మంగళవారం 19 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 02:11:02

జయ జయహే ప్రియ భారతి

జయ జయహే ప్రియ భారతి

  • ఓ గిరిపుత్రిక శిఖరారోహణ
  • ఆటంకాలను ఎదురొడ్డి.. అనుకొన్నది సాధించి
  • కరెంటు స్తంభమెక్కిన తెలంగాణ ఆడబిడ్డలు

కరెంటు స్తంభం ఎక్కడం మగవాళ్లకే చాలా కష్టమైన పని. ఏ కొంచెం తడబడ్డా.. అంతేసంగతులు. కానీ.. ఆడపిల్లలు కరెంట్‌ స్తంభాలనెక్కితే.. అది అద్భుతమే. తెలంగాణ ఆడబిడ్డలు ఈ అద్భుతాన్ని సాధించారు. ఇంతకాలం విద్యుత్తు శాఖలో లైన్‌మెన్‌లు మాత్రమే ఉంటారనుకొన్నచోట.. లైన్‌ ఉమెన్లకూ ఆస్కారమున్నదని నిరూపించారు. మగవాళ్లకు తామేమీ తీసిపోమని అంటున్నారు. పోల్‌ ైక్లెంబింగ్‌ పరీక్షలో అలవోకగా నెగ్గిన ఇద్దరు మహిళలు భారతి, శిరీష దేశంలోనే తొలి లైన్‌ ఉమెన్‌గా రికార్డు సృష్టించారు. మహిళలకు అవకాశమివ్వడానికి అధికారులు సంకోచిస్తుంటే.. హైకోర్టులో న్యాయపోరాటం చేసి మరీ తమ లక్ష్యాన్ని చేరుకొన్నారు.  

తొర్రూరు, జనవరి 5: పురుషులకే సాధ్యమనుకొన్న విద్యుత్‌ లైన్‌మెన్‌ ఉద్యోగానికి తామూ అర్హులమేనని మహిళలు నిరూపించుకొన్నారు. మగవాళ్లకే కష్టసాధ్యమైన స్తంభం ఎక్కుడు(పోల్‌ ైక్లెంబింగ్‌) పరీక్షలో అలవోకగా నెగ్గి దేశంలోనే తొలి జూనియర్‌ లైన్‌విమెన్‌గా ఎంపికయ్యారు ఇద్దరు తెలంగాణ ఆడబిడ్డలు. ఆడపిల్లలు ఈ పని చేయలేరన్న అధికారులనే అబ్బురపరుస్తూ స్తంభాలెక్కి చీకట్లను చిదిమేస్తానంటున్నారు మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం భోజ్యాతండా పరిధిలోని దేశ్యాతండాకు చెందిన వాంకుడోతు భారతి, సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం గణేశ్‌పల్లికి చెందిన బబ్బూరి శిరీష.   

వ్యవసాయ కుటుంబం నుంచి 

మహబూబాబాద్‌ జిల్లా దేశ్యాతండాకు చెందిన భారతిది వ్యవసాయ కుటుంబం. 2011లో దేశ్యాతండాకు చెందిన మోహన్‌సింగ్‌తో వివాహమైన తర్వాత భార్యాభర్తలిద్దరూ పనిచేస్తూనే చదువును కొనసాగించారు. మోహన్‌సింగ్‌ ఎమ్మెస్సీ, ఎంఈడీ, ఎంసీఏ పూర్తిచేయడంతోపాటు భార్యను డిగ్రీ (బీకాం) చదివించాడు. మహిళల శాతం తక్కువగా ఉన్న విద్యుత్తు రంగంలో ఉద్యోగ అవకాశాలు తొందరగా వస్తాయని భావించిన మోహన్‌సింగ్‌.. 2016లో భారతిని ఐటీఐ ఎలక్ట్రికల్‌ చదివించాడు. అనుకున్నట్టుగానే ఐటీఐ పూర్తి కాగానే 2017లో ట్రాన్స్‌కో ద్వారా జూనియర్‌ లైన్‌మెన్ల భర్తీ కోసం నోటిఫికేషన్‌ వచ్చింది. మొదటిసారి ఈ నోటిఫికేషన్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించడంతో భారతి పరీక్ష రాసింది. కానీ కోర్టు కేసులతో ఫలితాల విడుదల పెండింగ్‌లో పడింది. 

మరోసారి నిరాశే.. 

2019లో 2500 పోస్టుల భర్తీకి సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్పీడీసీఎల్‌) జారీ చేసిన మరో నోటిఫికేషన్‌ భారతికి నిరాశ కలిగించింది. ఈ నోటిఫికేషన్‌లో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్‌ కానీ, అవకాశం కానీ ఇవ్వలేదు. దీంతో 2017 ట్రాన్స్‌కో నోటిఫికేషన్‌ను పరిగణనలోకి తీసుకుని 2019 నోటిఫికేషన్‌లో మహిళలకు అవకాశం ఇవ్వాలని భారతి హైకోర్టును ఆశ్రయించారు. మహిళా అభ్యర్థినులకు మాన్యువల్‌గా దరఖాస్తులు అందజేసే అవకాశాన్ని కోర్టు కల్పించడంతో పరీక్ష రాశారు. కాగా, అధికారులు 2020 ఆగస్టులో కేవలం పురుష అభ్యర్థులకు సంబంధించిన ఫలితాలను మాత్రమే వెల్లడించి వారికి పోల్‌ ైక్లెంబింగ్‌ పరీక్షను నిర్వహించారు. ఫలితాల కోసం నిరీక్షించిన 34 మంది అమ్మాయిలు ఎవరికివారు విడివిడిగా సెప్టెంబర్‌ 2020లో కోర్టును ఆశ్రయించారు. నవంబర్‌ 2020లో ఎనిమిది మంది అభ్యర్థినులు ఒకే పిటిషన్‌ ద్వారా కోర్టుకు వెళ్లారు. వీరి ఫలితాలు వెల్లడించాలని హైకోర్టు ఆదేశాలివ్వడంతో భారతితోపాటు సిద్దిపేట జిల్లాకు బీ శిరీష ఉత్తీర్ణులయ్యారు. 

లింగ వివక్షపై న్యాయ పోరాటం

జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీలో అధికారులు లింగ వివక్ష చూపుతున్నారని, రాత పరీక్షలో ఉత్తీర్ణత పొందిన మహిళా అభ్యర్థులకు పోల్‌ ైక్లెంబింగ్‌ పరీక్ష నిర్వహించేందుకు నిరాకరిస్తున్నారని భారతి హైకోర్టును ఆశ్రయించింది. దీంతో అర్హులైన మహిళా అభ్యర్థులకు నెల రోజుల్లో పోల్‌ ైక్లెంబింగ్‌ పరీక్ష నిర్వహించి ఫలితాలను సింగిల్‌ జడ్జి ముందు పెట్టాలని అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌చౌహాన్‌, జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం డిసెంబర్‌ 2020లో ఎస్పీడీసీఎల్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పు భారతి కలలకు జీవం పోసింది. హైకోర్టు ఆదేశాలతో అధికారులు హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని సీపీటీఐ కేంద్రంలో భారతికి పోల్‌ ైక్లెంబింగ్‌ పరీక్షను నిర్వహించారు. ఎనిమిది మీటర్ల ఎత్తు ఉండే విద్యుత్‌ స్తంభాన్ని తాడు వంటి వస్తువుల సాయం లేకుండానే నిమిషంలో ఎక్కి కిందికి దిగి లక్ష్యాన్ని చేరుకున్నది. 

నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తా 

ఆడవాళ్లు కరెంట్‌ స్తంభాలు ఎక్కి మరమ్మతులు చేయగలుగుతారా అన్న వాదనకు భిన్నంగా జూనియర్‌ లైన్‌ విమెన్‌గా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తా. ఆడవాళ్లు ఏ రంగంలో తక్కువ కాదని నిరూపిస్తాను. నా భర్త మోహన్‌సింగ్‌ ఇచ్చిన ధైర్యం, చిన్నప్పటి నుంచి తండాలో రోజు చేసిన కష్టం గుండె నిబ్బరాన్ని పెంచింది. చిన్నతనంనుంచి సాగు పనులు చేసిన కష్టం ముందు లైన్‌విమెన్‌గా చేయబోయే కష్టం పెద్దదేమీ కాదు. 

- వాంకుడోతు భారతి

శభాష్‌ శిరీష..

ఆటంకాలను ఎదురొడ్డి అనుకున్న లక్ష్యం సాధించింది సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం చేబర్తి గ్రామానికి చెందిన బబ్బూరి శిరీష.  లైన్‌మెన్‌ ఉద్యోగ అర్హత పరీక్షలో పాసై, నియామకం కోసం వేచి చూస్తున్నది. శిరీష తల్లిదండ్రులు వెంకటేశ్‌-రాధిక హైదరబాద్‌లోని ఒక కంపెనీలో పని చేస్తున్నారు. శిరీష విద్యాభ్యాసం అంతా మేడ్చల్‌ బాలికల ప్రభుత్వ పాఠశాలలో కొనసాగింది. 2014-15లో పదో తరగతి పాసైంది. టెన్త్‌ తర్వాత ఆమె మామయ్య సలహాతో ఐటీఐని ఎంచుకున్నది. 2015-17లో ఎలక్ట్రికల్‌లో ఐటీఐ పూర్తి చేస్తున్నది. ప్రస్తుతం శిరీష అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేస్తున్నది. హైకోర్టు అనుమతితో శిరీష జూనియర్‌ లైన్‌మన్‌ పరీక్షకు దరఖాస్తు చేసి గతేడాది డిసెంబర్‌ 15న పరీక్షకు హాజరైంది. ఫలితాల్లోనూ అధికారులు జాప్యం చేయడంతో మరోసారి కోర్టుకు వెళ్లింది. ఎట్టకేలకు కోర్టు ఆదేశాలతో శిరీషకు హైదరాబాద్‌ సీపీటీఐలో పోల్‌ైక్లెంబింగ్‌ పరీక్ష నిర్వహించారు. ఎలాంటి సాయం లేకుండా చకచకా పోల్‌ ైక్లెంబింగ్‌ పరీక్షను శిరీష విజయవంతంగా పూర్తిచేసింది. అన్ని పరీక్షల్లో నెగ్గిన శిరీష జూనియర్‌ లైన్‌ విమెన్‌ ఉద్యోగ నియామకం కోసం ఎదురుచూస్తున్నది.