బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 02:43:59

అనధికార ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లు బంద్‌

అనధికార ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లు బంద్‌

 • అక్రమ లేఅవుట్లకు చెక్‌
 • ప్రణాళికాబద్ధ అభివృద్ధే లక్ష్యం
 • ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు 
 • రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ
 • తక్షణం అమల్లోకి కొత్త నిబంధనలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రెండంతస్థుల నిర్మాణానికి అనుమతి తీసుకొని ఐదారంతస్థులు కట్టేయడం.. అక్రమంగా లేఅవుట్లు వేసి ప్లాట్లు విక్రయించడం ఇకపై కుదరదు. తెలంగాణలో ఇలాంటివాటికి తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. అనధికార ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిషేధిస్తూ బుధవారం మార్గదర్శకాలు జారీచేసింది. ఖజానాకు ఆదాయం తగ్గినా.. నిర్మాణాత్మక, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరుగాలనేదే ముఖ్యఉద్దేశమని స్పష్టంచేసింది. నూతన పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలను అనుసరించి అనధికార ప్లాట్లు, నిర్మాణాలు జరుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నది. ఈ మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని, ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు అన్నిజిల్లాల రిజిస్ట్రార్లు, సబ్‌రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీచేసింది. 

నూతన మార్గదర్శకాలు.. 

 • తెలంగాణ మున్సిపల్‌ చట్టం 2019 సెక్షన్‌ 172 (16),178 (3) ప్రకారం నిర్దేశితనిర్మాణ అనుమతిలేని భవనాలు, భవనంలోని ఒకభాగం (ప్లాట్‌), ఇతర నిర్మాణాన్ని రిజిస్ట్రేషన్‌ చేయరాదు. మున్సిపాలిటీ అనుమతిచ్చిన డిజైన్‌ మేరకు నిర్మాణం లేకపోతే రిజిస్ట్రేషన్‌ చేయొద్దు.  
 • పంచాయతీరాజ్‌ చట్టం 2018 సెక్షన్‌ 113(8)ను అనుసరించి అనుమతిలేని లేఔట్లలోని భూమి లేదా భవనంలో కొంతభాగాన్ని రిజిస్ట్రేషన్‌ చేయరు. అయితే, గ్రామకంఠంలోని స్థలాల్లో ఉన్న భవనాలు, నిర్మాణాలకు ఈ నిబంధన వర్తించదు.  
 • అనధికార, అక్రమ లేఔట్ల నిరోధక చట్టం-2015 ప్రకారం అనధికార లేఔట్లు, ప్లాట్లను రెగ్యులరైజ్‌ చేసుకోవాలి. అలా చేసుకోనివాటిని రిజిస్ట్రేషన్‌శాఖ నిషేధిత ఆస్తులలిస్టులో పెడుతుంది.
 • కామన్‌ బిల్డింగ్‌ రూల్స్‌ను అనుసరించి అనుమతిపొందిన ప్లాన్‌ ప్రకారం నిర్మించిన భవనాలను మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయాలి.

రిజిస్ట్రేషన్‌ చేసేముందు పరిగణనలోకి తీసుకునేవి..

 • అన్ని అనుమతులున్న ప్లాట్లు, అధికారిక లేఔట్లు, గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌ కింద రెగ్యులరైజ్‌ చేసిన ప్లాట్లను మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయాలి. గతంలో అదేప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ అయి ఉన్నా అది అనధికారిక లేఔట్‌లో ఉంటే కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేయొద్దు.   
 • గృహాలు, భవనాలు, అపార్ట్‌మెంట్లు ఏవైనా సరే అధికారికంగా అనుమతించిన ప్లాన్‌ ప్రకారం ఉంటేనే రిజిస్ట్రేషన్‌ చేయాలి. బీఆర్‌ఎస్‌ (బిల్డింగ్‌ రిజిస్ట్రేషన్‌ స్కీమ్‌), బీపీఎస్‌ (బిల్డింగ్‌ పినలైజేషన్‌ స్కీమ్‌) కింద ప్రొసీడింగ్స్‌ తీసుకున్న నిర్మాణాలను సైతం రిజిస్ట్రేషన్‌ చేయొచ్చు.  
 • రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చేవారిని అప్రూవ్డ్‌ లేఔట్‌, బిల్డింగ్‌ప్లాన్‌ పత్రాలను సమర్పించమని అడగడంతోపాటు, పరిశీలించే అధికారం రిజిస్ట్రేషన్‌ అధికారులకు ఉంటుంది.


 • అనుమతిపొందిన ప్లాన్‌ ప్రకారం నిర్మించిన భవనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు 
 • నిర్దేశిత నిర్మాణ అనుమతిలేని భవనాలు, భవనంలోని ఒకభాగం (ప్లాట్‌), ఇతర  నిర్మాణాన్ని రిజిస్ట్రేషన్‌ చేయరాదు. 
 • మున్సిపాలిటీ అనుమతిచ్చిన డిజైన్‌ను అనుసరించే నిర్మాణం ఉండాలి. లేకపోతే రిజిస్ట్రేషన్‌ చేయరు. 
 • అనుమతిలేని లేఅవుట్లలోని భూమిని లేదా  భవనంలో కొంత భాగాన్ని సొంతదారు లేదా డెవలపర్‌ విక్రయిస్తే రిజిస్ట్రేషన్‌ చేయరు.
 • అనధికార లేఅవుట్లు, ప్లాట్‌లను రెగ్యులరైజ్‌ చేసుకోకపోతే నిషేధిత ఆస్తుల జాబితాలోకి
 • బీఆర్‌ఎస్‌, బీపీఎస్‌ కింద ప్రొసీడింగ్స్‌ తీసుకున్న నిర్మాణాలకు  రిజిస్ట్రేషన్లు 


logo