బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 01:08:38

పెద్దలసభకు కేకే, కేఆర్‌

పెద్దలసభకు కేకే, కేఆర్‌
  • టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
  • పేర్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. నేడు నామినేషన్లు దాఖలు
  • ఏకగ్రీవం కానున్న రెండు రాజ్యసభ స్థానాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని రెండు రాజ్యసభస్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ప్రకటించా రు. టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీనేత కే కేశవరావును మరోసారి అవకాశం ఇవ్వగా.. ఉమ్మడి ఏపీ మాజీస్పీకర్‌ కేఆర్‌ సురేశ్‌రెడ్డిని రెండో అభ్యర్థిగా ఎంపికచేశారు. వీరిద్దరూ శుక్రవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. తమను అభ్యర్థులుగా ఖరారుచేసిన సీఎం కేసీఆర్‌కు కేశవరావు, సురేశ్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అభ్యర్థులిద్దరినీ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీ రామారావు, మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్‌, పార్టీ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు అభినందించారు. 


అనుభవం, ప్రజాసేవపట్ల వారికున్న దృక్పథా న్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్‌ ఈసారి అభ్యర్థులను ఎంపికచేసినట్టు తెలుస్తున్నది. సామాజిక కోణంలోనూ సమతూకాన్ని పాటిస్తూ ఒక బీసీని, ఒక ఓసీ అభ్యర్థిని ఎంపికచేశారు. కేశవరావు రాజకీయా ల్లో తలపండినవారు కాగా, సురేశ్‌రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలకు తగిన బలం లేకపోవడంతో అవి తమ అభ్యర్థిని పోటీకి పెట్టే అవకాశాలు లేవు. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ నెల 16న నామినేషన్లు పరిశీలించనున్నారు. 18న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అదేరోజు ఇరువురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశాలున్నాయి.


రాజ్యసభలో గులాబీ దండు

రాజ్యసభలో రాష్ట్రం నుంచి మొత్తం ఏడుగురు సభ్యులు టీఆర్‌ఎస్‌కు చెందినవారే ప్రాతినిధ్యం వహించనున్నారు. గత నాలు గు దశాబ్దాల్లో ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఒకే పార్టీకి చెందిన సభ్యులు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించటం ఇదే మొదటిసారి. టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుల్లో నలుగురు బీసీలే కావడం విశేషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2016, 2018లోజరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అన్ని స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. తాజాగా ఎన్నికయ్యే ఇద్దరు సభ్యులతో పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ బలం 16కు చేరుకోనుంది. లోక్‌సభలో టీఆర్‌ఎస్‌కు 9మంది సభ్యులున్న సంగతి తెలిసిందే.


తలపండిన నేత కేశవరావు

డాక్టర్‌ కంచర్ల కేశవరావు 1939 జూన్‌ 4న జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1972 నుంచి 1979 వరకు రాష్ట్ర కనీసవేతనాల బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. 1979 నుంచి 1985 వరకు శాసనమండలి సభ్యుడిగా ఉన్న కేకే ఏడాదిపాటు డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు. 1992 నుంచి 1994 వరకు రాజీవ్‌గాంధీ టెక్నాలజీ మిషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ  సభ్యుడిగా, ఉమ్మడి ఏపీపీసీసీ అధ్యక్షుడిగా, బెంగాల్‌ తదితర రాష్ట్రాలకు కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జిగా వ్యవహరించారు. మొదటిసారి 2006లో కాంగ్రెస్‌ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. 2013లో కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014 ఏప్రిల్‌లో టీఆర్‌ఎస్‌ పక్షానరాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం పరిశ్రమలపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ స్థాయీసంఘం చైర్మన్‌గా ఉన్నారు. టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌గా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 


అనుభవశాలి సురేశ్‌రెడ్డి 

నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కేతిరెడ్డి సురేశ్‌రెడ్డి 1959 మే 25న జన్మించారు. కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లి గ్రామానికి చెందిన గోవిందరెడ్డి, విమలదేవి ఆయన తల్లిదండ్రులు. భార్య పద్మజారెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త. ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. 1984లో రాజకీయ ప్రవేశంచేసిన ఆయన 1989 నుంచి వరుసగా 1994, 1999, 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1990లో లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా, 1997లో పీఏసీ చైర్మన్‌గా పనిచేశారు. 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి ఏపీ స్పీకర్‌గా వ్యవహరించారు. 2009, 2014లో ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2018 సెప్టెంబర్‌ 7న టీఆర్‌ఎస్‌లో చేరారు. 


logo
>>>>>>