సోమవారం 01 జూన్ 2020
Telangana - May 11, 2020 , 19:34:16

త్వరలో రోడ్లపైకి ఆర్టీసీ బస్సులు

త్వరలో రోడ్లపైకి ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్‌: నిన్నటివరకు 52 రోజుల సమ్మెను ఎదుర్కొన్న తెలంగాణ ఆర్టీసీ.. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా గత  50 రోజులుగా  మూతపడి ఉన్నది. ఒక్క బస్సు కూడా రోడ్లపైకి రాలేదు. దాంతో పెద్ద ఎత్తున ఆర్థిక నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దశలో గ్రీన్‌జోన్లలో  ప్రజారవాణాకు కేంద్ర  ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగానే రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు బస్సులు నడుపాలని యోచిస్తున్నట్లు సమాచారం. 

ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చజెండా ఊపగానే బస్సులు నడిపేలా సిద్ధం చేస్తున్నట్లు ఆర్టీసీకి చెందిన ఒక అధికారి చెప్పారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో భౌతిక దూరం పాటించాల్సి ఉన్నందున బస్సులో 20 మందికి మించి ప్రయాణించకుండా చర్యలు చేపట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే, అన్ని బస్టాండ్‌లలో శానిటైజర్లు కూడా అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఈ నెల 15 నుంచి ప్రజారవాణాకు ప్రభుత్వం అనుమతిస్తుందని ఆర్టీసీ అధికారులు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తున్నది.


logo