మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 03:43:33

రాబడికి ఊరట

రాబడికి ఊరట

  • పెరుగుతున్న ఆదాయం. 
  • లాక్‌డౌన్‌ తర్వాత రెట్టింపైన వసూళ్లు
  • ఏప్రిల్‌లో 933 కోట్లు.. ఆగస్టు నాటికి 3,900 కోట్లు

కరోనా కష్టపెట్టింది.. ఎంతోమంది ఉపాధిని దెబ్బతీసింది.. చేతిలో పైసా లేకుండా చేసింది.. లాక్‌డౌన్‌ దెబ్బకు ప్రజలు ఇబ్బందులు పడటంతోపాటు ప్రభుత్వాదాయం రాకుండా పోయింది. రెండు, మూడు నెలల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మెరుగవుతున్నది. ఒక్కో పైసా కూడబెట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతున్నది. అమ్మకాలు, కొనుగోళ్లు ప్రారంభం కావడంతో ఆర్థిక పరిస్థితి సాధారణ స్థాయికి చేరుకుంటున్నది. ఆ ఫలితం మరింత గొప్ప ప్రజా సంక్షేమానికి పాటుపడేలా ఆశ కల్పిస్తున్నది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఆర్థిక కార్యకలాపాలు మొదలై రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి పెరుగుతున్నది. లాక్‌డౌన్‌ కాలంలో ఆదాయం రాకున్నా ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఆదాయం సాధారణ స్థితికి వస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నది. ఏప్రిల్‌లో ఖజానాకు రూ.933 కోట్లు రాగా, ఆగస్టు నాటికి రూ.3,900 కోట్లకు పెరుగడం విశేషం. ఐదునెలల్లో ప్రతినెలా ఆదాయంలో వృద్ధి కనిపిస్తున్నది. మార్చిలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక లావాదేవీలు పాక్షికంగా స్తంభించిపోయాయి. ఫలితంగా ఏప్రిల్‌లో రాష్ట్ర ఖజానాకు అన్ని మార్గాల్లో కలిపి రూ.933 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అన్‌లాక్‌ మొదలయ్యాక జూన్‌లో పరిశ్రమలు తిరిగి తెరుచుకున్నాయి. అమ్మకాలు, కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వ్యాపార, వాణిజ్య లావాదేవీలు క్రమంగా సాధారణ స్థాయికి  చేరుతున్నాయి. దీంతో మే నెలతో పోలిస్తే జూన్‌లో రాబడి రెట్టింపయ్యింది. అప్పటినుంచి క్రమంగా పెరుగుతూనే ఉన్నది.

వచ్చిన ఆదాయం ప్రజలకే

రాష్ట్రప్రభుత్వం ఎన్నడూ ఆదాయ, వ్యయాలను పట్టించుకోలేదు. ప్రజల సంతోషాన్ని మాత్రమే కొలమానంగా చూసింది. అందుకే కరోనా కష్టాల్లోనూ ప్రజలకు ఉచిత రేషన్‌, నగదు సాయం చేసింది. పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలను ఆగకుండా చూసుకున్నది. లాక్‌డౌన్‌ ఉన్న కాలంలో దాదాపు రూ.15వేల కోట్లకుపైగా సంక్షేమ పథకాలకు వెచ్చించింది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచటం, దాన్ని ప్రజలకు పంచటం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొదటి నుంచీ అవలంభిస్తున్న విధానం. జూన్‌లో అన్‌లాక్‌తో రాబడి పెరుగడం మొదలుకాగానే జూలై నుంచి ఉద్యోగులకు 100 శాతం వేతనాలు అమలు చేసింది. ఇటీవలే రూ.7వేల కోట్లకుపైగా రైతుబంధు రూపంలో అన్నదాతల ఖాతాల్లో వేసింది. దాంతో తమది ప్రజా ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నది. 


logo