ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
కామారెడ్డి గూడ గ్రామంలో ఏర్పాటుకు శ్రీకారం
స్థలానికి రూ.17,36,800 రెవెన్యూ శాఖకు చెల్లింపు
సంక్షేమ శాఖల ద్వారా నిరుద్యోగ అభ్యర్థుల ఎంపిక
ఐదు వారాల పాటు శిక్షణ..
వికారాబాద్, మార్చి 21, (నమస్తే తెలంగాణ) ఆర్టీసీ కార్మికుల సమ్మె, లాక్డౌన్ ప్రభావం.. తదితర కారణాలతో ఆర్టీసీ నష్టాల బాటలో నడుస్తున్నది. ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం బడ్జెట్లో సైతం నిధులు కేటాయింపులు చేసింది. అంతేకాకుండా ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నది. ఇందులో భాగంగానే డ్రైవింగ్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రణాళికలను రూపొందిస్తున్నది. అందులో భాగంగా డ్రైవింగ్ స్కూళ్ల ఏర్పాటుకు ఆర్టీసీ నిర్ణయించింది.
డ్రైవింగ్ స్కూల్‌కు స్థలం కేటాయింపు..
వికారాబాద్ జిల్లా కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కామారెడ్డి గూడ గ్రామంలోని సర్వే నంబర్ 95లో 4.37 ఎకరాలు, సర్వే నంబర్ 99లో 24.13 ఎకరాల్లో ఆర్టీసీ డ్రైవిండ్ స్కూల్ ఏర్పాటుకు స్థలానికి రూ.17,36,800 రెవెన్యూ శాఖకు చెల్లించారు. ఇందులో సర్వే నంబర్ 95లో 4.37 ఎకరాలు మాత్రమే పట్టా భూమి కాగా, మిగతాది అసైన్డ్ భూమి.
వికారాబాద్ డిపో ఆధ్వర్యంలో
వికారాబాద్ డిపో ఆధ్వర్యంలో డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు అనుమతి లభించింది. డిపోలో శిక్షణ ఇవ్వడానికి బస్సు, బోధించడానికి వసతి ఏర్పాటు చేశారు. డిపోలో తరగతులు పూర్తి అయిన వెంటనే కామారెడ్డి గూడలో డ్రైవింగ్ ట్రాక్‌లో శిక్షణ ఇస్తారు. సంక్షేమ శాఖలు నిరుద్యోగ అభ్యర్థులను ఎంపిక చేసి శిక్షణకు పంపనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా శాఖలు కలెక్టర్ పౌసుమి బసు ఆదేశానుసారం ముందుకు అడుగేయనున్నారు.
ఐదు వారాల పాటు శిక్షణ..
ఐదు వారాల పాటు కొనసాగే శిక్షణలో డ్రైవింగ్‌లో పరిణతి సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొదటి ఐదు రోజులు బస్సు కండీషన్, బస్సులోని ఇంజిన్ విడిభాగాలు, పనితీరుపై థియరీతో పాటు ప్రత్యక్ష అవగాహన కల్పించనున్నారు. వివిధ విడిభాగాల్లో తలెత్తే లోపాలు, ఫలితంగా ఏర్పడే సమస్యలు, పరిష్కారాలు, బ్రేక్ ఫెయిలైన సందర్భాల్లో అనుసరించాల్సిన విధానాలపై అవగాహన కల్పిస్తారు. మిగతా 25 రోజుల్లో రోజూ కనీసం అరగంట నుంచి గంట వరకు మొత్తంగా 20 గంటలు ప్రత్యక్షంగా డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో అందించే శిక్షణ ప్రత్యేకంగా ఉంటుంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సంస్థ ధ్రువీకరణ పత్రాలు అందిస్తుంది. దీని ఆధారంగా రవాణా శాఖ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయనుంది.
డబుల్ స్టీరింగ్‌తో..
శిక్షణ అందించే ఇతర వాహనాల్లో ఉన్న విధంగానే ఆర్టీసీ బస్సుల్లోనూ రెండు స్టీరింగ్‌లు ఏర్పాటు చేశారు. శిక్షణ సమయంలో ప్రమాదాలు జరుగకుండా అదనపు స్టీరింగ్ వద్ద క్లచ్, బ్రేక్, ఎక్స్‌లేటర్ ద్వారా శిక్షకుడు బస్సు గమనాన్ని నియంత్రిస్తాడు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఉంటుంది. ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 18 ఏండ్లు నిండిన వారు అర్హులని ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ అధికారులు తెలిపారు.
శాస్త్రీయంగా శిక్షణ ..
డ్రైవర్లకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్నది. పరిశ్రమలకు తగిన సంఖ్యలో డ్రైవర్లు అందుబాటులో లేక పోవడంతో వాహన యజమానులు, రవాణా సంస్థల నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం క్లీనర్లుగా ఎవరూ ఉండడం లేదు. దీంతో డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉంటున్నది. ప్రైవేట్‌గా డ్రైవింగ్ స్కూళ్లు ఉన్నా అవి శాస్త్రీయంగా శిక్షణ ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీకి ఉన్న విశ్వసనీయత దృష్ట్యా డ్రైవింగ్ స్కూల్‌కు ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉన్నది.
రవాణా శాఖ పరిశీలన పూర్తి : బద్రూ నాయక్,
జిల్లా రవాణా శాఖఅధికారి, వికారాబాద్
కామారెడ్డి గూడలో ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్‌కు సంబంధించి రవాణా శాఖ పరిశీలన పూర్తి అయ్యింది. వికారాబాద్ ఎంవీఐ జోసెఫ్‌తో శిక్షణకు అవసరమైన ప్రత్యేక బస్సు, బోధించడానికి గదులు పరిశీలించాం. బస్సు ఫిట్నెస్ కూడా తనిఖీ చేశాం. డ్రైవింగ్ ట్రాక్ పూర్తి చేయాల్సి ఉంది. రవాణా శాఖ నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేయిస్తున్నాం. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం. వారు హెవీ డ్రైవింగ్ లైసెన్స్‌కు స్లాట్ బుక్ చేసుకుంటే లైసెన్స్ కూడా వస్తోంది.
స్కూల్ ఏర్పాటుకు అనుమతి
వికారాబాద్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో కామారెడ్డిగూడలో ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయనున్నాం. ఆర్టీసీ డ్రైవింగ్ స్కూళ్ల్ల ఏర్పాటుకు అనుమతి వచ్చింది. వారం పదిరోజుల్లో ప్రారంభం చేస్తాం. డ్రైవింగ్ స్కూల్‌కు కావాల్సిన బస్సు, తరగతి గదులు, సిబ్బంది సిద్ధం చేశాం. శిక్షణకు సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఇంజినీర్ మెకానికల్‌ను నియమించాం. తరగతులకు రవాణా శాఖ తరఫున సైతం తరగతులు నిర్వహిస్తాం. శిక్షణకు అవసరమైన ప్రత్యేక బస్సు, బోధించటానికి గదులు ఏర్పాటు చేశాం.
-దైవాదీనం, వికారాబాద్, ఆర్టీసీ డిపో మేనేజర్