బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 01:56:13

శ్లాబులు మారడంతోనే బిల్లుల్లో తేడా

శ్లాబులు మారడంతోనే బిల్లుల్లో తేడా

  • విద్యుత్‌ బిల్లులపై అపోహలు వద్దు
  • వేసవి, లాక్‌డౌన్‌ వల్ల అధిక వినియోగం
  • టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: టారిఫ్‌ ప్రకారమే విద్యుత్‌ బిల్లులు జారీచేశామని, ఎవరికీ ఎక్కువ, తక్కువ బిల్లులు ఇచ్చే ఆస్కారంలేదని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సీఎండీ జీ రఘుమారెడ్డి స్పష్టంచేశారు. విద్యుత్‌ బిల్లులపై అపోహలొద్దని, తమకు చెడు ఉద్దేశాలను అపాదించవద్దని ఆయన విజ్ఞప్తిచేశారు. వేసవి కారణంగా సహజంగానే విద్యుత్‌ వినియోగం పెరుగుతుందని, లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు ఇండ్లలోనే ఉండటం వల్ల కూడా వినియోగం పెరిగిందని పేర్కొన్నారు. విద్యుత్‌ వినియోగం పెరిగితే శ్లాబులు మారుతాయని, దీంతో బిల్లులో కూడా తేడాలు వస్తాయని, అంతే తప్ప తాము పెంచలేదని వివరించారు. 

వినియోగదారులనుంచి రూపాయి కూడా అదనంగా తీసుకోబోమని ఆయన స్పష్టంచేశారు. విద్యుత్‌ బిల్లులపై  సందేహాలు, ఫిర్యాదులు వస్తుండటంపై స్పందించిన రఘుమారెడ్డి శనివారం మింట్‌కంపౌండ్‌లోని సంస్థ కార్యాలయంలో వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లాక్‌డౌన్‌ కారణంగా మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో మీటర్‌ రీడింగ్‌ తీసుకోలేదని, ఈ నెలలో రీడింగ్‌ తీసి మూడు నెలలకు విభజించి బిల్లులు జారీచేశామని తెలిపారు. ఇంతకాలం బిల్లులు చెల్లించనివారు, ఒకేసారి వచ్చిన బిల్లును చూసి ఎక్కువ వచ్చినట్లు అపోహపడుతున్నారని వ్యాఖ్యానించారు. 

లాక్‌డౌన్‌తో పెరిగిన వినియోగం

లాక్‌డౌన్‌ వల్ల చాలామంది మూడు నెలలపాటు ఇండ్లకే పరిమితం కావడంతో విద్యుత్‌ వినియోగం గత ఏడాదితో పోలిస్తే 39 శాతం పెరిగిందని రఘుమారెడ్డి చెప్పారు. గత ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే మాసాల్లో సరాసరి 107 యూనిట్లు వాడినవారు ఈ ఏడాది అవే నెలల్లో 146 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారని చెప్పారు. తమ సంస్థ పరిధిలో 95.13 లక్షల మంది వినియోగదారుల్లో 70.97 లక్షలు గృహ వినియోగదారులేనని తెలిపారు. వీరిలో 86 శాతం మంది నెలకు 200 యూనిట్లకన్నా తక్కువ వాడేవారున్నారని చెప్పారు. తన ఇంట్లోనే 15 శాతం విద్యుత్‌ వినియోగం పెరిగిందని సోదాహరణంగా వివరించారు. 

లాక్‌డౌన్‌తో వసూళ్లు సైతం మందగించాయని, మార్చిలో 67శాతం, ఏప్రిల్‌లో 44, మేలో 68శాతం బిల్లులు మాత్రమే వసూలయ్యాయని చెప్పారు. మొత్తంగా 40 శాతం మంది వినియోగదారులు బిల్లుల చెల్లించలేదని తెలిపారు. తమది ప్రభుత్వరంగ సంస్థని, బిల్లుల్లో తేడాలకు ఆస్కారంలేదని అన్నారు. ఒకవేళ ఎక్కువ కడితే ఆ డబ్బులు ఎక్కడికీ పోవని, తర్వాతి బిల్లుల్లో సర్దుబాటు చేస్తామని చెప్పారు. బకాయిలను వాయిదాపద్ధతిలో చెల్లించవచ్చని, అయితే అందుకు 1.04 శాతం వడ్డీని అధికంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈఆర్‌సీ ఆదేశాల మేరకు బిల్లులపై శ్లాబ్‌లు ముద్రించేందుకు చర్యలు తీసుకుంటామని రఘుమారెడ్డి తెలిపారు. మూడు నెలలకు బిల్లులను విభజించిన తీరును రఘుమారెడ్డి ఇలా ఉదహరించారు:

1. 3 నెలలకు 295 యూనిట్లు

ఎల్టీ-1 (ఏ) క్యాటగిరీలో 0-50 యూనిట్ల వరకు రూ.1.45

51-100 యూనిట్ల వరకు రూ.2.60

మొత్తం = రూ. 594.50

2. 3 నెలలకు 1305 యూనిట్లు

నెలకు 439 యూనిట్ల చొప్పున లెక్కింపు

ఎల్టీ-1(బీ)(2) క్యాటగిరీలో 200 యూనిట్ల వరకు రూ.5

201-300 యూనిట్ల వరకు రూ.7.20, 

301-400 యూనిట్ల వరకు రూ.8.50

401నుంచి ఆపై యూనిట్లకు రూ.9.00

మొత్తం బిల్లు = రూ.9,006

3. 3 నెలలకు 590 యూనిట్లు 

నెలకు 197 యూనిట్ల చొప్పున లెక్కింపు

ఎల్టీ-1(బీ)(1) క్యాటగిరీలో 0-100 యూనిట్ల వరకు రూ.3.30

101-200 యూనిట్ల వరకు రూ.4.30

మొత్తం బిల్లు రూ.2,425

4. 3 నెలలకు 620 యూనిట్లు

నెలకు 207 యూనిట్ల చొప్పున లెక్కింపు

ఎల్టీ-1(బీ)(2) క్యాటగిరీ కింద 200 యూనిట్ల వరకు రూ.5

201-300 యూనిట్ల వరకు రూ.7.20

మొత్తం బిల్లు రూ.3,346

ఈ ఘటనలో ఏడు యూనిట్లు అదనంగా వినియోగించడం వల్ల  శ్లాబు మారిపోయింది.


logo