బుధవారం 03 జూన్ 2020
Telangana - May 19, 2020 , 00:46:15

50% సీట్లతో ప్రయాణం

50% సీట్లతో ప్రయాణం

  • మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి  
  • ఆర్టీసీ కార్మికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బస్సులు నడిపేందుకు ప్రభుత్వం అనుమతించడంతో ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది. సోమవారం ట్రాన్స్‌పోర్ట్‌భవన్‌లో ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్‌ సమావేశమై చర్చించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్‌ సమావేశం తర్వాత రాష్ట్రంలో ఆర్టీసీబస్సులు ప్రారంభిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. 50 శాతం సీట్లతో బస్సులను ఆర్టీసీ నడుపనున్నది.ప్రయాణికులు మాస్కులు ధరించటం, బస్లాండ్లు, బస్సుల్లో కచ్చితంగా భౌతికదూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకో నున్నారు.  బస్సులో నిలబడి చేసే ప్రయాణాలను అనుమతించరు. ప్రతి ట్రిప్‌ తర్వాత బస్సును శానిటైజ్‌ చేయనున్నారు. ఆర్టీసీసిబ్బందికి డిపోల్లో థర్మల్‌స్క్రీనింగ్‌ నిర్వహించాకే అనుమతిస్తారు.. 

శివారు బస్టాండ్ల వరకే అనుమతి 

వరంగల్‌వైపునుంచి వచ్చే బస్సులు ఉప్పల్‌ వరకు, నల్లగొండ వైపు నుంచి వచ్చే బస్సులు హయత్‌నగర్‌ వరకు, మహబూబ్‌నగర్‌వైపు నుంచి వచ్చేవి ఆరాంఘర్‌ వరకు, తాండూర్‌, వికారాబాద్‌ నుంచి వచ్చేవి అప్పా జంక్షన్‌ వరకు, కరీంనగర్‌వైపు వచ్చేవి జేబీఎస్‌వరకు వచ్చేందుకు అనుమతి ఉంటుంది. సిటీబస్సులు లేకపోవటంతో ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌ల్ల్లో ఇండ్లు చేరుకునే అవకాశం ఉన్నది. నగరంలోని ఎంజీబీఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్లలో ఎలాంటి కార్యకలాపాలు జరుగటం లేదు. logo