గురువారం 02 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 02:28:54

కరోనాతో టీవీ 5 జర్నలిస్టు మృతి

కరోనాతో టీవీ 5 జర్నలిస్టు మృతి

  • ఊపిరితిత్తులు, కండరాల సమస్యతో బాధపడ్డ దడిగె మనోజ్‌కుమార్‌ 
  • సీఎం కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ సైదాబాద్‌: కరోనా మహమ్మారితో టీవీ 5 న్యూస్‌చానల్‌ జర్నలిస్టు దడిగె మనోజ్‌కుమార్‌ (33) మృతిచెందారు. గాంధీ దవాఖానలో చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం చనిపోయారు. యువ జర్నలిస్ట్‌ మనోజ్‌కుమార్‌ మృతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్‌ మాదన్నపేటకు చెందిన మనోజ్‌కుమార్‌ కొన్నేండ్లుగా టీవీ 5 న్యూస్‌చానల్‌ క్రైమ్‌ రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. ఎనిమిది నెలల కిందటే సైదాబాద్‌కు చెందిన యువతితో వివాహం కాగా, ప్రస్తుతం ఆమె ఆరునెలల గర్భిణి. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న మనోజ్‌కుమార్‌ చికిత్స కోసం ఫీవర్‌ హాస్పిటల్‌కు వెళ్లారు.

పరీక్షించిన వైద్యులు.. ఊపిరితిత్తుల సమస్యలతోపాటు కరోనా లక్షణాలు కనిపించటంతో మెరుగైన చికిత్స కోసం గురువారం గాంధీ దవాఖానకు తరలించారు. మనోజ్‌కుమార్‌కు కండరాలకు సంబంధించిన వ్యాధి ఉన్నదని, ఇందుకోసం శస్త్రచికిత్స చేసి థైమస్‌ గ్రంథిని తొలగించామని గాంధీ  వైద్యాధికారులు చెప్పారు. ఊపిరితిత్తులతోపాటు కరోనాకు చికిత్సపొందుతుండగా, గుండెపోటు రావడంతో మృతిచెందినట్టు వెల్లడించారు. ఊపిరితిత్తుల సమస్య కూడా ఉండటంతో కరోనా నుంచి కోలుకోవటం కష్టమైందని చెప్పారు. పోస్టుమార్టం అనంతరం సైదాబాద్‌లో మనోజ్‌కుమార్‌ అంత్యక్రియలు నిర్వహించారు. అతడి సోదరుడికి కూడా  పాజిటివ్‌ రావడంతో క్వారంటైన్‌లో ఉన్నాడు.

ప్రముఖుల సంతాపం.. ఆర్థిక సాయం

కరోనాతో జర్నలిస్టు మనోజ్‌కుమార్‌ మృతిచెందడంపై మీడియా అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని భరో సా ఇచ్చారు. జర్నలిస్టులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మనోజ్‌ కుటుంబానికి రాష్ట్ర సమాచార హక్కు చట్టం అమలు కమిషనర్‌ కట్టా శేఖర్‌రెడ్డి రూ.25 వేల ఆర్థికసాయాన్ని ప్రకటించారు. యువ జర్నలిస్టు మరణం కలచివేసిందని చెప్పారు. రచయిత, సినీనటుడు పోసాని కృష్ణమురళి మనోజ్‌ కుటుంబానికి రూ.25 వేల సాయం ప్రకటించారు. సినిమా షూటింగ్‌లు మొదల య్యాక మరో రూ.25 వేలు అందజేస్తానని హామీ ఇచ్చారు. మనోజ్‌ మృతికి జర్నలిస్టు సంఘాలు సంతాపం తెలిపాయి.


logo