మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 02:16:17

రెండు రాష్ర్టాల మధ్య ఆర్టీసీ రైట్‌.. రైట్‌

రెండు రాష్ర్టాల మధ్య ఆర్టీసీ రైట్‌.. రైట్‌

  • అర్ధరాత్రి నుంచి పునఃప్రారంభం
  • సీఎం కేసీఆర్‌ సూచనలతో కుదిరిన ఒప్పందం
  • పత్రాలు మార్చుకున్న ఎండీలు
  • చార్జీలు పెంచం: మంత్రి పువ్వాడ

తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య ఆర్టీసీ సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ నేపథ్యంలో నిలిచిపోయిన బస్సులు సుమారు ఏడు నెలల తర్వాత ముందుకు కదిలాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సూచనలతో రెండు రాష్ర్టాల ఆర్టీసీల ఎండీలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో సోమవారం రాత్రి నుంచి బస్సుల రాకపోకలు మొదలయ్యాయి. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. ఏపీలో టీఎస్‌ ఆర్టీసీ 1,61,258 కిలోమీటర్ల పరిధిలో 826 బస్సు లు నడుపనుండగా.. తెలంగాణలో ఏపీఎస్‌ఆర్టీసీ 1,60,999 కిలోమీటర్ల పరిధిలో 638 బస్సులు నడుపనున్నది. ఈ మేరకు సోమవారం ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సమక్షంలో టీఎస్‌ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఒప్పందపత్రాలు మార్చుకున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో మార్చి 22న కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో తెలంగాణ- ఏపీ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించినా బస్సులు ప్రారంభం కా లేదు. ఏపీ పునర్విభజన తర్వాత రెండురాష్ర్టాల మధ్య బస్సుల రాకపోకలపై ఎలాంటి ఒప్పందం జరుగలేదని, ఒక అంగీకారానికి వచ్చాకే ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు ఈ అంశంపై టీఎస్‌ ఆర్టీసీ, ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు పలుదఫాలుగా చర్చలు జరిపారు. తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని సైతం భేటీ అయ్యారు. పలు అంశాలపై ఇరురాష్ర్టాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సర్వీసులు పునఃప్రారంభం కాలేదు. తాజాగా ఇందుకు సంబంధించి చర్చలు కొలిక్కి వచ్చాయి.

సీఎం కేసీఆర్‌ సూచనలతో ఒప్పందం: పువ్వాడ

సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు ఏపీతో ఒప్పం దం కుదిరాకే ఇరు రాష్ర్టాల మధ్య బస్సులను నడుపాలని భావించామని మంత్రి పువ్వాడ అజయ్‌ తెలిపారు. కొద్దిగా ఆలస్యమైనా రెండు రాష్ర్టాల అధికారులు సమగ్రమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని ప్రశంసించారు. సహకరించిన ఏపీ మంత్రి పేర్ని నానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఒప్పందం కుదిరిన నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నుంచే బస్సులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. టీఎస్‌ ఆర్టీసీ బస్సు చార్జీల పెంచే ప్రసక్తే లేదని మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి పువ్వాడ బదులిచ్చారు. టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నిబంధనలకనుగుణంగానే ఇప్పటివరకు బస్సులను నడిపినట్టు వెల్లడించారు. లాక్‌డౌన్‌కు ముం దు ఏపీఎస్‌ ఆర్టీసీ తెలంగాణకు నిత్యం 1,009 సర్వీసులను నడిపేదని.. ఇప్పుడు ఆ సంఖ్య 638కే పరిమితమైందని తెలిపారు. టీఎస్‌ఆర్టీసీ ఏపీకి 750 బస్సులను నడుపగా.. ఇప్పుడు ఆ సంఖ్య 820కు పెరుగనుందని వివరించారు. త్వరలో గూడ్స్‌ ఇతర రవాణా వాహనాలను కూడా పునరుద్ధరిస్తామని, ఇంటర్‌ స్టేట్‌ టాక్స్‌ పేమెంట్‌పై త్వర లో మంత్రుల భేటీ ఉంటుందని వెల్లడించారు.