ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలమేరకు సీనియర్‌ అధికారుల బృందం కేరళలో అమలవుతున్న ఎన్నారై విధానాన్ని పరిశీలించడానికి ఆ రాష్ర్టానికి వెళ్లింది. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావుతో కూడిన బృందం మంగళవారం తిరువనంతపురంలో ప్రవాస కేరళీయుల సంక్షేమ వ్యవహారాలశాఖ కార్యదర్శి ఇళంగోవన్‌, నోర్కారూట్స్‌ సంస్థ సీఈవో హరికృష్ణ నంబూద్రితో సమావేశమయ్యారు. 


వివిధదేశాల్లో ఉండే కేరళీయుల సంక్షేమంకోసం ఆ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అవలంబిస్తున్న విధానంపై చర్చించారు. కేరళకు చెందిన విధానపత్రాలను అధ్యయనం చేశారు. తెలంగాణ నుంచి విద్య, ఉపాధి, ఇతర అవసరాల కోసం ప్రజలు  పెద్దఎత్తున ప్రపంచంలోని వివిధ దేశాలకు వెళుతున్నారు. అక్కడ వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారికి చేదోడువాదోడుగా ఉండేందుకు సమగ్రమైన విధానం రూపొందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే ఎన్నారై పాలసీలు అమలుచేస్తున్న రాష్ట్రాల్లో విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు.


logo