మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 15, 2020 , 00:39:45

మల్లన్న నుంచే మంజీరకు జీవం

మల్లన్న నుంచే మంజీరకు జీవం
  • డిజైన్‌ ప్రకారమే సింగూరుకు కాళేశ్వరం జలాలు
  • హల్దీవాగు ద్వారా నిజాంసాగర్‌కు తరలింపు
  • ముమ్మరంగా ప్యాకేజీ 17-19 పనులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మల్లన్నసాగర్‌ జలాలతోనే మంజీర పరిధిలోని రెండు ప్రాజెక్టులకు పునర్జీవం కల్పించనున్నా రు. డిజైన్‌ప్రకారం.. మంజీరపై ఉన్న సింగూరు, నిజాంసాగర్‌ ప్రాజెక్టులకు మల్లన్నసాగర్‌ జలాశయం నుంచి కాళేశ్వర జలాలు అందించాలని అలైన్‌మెంట్‌ రూపొందించారు. ఈ అలైన్‌మెంట్‌లో కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కొండపోచమ్మసాగర్‌ ద్వారా అందించాలనే కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనిపై కూడా అధ్యయనం చేయించిన ప్రభుత్వం.. పాత డిజైన్‌ ప్రకారమే సింగూరు, నిజాంసాగర్‌కు గోదావరిజలాలను తరలించాలని నిర్ణయించింది. శ్రీరాంసాగర్‌కు పునర్జీవం కల్పించిన విధంగానే.. ఎగువ నుంచి వరదలేక తరుచూ వెలవెలబోతు న్న సింగూరు, నిజాంసాగర్‌ జలాశయాలకు పునర్జీవం తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ రీడిజైనింగ్‌ రూపొందించారు. 


ఎస్సారార్‌ నుంచి అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌ ద్వారా మల్లన్నసాగర్‌కు చేరిన కాళేశ్వరజలాలు మూడుమార్గాల్లో బయటకు తరలనున్నాయి. ఒకవైపు కొండపోచమ్మసాగర్‌.. అదేమార్గంలో మరోవైపు గంధమల్ల రిజర్వాయర్‌కు తరలేలా కాల్వను నిర్మించారు.  మల్లన్నసాగర్‌ నుంచి 158.418 కిలోమీటర్ల మేర జలాలను తరలించి సింగూరులో పోయనున్నారు. ఇందులో 136.2 కిలోమీటర్ల పొడవునా గ్రావిటీకాల్వ ఉండగా.. 22.218 కిలోమీటర్ల సొరంగ మార్గం నిర్మాణం ఉన్నది. సింగూరు సమీపం వరకు గ్రావిటీ ద్వారా చేరుకున్న జలాలను సుమారు 32 మీటర్ల మేర ఎత్తి జలాశయంలో పోయాల్సి ఉంటుంది. ఈ అలైన్‌మెంట్‌లో భాగంగానే నిజాంసాగర్‌కు కూడా జలాలను తరలించేలా డిజైన్‌ రూపొందించారు. సింగూరు వైపుకు తరలించే క్రమంలో మధ్యలోని హల్దీవాగులో జలాలను పోయడంతో అవి సహజసిద్ధమైన మార్గంలో నేరుగా నిజాంసాగర్‌ చేరుకుంటాయి.   


సాంకేతిక ఇబ్బందుల నేపథ్యంలో..

మల్లన్నసాగర్‌ నుంచి గ్రావిటీకాల్వ తర్వా త నిర్మించాల్సిన సొరంగమార్గంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురుకావచ్చనే అభిప్రాయాలు గతంలో తెరపైకి వచ్చాయి. తొమ్మిది మీటర్ల డయాతో నిర్మిస్తున్న ఈ సొరంగమార్గంలో ఐదారు కిలోమీటర్ల మేర మెత్తటి మట్టిపొర వస్తుందనేది ప్రాథమిక సర్వే నివేదించింది. దీంతో సింగూరుకు కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి జలాలను తరలిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన వచ్చింది. అయితే  ఇది వ్యయప్రయాసలతో కూడుకున్నదిగా ప్రభుత్వ అధ్యయనంలో తేలినట్టు సమాచారం. మల్లన్నసాగర్‌ నుంచి కొండపోచమ్మకు జలాలను 105 మీటర్ల మేర లిఫ్ట్‌ చేయాల్సి ఉంటుంది. వాటిని అక్కడి నుంచి సింగూరు వైపునకు తరలించాలంటే సుదీర్ఘ కాల్వల నిర్మాణంతోపాటు, ఈ అలైన్‌మెంట్‌లో పారిశ్రామికప్రాంతాలు, గీతం యూనివర్సిటీ, పరిశ్రమలు తదితర వాణిజ్య, నివాసప్రాంతాలు ఉన్న ట్టు తేలింది. దీంతో సమగ్ర పరిశీలన చేసిన ప్రభుత్వం.. మల్లన్నసాగర్‌ నుంచి తరలింపులో వచ్చే సాంకేతిక సవాల్‌ను నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రాక్‌ మెకానిజం (ఎన్‌ఐఆర్‌ఎం) సహకారంతో అధిగమించవచ్చనే నిర్ణయానికి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు పాత అలైన్‌మెంట్‌ ప్రకారం చేపడుతున్న ప్యాకేజీ- 17, 18, 19 పనుల్లో వేగాన్ని పెంచారు.


logo
>>>>>>