మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 03:00:07

దళితబహుజన ఉద్యమకారుడు ‘ఉసా’ కన్నుమూత

దళితబహుజన ఉద్యమకారుడు ‘ఉసా’ కన్నుమూత

  • కరోనాకు చికిత్సపొందుతూ తుదిశ్వాస
  • శోకసంద్రంలో అభిమానులు, బంధుమిత్రులు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/కాచిగూడ: ప్రముఖ దళిత బహుజన ఉద్యమకారుడు, సామాజిక తత్వవేత్త ఉసాగా పేరొందిన ఉల్లెంగుల సాంబశివరావు(79) కొవిడ్‌ బారినపడి మృతిచెందారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట సలీంనగర్‌ ప్రాంతానికి చెందిన సాంబశివరావుకు వారం క్రితం జ్వరం రావడంతో ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలుచేయగా పాజిటివ్‌ వచ్చింది. ఈ నెల 24న అర్ధరాత్రి బర్కత్‌పురలోని బ్రిస్టల్‌కోన్‌ దవాఖానలో చేర్పించారు. అక్కడ చికిత్సపొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. సాంబశివరావు భార్య మూడేండ్ల క్రితం చనిపోయారు. వీరికి కుమార్తె ఉన్నారు. సాంబశివరావు అంత్యక్రియలు కొవిడ్‌ నిబంధనల మేరకు అంబర్‌పేట విద్యుత్‌శ్మశానవాటికలో నిర్వహించారు. సాంబశివరావు చిత్రపటానికి అభిమానులు, కార్యకర్తలు, బంధుమిత్రులు ఘనంగా నివాళులర్పించారు. 

వినోద్‌, అల్లం నారాయణ సంతాపం 

ఉద్యమాల ఉపాధ్యాయుడు సాంబశివరావు మృతి పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ సంతాపం తెలిపారు. ఆయన మృతి తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సాంబశివరావు అకాల మరణం దళిత బహుజనులకు తీరనిలోటని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ పేర్కొన్నారు. ఆయన జీవితాంతం ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడారని కొనియాడారు. సామాజిక అణచివేత, రాజకీయ అంశాలపై సాంబశివరావు రాసిన వ్యాసాలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.


logo