మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 02:15:40

ప్రాణంతీసిన అతివేగం

ప్రాణంతీసిన అతివేగం

  • సంగారెడ్డి జిల్లాలో బైక్‌ అదుపుతప్పి ఇద్దరు మృతి
  • అక్క పెండ్లి రోజే తమ్ముడి దుర్మరణం
  • ఖమ్మం జిల్లాలో తండ్రీకూతురికి తీవ్రగాయాలు 

కోహీర్‌/ఏన్కూరు: అతివేగం రెండు కుటుంబాల్లో విషాదంనింపింది. అక్క పెండ్లి రోజే ఓ తమ్ముడు దుర్మరణం చెందగా, అతని వెంట ఉన్న  బంధువుసైతం మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లోని బాహేర్‌వాడి కాలనీకి చెందిన సాయితేజ(23) అక్క శృతి వివాహం ఆదివారం ఉదయం జరిగింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో తన బం ధువు దత్తాత్రి(30)తో కలిసి పోతిరెడ్డిపల్లికి బైక్‌పై వెళ్తుండగా బ్రిడ్జి సమీపంలో బైక్‌ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. సోమవారం ఉదయం నుం చి వీరి ఆచూకీ కోసం గాలించగా రాత్రి ప్రమాద స్థలాన్ని గుర్తించారు. అప్పటికే ఇద్దరు మృతిచెందారు. మరో ఘటనలో ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం హిమామ్‌నగర్‌లో ఆగి ఉన్న బైకును  కారు ఢీకొట్టగా తండ్రీకూతురు తీవ్రంగా గాయపడ్డారు. 

ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన షేక్‌ రిజ్వానా  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. పాఠ్య పుస్తకాలు తెచ్చుకోవడం కోసం తండ్రి నాగుల్‌మీరాతో కలిసి బైక్‌పై బయలుదేరింది. వీరు హిమామ్‌నగర్‌ చేరుకోగానే వర్షం పడింది. దీం తో రోడ్డుపక్కనే ఉన్న ఓ చెట్టు కింద బైక్‌ను ఆపారు. ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి వీరిని ఢీకొట్టగా, తండ్రీకూతురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఖమ్మం నగరంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. logo