బుధవారం 20 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 01:54:46

ప్రతి విద్యార్థికీ రెండు జతల యూనిఫాం

ప్రతి విద్యార్థికీ రెండు జతల యూనిఫాం

  • ఆరోగ్య పరీక్షలకు హాస్టల్‌కో ఏఎన్‌ఎం: సత్యవతి

హైదరాబాద్‌, జనవరి 12 (నమస్తే తెలంగాణ): వచ్చేనెల ఒకటినాటికి గిరిజన సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో చదివే ప్రతీ విద్యార్థికి రెండు జతల బట్టలు కుట్టించి సిద్ధం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతీ రాథోడ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె గిరిజన సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కావాల్సిన క్లాత్‌ సిద్ధంగా ఉన్నదని, యూనిఫాం కుట్టించేందుకు వంద రూపాయల చొప్పున ధరలు పెంచామని పేర్కొన్నారు. హాస్టళ్లల్లో చిన్న చిన్న మరమ్మతుల కోసం హాస్టల్‌కు రూ. 20వేల చొప్పున కేటాయిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. ప్రతి హాస్టల్‌కు ఒక ఏఎన్‌ఎంను కేటాయిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులకు శానిటైజర్లు, రెండు మాస్క్‌లు, కాస్మొటిక్స్‌, సబ్బులు, షాంపూలు, నూనెలు, పౌడర్లతో కూడిన జీసీసీ కిట్లను అందించాలని సూచించారు. కొత్తగా ఏర్పాటైన గురుకులాల్లో కాంట్రాక్టర్లే భోజనాన్ని అందిస్తున్న నేపథ్యంలో వంట సరిగా చేసేందుకు కావలసిన సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్‌, అదనపు సంచాలకులు సర్వేశ్వర్‌రెడ్డి, గురుకులాల ఉప కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తదిరులు పాల్గొన్నారు. logo