ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 02:12:39

‘రెవెన్యూ’పై రెండ్రోజుల చర్చ!

‘రెవెన్యూ’పై రెండ్రోజుల చర్చ!

ఈ నెల 28 వరకు ఉభయ సభలు

నేడు పీవీ శతజయంతిపై చర్చ, భారతరత్న కోసం కేంద్రానికి విజ్ఞప్తి

ఎన్ని రోజులైనా సభ నిర్వహిస్తాం:  సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఈ నెల 28 వరకు జరుగనున్నాయి. మొత్తం 18 పనిదినాలు ఉండనున్నా యి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన రెవెన్యూ కొత్త చట్టంపై రెండురోజులపాటు చర్చ జరిగే అవకాశం ఉన్నది. సోమవారం అసెంబ్లీ సమావేశానంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిరోజు గంటపాటు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అరగంట పాటు జీరోఅవర్‌ చేపడుతారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నందున, బిల్లుపై రెండు రోజుల పాటు చర్చ సాగనున్నది. ఇక, మంగళవారం నాటి ప్రశ్నోత్తరాలను రద్దుచేశారు. ఈ రోజు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శతజయం తి సందర్భంగా చర్చ, భారత రత్న ఇవ్వాలని కేంద్రా న్ని కోరనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులైనా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాలపై క్షుణ్ణంగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున లఘుచర్చకు 16 అంశాలను ప్రతిపాదించామన్నారు. సభలోని సభ్యుల సంఖ్యకు అనుగుణంగా చర్చ సమయాన్ని కేటాయించాలని స్పీకర్‌ కోరినట్టు వెల్లడించారు. ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ సభా నాయకుడు చేసిన సూచనలను తాము అంగీకరిస్తున్నామన్నారు. శాసనసమండలి సమావేశాలను కూడా 18 రోజుల పాటు నిర్వహించనున్నారు. మంగళవారం మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని, శతజయంతి ఉత్సవాలపై చర్చించనున్నారు. శాసనమండలి బీఏసీ సమావేశం చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. 


logo