బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 17:38:51

సీఎం కేసీఆర్ త‌న పాల‌న ద‌క్ష‌త‌తో ప్ర‌జ‌ల‌ను మెప్పిస్తాడు!

సీఎం కేసీఆర్ త‌న పాల‌న ద‌క్ష‌త‌తో ప్ర‌జ‌ల‌ను మెప్పిస్తాడు!

హైద‌రాబాద్:  శ్రీ శార్వ‌రి  నామ సంవత్సరంలో  పుష్కలంగా వర్షాలు కురుస్తాయని,  పంటలు బాగా పండుతాయని బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి తెలిపారు.  ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని బొగ్గుల‌కుంట దేవాదాయ శాఖ ప్ర‌ధాన కార్యాల‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ‌ ఉగాది వేడుకలు నిరాడంబ‌రంగా జరిగాయి. ఈ వేడుకల్లో  దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేవీ. ర‌మ‌ణాచారి పాల్గొన్నారు.  శ్రీ శార్వ‌రి నామ సంవ‌త్స‌ర పంచాంగాన్ని ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి,  ర‌మ‌ణాచారి ఆవిష్క‌రించారు. వేడుకల్లో బాచంపల్లి సంతోష్‌కుమార్ శర్మ పంచాగ ప‌ఠ‌నం చేశారు. 

తెలంగాణ  రాష్ట్ర ఆవిర్భావం నుంచి  అభివృద్ది ధ్యేయంగా రాష్ట్ర స‌ర్వ‌తోముఖాభివృద్దికి నిరాంత‌రాయంగా శ్ర‌మిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్... శ్రీ శార్వ‌రి నామ సంవ‌త్స‌రంలో కూడా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తారని బాచంప‌ల్లి పేర్కొన్నారు.  రాజు బుధుడు కావ‌డం చేత సీఎం కేసీఆర్ త‌న పరిపాల‌న ద‌క్ష‌త‌తో ప్ర‌జ‌ల‌ను మెప్పిస్తాడని తెలిపారు.  సీఎంది కర్కాట‌క రాశి.. శ్రీ శార్వ‌రి నామ సంవ‌త్స‌రం  వ్య‌క్తిగతంగా  ఆయ‌న‌కు శుభ‌ప్ర‌దంగా ఉంటుందని చెప్పారు.  సీఎం కేసీఆర్  ఆయ‌న అనుకున్న కార్య‌క్ర‌మాల‌న్నింటినీ దిగ్విజ‌యంగా పూర్తి చేస్తారని వెల్ల‌డించారు.  

రాష్ట్ర ఆదాయం, ఆర్థిక ప‌రిస్థితి  బాగుంటుంది..

రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప్ర‌ణాళికబ‌ద్ధంగా ముందుకు వెళ్లే ప్ర‌య‌త్నాలు చేస్తుందని. అయితే ఆర్థిక మాంద్య ప‌రిస్థితుల వ‌ల్ల  కొన్ని ఒడిదొడుకులు ఎదుర‌య్యే  అవ‌కాశం కూడా ఉందన్నారు.  ఈ పరిస్థితుల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు కూడా ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెల‌గాల్సి ఉంటుందని సూచించారు.  ప్ర‌పంచ ఆర్థిక ప‌రిస్థితులు దేశం, రాష్ట్రం మీద ప‌డినప్ప‌టికీ.. ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌తో  దాన్ని అధిగ‌మించడం వ‌ల్ల రానున్న రోజుల్లో ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండ‌దని వెల్ల‌డించారు. రాష్ట్ర ఆదాయం, ఆర్థిక ప‌రిస్థితి బాగుంటుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తై  తెలంగాణ అంతటా జల కళ ఉట్టిపడబోతోందన్నారు. దాని ఫ‌లితాలు రాష్ట్ర రైతాంగానికి అందుతాయని చెప్పారు. 

కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు  రెండు కూడా అన్న‌ద‌మ్ముల్లాగా  క‌లిసి ప‌ని చేస్తూ..  తెలంగాణ‌లో ప్ర‌జ‌ల‌కు సుపారిపాల‌న‌ను అందిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల స‌ర్వాదాయం 105, స‌ర్వ వ్య‌యం 96 అంటే శేషం 9  రావ‌డం శుభ‌సూచ‌కమ‌న్నారు. ఆర్థిక నిపుణుల అంచ‌నాల‌ను పటాపంచ‌లు చేస్తూ... దేశాభివృద్ది, రాష్ట్రాభివృద్ది  బ్ర‌హ్మండంగా జ‌రుగుతుందని చెప్పారు.


రియ‌ల్ ఏస్టేట్ జోరు..

రాష్ట్రంలో ధార్మిక కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతాయన్నారు. క్రీడ‌లు, మిల‌ట‌రీ రంగాలు అంతంత మాత్ర‌మేన‌ని,  విద్యా రంగంలో సాధారణ ఫ‌లితాలే క‌నిపిస్తున్నాయన్నారు. విద్యా రంగంలో చాలా సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టే అవ‌కాశం ఉందని తెలిపారు.  స్త్రీ, శిశు సంక్షేమంతో  పాటు ఇత‌ర సంక్షేమ కార్య‌క్ర‌మాలు దిగ్విజ‌యంగా కొన‌సాగుతాయని పేర్కొన్నారు.  రియ‌ల్ ఎస్టేట్ రంగం కూడా అంతంత మాత్రంగానే ఉన్న‌ప్ప‌టికీ... తెలంగాణ‌లో రియ‌ల్ ఎస్టేట్ రంగం కొత్త పుంత‌లు తొక్కే అవ‌కాశం ఉండ‌టంతో...రియ‌ల్ ఏస్టేట్ జోరు కొన‌సాగే ఆస్కారం ఉంద‌న్నారు. శాంతిభ‌ద్ర‌త‌లు చాలా బాగుంటాయని, పోలీసులు స‌మ‌ర్ధ‌వంతంగా ప‌ని చేస్తార‌ని చెప్పారు. 

దేశంలో కొన్ని విప‌త్తులు సంభ‌వించే అస్కారం ఉందన్నారు. 2020 జూన్, జూలై నెల‌ల్లో కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు సంభ‌వించే అవ‌కాశం ఉందని తెలిపారు. ఆగ‌స్టు,  సెప్టెంబర్‌ మాసాల్లో అధిక వ‌ర్షాలు కురిసి వ‌ర‌ద‌లు సంభ‌వించే అవ‌కాశం ఉందని పేర్కొన్నారు. 

బ్యాంకింగ్ రంగంలో ఒడిదొడుకులు

దేశ బ్యాంకింగ్ రంగంలో ఒడిదొడుకులు ఎదుర‌వుతాయ‌ని, బ్యాంకుల ప‌ట్ల ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పోతుంద‌ని  సంతోష్ శాస్త్రి వివ‌రించారు. ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌లిగేలా బ్యాంకింగ్ సంస్థ‌లు మ‌సులుకోవాల‌ని సూచించారు.  ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంది.  దేశంలో పెట్రోల్ డీజీల్ ధ‌ర‌లు తార‌స్థాయికి చేరుకుంటాయి. ఆర్థిక మోసాలు పెరిగే అవ‌కాశం ఉంది.  సైబ‌ర్ క్రైమ్స్  ప‌ట్ల ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలి. 

శ్రీ శార్వ‌రి నామ సంవ‌త్స‌రం కాల స‌ర్ప యోగంతో ప్రారంభం కావ‌డం వ‌ల్ల కొన్ని విప‌త్తులు సంభ‌విస్తున్నాయన్నారు. మే 22 వ‌ర‌కు ప్ర‌జ‌లు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలని కోరారు.  ప్ర‌జ‌లు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెల‌గాలి, స్వీయ నియంత్ర‌ణ‌లో ఉండాలన్నారు.  చండీయాగాలు, చండీ హోమాలు, పారాణాయాలు చేయ‌డం వ‌ల్ల క‌రోన  మ‌హామ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డుతామ‌ని చెప్పారు. సుఖ‌శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాల‌ని బాచంప‌ల్లి సంతోష్ శాస్త్రి అకాంక్షిచారు.  ఈ కార్య‌క్ర‌మంలో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్,  అద‌న‌పు క‌మిష‌న‌ర్ శ్రీనివాస‌రావు, వేద పండితులు, త‌దిత‌రులు పాల్గొన్నారు. 


logo
>>>>>>